నెలరోజుల్లో పూర్తి నివేదిక.. సింహాచలం ఘటనపై త్రీమెన్‌ కమిటీ | Three men Committee With Sakshi On Simhachalam incident Report | Sakshi
Sakshi News home page

నెలరోజుల్లో పూర్తి నివేదిక.. సింహాచలం ఘటనపై త్రీమెన్‌ కమిటీ

May 1 2025 7:57 PM | Updated on May 1 2025 7:58 PM

Three men Committee With Sakshi On Simhachalam incident Report

విశాఖపట్నం, సాక్షి: సింహాచలం ఆలయంలో గోడ ఎందుకు కూలింది అనేదానికి కేవలం ఒక్కరు చెప్పినదాని ప్రకారం నిర్ధారణకు రాలేమని.. అందరినీ ప్రశ్నించిన తరువాత ఒక నిర్ణయానికి వస్తామని త్రిసభ్య విచారణ కమిటీ చెబుతోంది. గురువారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ బృందం.. సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడింది.

త్రీమెన్‌ కమిటీ చైర్మన్‌, మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ సాక్షితో మాట్లాడుతూ.. సింహాచలం ప్రమాద ఘటనలో విచారణ కొనసాగుతోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించాం. సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం. ఇంకా కొన్ని వివరాలు సేకరించాల్సి ఉంది. మూడు రోజుల్లో ప్రాధమిక నివేదిక ఇస్తాం. నెల రోజుల్లో పూర్తి నివేదిక సమర్పిస్తాం..

సింహాచలం ఆలయంలో గోడ ఎందుకు కూలింది కారణాలు ఏమిటి అనే దానిపై వివరాలు సేకరిస్తున్నాం. నాసిరకంగా కట్టడం వల్ల జరిగిందా? ప్రణాళిక లేకపోవడం వల్ల జరిగిందా? అనే కోణంలో విచారిస్తున్నాం. కేవలం ఒక్క వ్యక్తి చెప్పిన దాని ప్రకారం నిర్ణయం తీసుకోలేం. అందరినీ ప్రశ్నించిన తరువాత ఒక నిర్ణయానికి వస్తాం. అందరూ అన్ని వివరాలు చెప్పిన తరువాత మళ్ళీ పరిశీలించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

ఇక.. గోడ కూలిన ప్రమాద స్థలిలో విచారణ కమిషన్ రీ వెరిఫికేషన్ చేసింది. ఈ క్రమంలో ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజుపై త్రీమెన్‌ కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే వాళ్లు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారని తెలుస్తోంది. నోట్ ఫైల్, M బుక్, వర్క్ ఆర్డర్, మీటింగ్ మినిట్స్  వంటివి ఏవీ ఫాలో అయ్యారా....? అనే ప్రశ్నలకు అధికారులు తడబడ్డారు.  ప్రసాదం స్కీం పై త్రిసభ్య కమిటీ ఇచ్చిన సి ఫార్సులు ఏమయ్యాయన్న ప్రశ్నకు వాళ్ల దగ్గరి నుంచి సరైన సమాధానాలు రాలేదు. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు పొందకుండా గోడ నిర్మాణం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి దాటాకగోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ నిమిత్తం కూటమి ప్రభుత్వం మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన, ఈగల్‌ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు సభ్యులుగా త్రిసభ్య కమిటీని నియమించింది.

Advertisement
 
Advertisement
Advertisement