బదిలీ చట్టానికి ‘పాత’ర | Teachers have been in the same position for a year despite being transferred | Sakshi
Sakshi News home page

బదిలీ చట్టానికి ‘పాత’ర

Jun 25 2026 5:35 AM | Updated on Jun 25 2026 5:35 AM

Teachers have been in the same position for a year despite being transferred

టీచర్లు బదిలీ అయినా ఏడాదిగా పాత స్థానంలోనే!   

డీఎస్సీ టీచర్ల రాకతో కొంతమందికి మోక్షం  

ఇంకా పాత స్థానాల్లోనే 15 వేల మంది ఉపాధ్యాయులు  

ప్రస్తుత టీచర్ల సర్దుబాటులోనూ వారికి మొండిచేయి 

‘వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌’లోనూ న్యాయం జరగడం లేదని ఆవేదన 

సాక్షి, అమరావతి: ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్కంఠగా మారింది. గతేడాది ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల రెగ్యులేషన్‌ చట్టం–2025’ తెచ్చిన ప్రభుత్వం ఈ చట్టంలోని నిబంధనల ప్రకారమే ఏటా బదిలీలు చేపడతామని ప్రకటించింది. కానీ చట్టం తెచ్చిన ఏడాదిలోనే బదిలీలను అస్తవ్యస్తంగా మార్చేసింది. 2026లో బదిలీలు లేకున్నా ‘పని సర్దుబాటు’ (వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌) పేరుతో బదిలీలకు శ్రీకారం చుట్టింది. అయితే, ఇందులోనూ తమకు న్యాయం జరగడం లేదని బాధితులు వాపోతున్నారు.

గతేడాది జూన్‌ నెలలో జరిగిన బదిలీల్లో రిలీవర్లు లేక 17 వేల మంది ఉపాధ్యాయులు పాత స్థానాల్లోనే కొనసాగారు. డీఎస్సీ తర్వాత వీరికి స్థానచలనం ఉంటుందని చెప్పిన అధికారులు.. కొత్త ఉపాధ్యాయులు వచ్చాక కూడా ఇంకా 15 వేల మందిని పాత స్థానాల్లోనే కొనసాగిస్తు­న్నారు. సాధారణంగా ఒక స్కూల్లో ఉపాధ్యాయులు గరిష్టంగా 8 సంవత్సరాలు మాత్రమే పనిచేయాలి. తర్వాత తప్పనిసరిగా బదిలీ కావాలని చట్టంలో ఉంది. కానీ, 9 సంవత్సరాలు దాటినా వీరి బదిలీ కాగితాల్లో జరిగింది గాని, వాస్తవంగా కదిలే పరిస్థితి మాత్రం కల్పించలేదు. ప్రస్తుతం చేపడుతున్న ఉపాధ్యాయుల సర్దుబాట్లలో కూడా గతంలో బదిలీ అయిన టీచర్ల ప్రస్తావన లేకపోవడంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. 

మొదట్లో 30వేల మంది పాత స్థానాల్లోనే..!
పాఠశాల విద్యాశాఖలో మార్పులు తీసుకొస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఉపాధ్యాయ బదిలీ చట్టం–2025 తీసుకొచ్చింది. దీని ప్రకారం గత మే, జూన్‌ నెలల్లో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టారు. మొత్తంగా 68 వేల మంది టీచర్లకు స్థానచలనం కల్పించారు. అయితే, బదిలీ పొందిన వారిలో రిలీవర్‌ లేకపోతే వారు పాత స్థానాల్లోనే పనిచేయాలని, ఆయా పాఠశాలల్లో 50 శాతం మేరకు మాత్రమే బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్‌ చేయాలని నిబంధన విధించారు. దీంతో బదిలీ అయిన వారు కొత్త స్థానాల్లో రిపోర్టు చేసి తిరిగి పాత స్కూల్లోనే దాదాపు 30 వేలమంది ఉండిపోయారు. 

గతేడాది సెప్టెంబర్‌లో విద్యాశాఖలో దాదాపు 13 వేల మంది కొత్త టీచర్లు రావడంతో కొందరు బదిలీ టీచర్లు వెళ్లిపోగా ఇంకా 17 వేల మంది పాత పోస్టుల్లోనే ఉండిపోయారు. అనంతరం వివిధ సందర్భాల్లో విద్యాశాఖ 2 వేల మందిని ‘రిక్వెస్టు’ బదిలీ పేరుతో స్థానచలనం కల్పించారు. మిగిలిన 15 వేల మంది 9 ఏళ్లుగా పాత పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా వీరి స్థానం ఎక్కడో అర్థంగాని పరిస్థితి నెలకొంది. 

మోడల్‌ ప్రైమరీ స్కూళ్లల్లోనూ ఇదే పరిస్థితి 
ప్రభుత్వం గతేడాది కొత్తగా మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల(ఎంపీఎస్‌)ను ప్రవేశపెట్టింది. 4 వేల ప్రాథమిక పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేసి మొత్తం 9,620 మోడల్‌ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసినా పూర్తిస్థాయిలో టీచర్లను కేటాయించలేదు. ప్రతి మోడల్‌ స్కూల్‌కు ప్రైమరీ స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ (ఎంపీఎస్‌ హెచ్‌ఎం) పోస్టు కేటాయించింది. 3,600 మంది పాత పీఎస్‌ హెచ్‌ఎంలతోపాటు 4,706 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను పీఎస్‌ హెచ్‌ఎంలుగా కన్వర్షన్‌ చేసింది. 

1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న హైస్కూళ్లల్లో 5వ తరగతి వరకు విద్యార్థుల సంఖ్య 31 దాటితే ఒక పీఎస్‌ హెచ్‌ఎంతోపాటు ముగ్గురు ఎస్జీటీల పోస్టులను మంజూరు చేసింది. 45 మంది దాటితే ఎంపీఎస్‌ హెచ్‌ఎం పోస్టును సృష్టించింది. విద్యార్థులు 59 వరకు ఉంటే పీఎస్‌ హెచ్‌ఎం, మూడు ఎస్జీటీ, 60 దాటి ఎన్‌రోల్‌ ఉన్న స్కూళ్లకు పీఎస్‌ హెచ్‌ఎంతో పాటు నాలుగు ఎస్జీటీ పోస్టులను కేటాయించింది.  

కేటాయింపులైతే చేసింది గానీ ఉపాధ్యాయులను మాత్రం ఇవ్వలేదు. ఈ ఏడాది ఎంపీఎస్‌ల్లో విద్యార్థుల సంఖ్యను 60 మందికి పెంచింది. ఈ మేర విద్యార్థులు ఉన్న ఎంపీఎస్‌లు కేవలం 2 వేలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన స్కూళ్లల్లోని ఉపాధ్యాయులను బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం ప్రభుత్వం చేసిన అస్తవ్యస్త ప్రయోగాలకు ఇటు ఉపాధ్యాయులు అటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement