ఆ 21 కులాలు రాష్ట్రమంతటా బీసీలే

Those 21 castes are BCs across Andhra Pradesh state - Sakshi

వాటి ఉప కులాలకు సైతం ప్రాంతం, భౌగోళిక పరిమితి తొలగింపు

ఆ కులాల వారికి బీసీ ధ్రువపత్రాల జారీలో ఇబ్బందులు లేకుండా ఆదేశాలు 

2008లో పలు కులాలకు ప్రాంతాలవారీగా బీసీ అవకాశం ఇచ్చిన వైఎస్సార్‌

తాజాగా రాష్ట్రమంతటా పరిధి విస్తరిస్తూ సీఎం జగన్‌ ఆదేశాలు

ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం

సాక్షి, అమరావతి: కొన్ని ప్రాంతాలకే వెనుకబడిన తరగతులు (బీసీ)గా పరిమితమైన 21 కులాలు, వాటి ఉప కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితులను తొలగించి రాష్ట్ర మంతటా బీసీలుగానే పరిగణిస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రాము ఉత్తర్వులు జారీ చేశారు. వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న 138 కులాల్లో 31 కులాలు వాటి కార్యక­లాపాలపై ప్రాంతం, భౌగోళిక పరిమితులను కలిగి ఉన్నాయి. వాటిలో పది బీసీ కులాలు తెలంగాణాలో, 21 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి.

ఆంధ్రప్ర­దేశ్‌లోని 21 కులాలను కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బీసీలుగా పరిగణిస్తున్నారు. ఈ విషయంలో వచ్చిన అనేక అభ్యర్థనలను పరిశీలించిన ప్రభుత్వం ఈ 21 కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితిని తొలగించడం ద్వారా రాష్ట్రం అంతటా బీసీలుగా గుర్తించే అవకాశం దక్కింది. ఆ కులాలకు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా బీసీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

కల్లుగీతపై ఆధారపడిన శెట్టి బలిజ కులానికి మాత్రం రాయలసీమ ప్రాంతంలో ఇది వర్తించదు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు చెందిన అనేక కులాలకు కొన్ని ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు పొందేలా 2008లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అవకాశం కల్పిస్తే, ఇప్పుడు 21 కులాలకు, వాటి ఉప కులాలకు రాష్ట్రమంతటా బీసీలుగా పరిగణిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

ఆ 21 కులాలు ఇవీ..
► బీసీ–ఏ గ్రూప్‌లో ఆరు కులాలు, వాటి ఉపకులాలు ఉన్నాయి. అవి కురకుల, పొండర, సామాంతుల (సామంత, సౌంటియా), పాల ఏకరీ, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నయనివారు, పాలేగారు, తొలగరి, కవలి, ఆసాదుల, కెవుట (కెవుటో, కెవిటి) కులాలు ఉన్నాయి. 

► బీసీ–బీ గ్రూపులో నాలుగు కులాలు, వాటి ఉప కులాలు ఉన్నాయి. వాటిలో అచ్చుకట్లవాండ్లు, గౌడ (ఈడిగ, గౌడ, గమల్లా), కలాలీ, గౌండ్ల, శెట్టి బలిజ (రాయలసీమ మినహా అంతంటా), కుంచిటి వక్కలింగ (వక్కలింగ, కుంచిటిగ), గుడ్ల (గుడ్లయ) కులాలు ఉన్నాయి. 
– బీసీ–డీ గ్రూపులో 11 కులాలు, వాటి ఉప కులాలు ఉన్నాయి. వాటిలో మున్నూరు కాపు, పోలినాటి వెలమ, సదర, అరవ, అయ్యరక, నగరాలు, ముదలర్, ముదిలియర్, బెరి వైశ్య (బెరి శెట్టి), అతిరాస, కుర్మి, కలింగ కోమటి(కలింగ వైశ్య) కులాలు ఉన్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top