వర్జీనియా ధరపైనే ఆశలు | - | Sakshi
Sakshi News home page

వర్జీనియా ధరపైనే ఆశలు

Mar 15 2026 1:20 AM | Updated on Mar 15 2026 1:20 AM

వర్జీనియా ధరపైనే ఆశలు

జంగారెడ్డిగూడెం: ఈ ఏడాది వర్జీనియా సీజన్‌ అధిక అంచనాలతో ప్రారంభం కానుంది. ఉమ్మడి పశ్చిమలో 5 వేల కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గడచిన రెండు సీజన్‌లలో వర్జీనియా పొగాకు చరిత్రలోనే రికార్డు ధరలు లభించడంతో రైతులు ఈ సీజన్‌లో అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం–1, –2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. 2024–2025 సీజన్‌కు కేజీ అత్యధిక ధర రూ. 456 లభించింది. ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో సరాసరి ధర రూ.297.50 కేజీకి లభించింది. 2023–2024 సీజన్‌కు కేజీకి అత్యధిక ధర రూ. 411 లభించగా, సరాసరి ధర రూ. 300 లభించింది. ఈ సీజన్‌లో కొత్త రికార్డులు నమోదు చేస్తూ గరిష్ట ధర రూ.456 పైబడి, సరాసరి ధర రూ.300 పైబడి లభిస్తుందనే ఆశతో రైతులు ఉన్నారు.

అనుమతికి మించి..

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో 12,021 మంది వర్జీనియా రైతులు 13,864 బ్యారన్‌లు రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా, 29,074 ఎకరాల్లో రైతులు సేద్యం చేశారు. బోర్డు అనుమతించిన దానికన్నా అధికంగా 6,880 హెక్టార్లలో రైతులు వర్జీనియా వేశారు. ఎన్‌ఎల్‌ఎస్‌ పరిధిలో 2025–26 సీజన్‌కు గాను 48.75 మి.కిలోల పంటకు పొగాకు బోర్డు అనుమతించింది. అయితే పంట అధికంగా వేయడం వల్ల ఈ సీజన్‌లో 31.25 మి.కిలోల మేర పంట అధికంగా పండవచ్చని అధికారులు వేస్తున్నారు.

పెరుగుతున్న ఖర్చులు

వర్జీనియా సాగుకు ప్రతి ఏటా సేద్యపు ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. పొలం దుక్కిదున్నిన నాటి నుంచి పచ్చిరొట్ట విత్తనం, దుక్కి, లైనింగ్‌, నారు, తోట వేసేందుకు కూలీలు, పురుగుమందులు, ఎరువులు, అంతర్గత యాజమాన్యం, కలుపు తీత, కలుపు మందు, ఆకు రెలుపు, బ్యారన్‌ క్యూరింగ్‌, కలప, రవాణా ఖర్చులు, బ్యారన్‌ లీజు అన్ని కలుపుకుని ప్రతి ఏటా ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి.

విపరీతంగా పెరిగిన కౌలు, బ్యారన్‌ లీజు

2025–26 పంట కాలానికి పొలం కౌలు, బ్యారన్‌ లీజులు విపరీతంగా పెరిగిపోయాయి. రైతులు పోటీపడి మరీ కౌలు, బ్యారన్‌ లీజులు పెంచి మరీ వర్జీనియా సేద్యానికి దిగారు. పొలం కౌలు ఎకరానికి రూ.70 వేలు, రూ.90వేలు నేల సారవంతాన్ని బట్టి ఉండగా, బ్యారన్‌ లీజు రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు పలికింది. ఇటీవల పొగాకు బోర్డు ఉన్నతాధికారులు, బయ్యర్లు, రైతులతో సమావేశం నిర్వహించారు. దీంతో బయ్యర్లు మార్కెట్‌ పరిస్థితిని బట్టి ధర ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. దీనికి తోడు పొగాకు ఉత్పత్తులపై పెంచిన పన్నుల కారణంగా పొగాకు పంటపై ధర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

25 నుంచి వర్జీనియా కొనుగోళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement