నలభై ఏళ్ల రాజకీయ అనుభవమంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. ఏరు దాటాక తెప్ప తగలెట్టడం.. నమ్మించి వంచించడం ఆయన నైజం. అధికారం కోసం ఎవరితో అయినా జట్టు కడతారు. పొత్తుల పేరుతో కూటములు ఏర్పాటు చేస్తారు. తీరా సీట్ల పంపకానికి వచ్చే సరికి నిజ స్వరూపం బయటకు తీస్తారు. దశాబ్దాలుగా తాను పాటించే నయవంచన సిద్ధాంతాన్నే ఆయన పునరావృతం చేశారు. పేరుకు మాత్రం తిరుపతి అసెంబ్లీ టికెట్‌ను జనసేనకు కేటాయించారు. వెంటనే టీడీపీ నేతలను రెచ్చగొట్టి అసమ్మతి గళం విప్పించారు. ఇందుకోసం నాయకుల మధ్య నిర్మొహమాటంగా విభేదాలను సృష్టించారు. గ్లాస్ గుర్తు అభ్యర్థి నాన్ లోకల్ అంటూ సరికొత్త వివాదాన్ని తెర మీదకు తెప్పించారు. ఇదే కోవలోనే సత్యవేడులో సైతం ఆదిమూలానికి టికెట్ ప్రకటించారు. వెనుక నుంచి తమ్ముళ్లను నిరసనలకు దింపేశారు. తాను అనుకున్నది నెరవేర్చుకోవడమే లక్ష్యంగా నైతిక విలువలకు తిలోదకాలిచ్చేశారు.
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలోనే కీలకమైన తిరుపతి సీటును జనసేనకు కేటాయించడం ఇష్టం లేక చంద్రబాబు టీడీపీ శ్రేణులును రెచ్చగొట్టేశారు. తిరుపతి అభ్యర్థిగా టీడీపీ నేతల్లోనే ఒకరిని జనసేనలోకి పంపి.. వారికే టికెట్ ఇప్పించుకునేందుకు బాబు పథకం రచించినట్లు ప్రచారం సాగుతోంది. పొత్తులో భాగంగా పవన్ కోరినట్టే తిరుపతి టికెట్ జనసేనకు కేటాయించి తాను మాట మీద నిలబడతానని తొలుత అందరినీ నమ్మించారు. బాబు తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కూడా ఆహా.. ఓహో అని కొనియాడారు. ఇంతలోనే తిరుపతి టికెట్ తిరిగి టీడీపీ నేతలకే కట్టబెట్టేందుకు చంద్రబాబు తమ వారిని ఉసిగొల్పారు. అందులో భాగంగానే తిరుపతిలో టీడీపీ నేతలు ‘లోకల్.. నాన్ లోకల్’ అనే వాదనను తెరపైకి తెచ్చారు.
పార్టీ నాయకులతో ఆందోళనలు చేయించేందుకు సిద్ధమయ్యారు. స్థానిక జనసేన నాయకులను కూడా కలుపుని రోడ్డుపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆరణి శ్రీనివాసులు కాకుండా తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తామని రెండు పార్టీల అధినేతలకు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో టీడీపీ నేతలతో పాటు జనసేన శ్రేణులు కలిసి పాల్గొనేలా బాబు స్కెచ్ రూపొందించినట్లు సమాచారం. చంద్రబాబు ఆదేశాల మేరకే టీడీపీ, జనసేన నేతలు తిరుపతిలో ప్రెస్ మీట్లు పెట్టి ఆరణి శ్రీనివాసుల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం.. ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయిస్తున్నారు.
తాజాగా మంగళవారం స్థానిక టీడీపీ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తన అభ్యర్థిత్వంపై అధిష్టానం పునరాలోచించుకోవాలని కోరారు. తనకే టికెట్ ఇప్పిస్తామని భరోసా ఇస్తే జనసేనలో అయినా చేసేందుకు సిద్ధమని ఇరు పార్టీల అధినేతలకు స్పష్టంగా సందేశం పంపించారు. అయితే ఎక్కడా పార్టీ ఆదేశాలను ధిక్కరించబోమని సన్నాయి నొక్కులు నొక్కడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో నివాసం కొనుగోలు చేసి మంగళవారం గృహ ప్రవేశం కూడా చేశారు. పార్టీ కార్యాలయం కూడా అందులోనేనని ప్రకటించారు. ఇకపై తిరుపతిలోనే ఉంటానని చెప్పుకొచ్చారు.
శ్రీకాళహస్తి కోసం ‘కోలా’ పట్టు
పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయిస్తారని, అదే జరిగితే తానే అభ్యర్థి అని కోలా ఆనంద్ ఆశగా ఎదురుచూశారు. తన అనుచురులతో ప్రచారం కూడా ప్రారంభించారు. చివరకు బొజ్జల సుధీర్‌రెడ్డి పేరును ప్రకటించడంతో కోలా ఆనంద్ ఖంగుతిన్నారు. పొత్తు పొడిచినప్పటి నుంచి కోలా ఆనంద్ ఢిల్లీలోనే ఉన్నారు. తనకు టికెట్ ఖరారయ్యేంత వరకు ఢిల్లీ వదిలేదని భీష్మించుకున్నట్లు శ్రీకాళహస్తిలో ప్రచారం సాగుతోంది. నోటిఫికేషన్ లోపు కోలా ఆనంద్ అభ్యర్థిగా ప్రకటించుకుని వస్తారని కమలం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జనసేనలో అసమ్మతి రాగం
ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై జనసేనలోనూ అసమ్మతి రాగం మొదలైంది. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కిరణ్‌రాయల్ ఇంట్లో మంగళవారం నగరంలోని 50 డివిజన్‌ల జనసేన అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఆరణికి సహకరించేది లేదని తీర్మానం చేశారు. డివిజన్ అధ్యక్షులను మార్పులు, చేర్పులు చేస్తున్న ఆరణి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు తెరమీదకు తెచ్చినట్లు నాన్ లోకల్ వద్దు.. లోకల్ అభ్యర్థే ముద్దు అంటూ వెల్లడించారు. పవన్ కల్యాణ్ వద్దే ఈ విషయం తేల్చుకుంటామని కిరణ్ రాయల్ స్పష్టం చేసినట్లు తెలిసింది.


