అందరూ తాగుతున్నారు కదా..!
మహిళలకు ఏపీలో భద్రత లేదంటున్నారే..! మరి దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో భద్రత ఉందా..?
విశాఖ ఎయిర్‌పోర్టును కొనసాగించాలా.. వద్దా అన్నది జీఎంఆర్‌దే నిర్ణయం
డేటా సెంటర్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు
మీడియాతో విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్
డాబాగార్డెన్స్ (విశాఖ): ‘విశాఖ బీచ్‌లో బీచ్ షాక్స్ పేరిట మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే తప్పేంటి..? ఈ రోజుల్లో తాగని వారు ఎవరున్నారు? అందరూ తాగుతున్నారు కదా..’ అని టీడీపీ విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ లేదంటున్నారే.. దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో మహిళలకు భద్రత, రక్షణ ఉందా..? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు ఎక్కువవుతున్నాయని, అందుకనే వాటిని తొలగిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌తో కలిసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. గోవా తరహాలో విశాఖ బీచ్‌లో ‘బీచ్ షాక్స్’ పేరిట మద్యం పాలసీ తీసుకొస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారని ఆయన వెల్లడించారు. గూగుల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనివ్వకుండా కొంతమంది సోషల్ మీడియా వేదికగా అడ్డుకుంటున్నారని, అబద్ధపు ప్రచారాలు ఆపి, డేటా సెంటర్‌ను అడ్డుకోవద్దని సూచించారు.
డేట్ సెంటర్ ఏర్పాటుతో 200 మీటర్ల పరిధిలో హీట్‌వేవ్ ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదని చెప్పుకొచ్చారు. డేటా సెంటర్ ఏర్పాటు ప్రారంభంలో కన్‌స్ట్రక్షన్ సమయంలో 40 నుంచి 50 వేల మందికి ఉపాధి దొరుకుతుందని.. కన్‌స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత వెయ్యిలోపే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎంపీ ఒప్పుకున్నారు. విశాఖలో ఉన్న ఎయిర్‌పోర్టును కొనసాగించాలన్నా..వద్దన్నా పూర్తి హక్కు జీఎంఆర్ దే అన్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడితో నిర్మించిన.. భోగాపురం ఎయిర్‌పోర్టు జీఎంఆర్ కోసమేనంటూ ఎంపీ భరత్ చెప్పుకొచ్చారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి నియమ నిబంధనల మేరకు 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదని ఎంపీ వెల్లడించారు.
విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం అంటున్నారని, అది కుదరదంటూ ఎంపీ తేల్చిచెప్పారు. ఎవరు ఏం చెప్పినా విశాఖ విమానాశ్రయం ఉండదని చెప్పారు. పర్యావరణం పేరిట ఇటీవల బీచ్ రోడ్డులో చేపట్టిన సంతకాల సేకరణ (డేటా సెంటర్‌కు వ్యతిరేకంగా)కు నగర పోలీస్ కమిషనర్‌ను పిలిచి మోసం చేశారని ఎంపీ తెలిపారు. సంతకాల సేకరణలో పాల్గొన్న సీపీని తాను ప్రశ్నించగా..పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమమని తనను ఆహ్వానించి మోసం చేసినట్టు తనతో సీపీ చెప్పారన్నారు.


