
అమ్మవారి విగ్రహం, శివలింగం, ఇతర మూర్తుల విగ్రహాల ధ్వంసం
విగ్రహాలను స్వర్ణముఖి నదిలో పడేసిన వైనం
ఈ పాపం టీడీపీ నేత కిషోర్‌రెడ్డిదేనంటున్న ఆలయ నిర్వాహకులు
కిశోర్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు
ఆలయ ధ్వంసానికి రూ.10 లక్షల డీల్
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుచానూరులో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. శ్రీఆదివారాహి ఆలయాన్ని నేలమట్టం చేశారు. అమ్మవారి విగ్రహం, శివలింగం, ఇతర మూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసి స్వర్ణముఖిలో పడేశారు. ఇన్నాళ్లూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడిన టీడీపీ నేతలు ఇప్పుడు వారాహి మాత ఆలయ స్థలంపై కన్నేశారు. అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడి మంగళవారం అర్ధరాత్రి ఆలయాన్ని కూల్చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ దీక్ష చేసిన వారాహి అమ్మవారి విగ్రహం చేతులు విరిచి మరీ నదిలో పడేయడం కలకలం రేపింది.
మారణాయుధాలతో దాడిచేసి..
ఆలయ నిర్వాహకులు, హిందూ సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచానూరులో స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీవారాహి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ కొన్నేళ్లుగా మహారుద్ర వారాహి స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఆలయం ఉన్న భూమి తమదేనంటూ తిరుచానూరుకు చెందిన మణిరెడ్డి, రామిరెడ్డి కోర్టును ఆశ్రయించారు.
ఆలయ నిర్వాహకులు సైతం కోర్టును ఆశ్రయించడంతో కేసు నడుస్తోంది. ఈ నెల 9వ తేదీన రామిరెడ్డి, మణిరెడ్డితో పాటు సుమారు 30 మంది గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో ఆలయ నిర్వాహకులపై దాడికి తెగబడ్డారు. అడ్డొచి్చన మహిళలపై దౌర్జన్యం చేసి ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో బాధితులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నామమాత్రపు కేసులు కట్టి చేతులు దులుపుకున్నారు. దాడికి పాల్పడిన వారు టీడీపీకి అనుకూలం కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడారని బాధితులు ఆరోపించారు.
అర్ధరాత్రి ఆలయం నేలమట్టం
పోలీసుల వైఫల్యంతో మరోసారి కబ్జాదారులు ఆలయంపై విరుచుకుపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి జేసీబీలతో వచ్చి ఆలయాన్ని కూల్చేశారు. ఆపై ఆలయంలోని మూలవిరాట్ శ్రీవారాహి అమ్మవారి విగ్రహంతో పాటు శివలింగం, ఇతర దేవతామూర్తుల విగ్రహాల చేతులు, తలలు నరికేశారు. ఆపై విగ్రహాలను తీసుకెళ్లి స్వర్ణముఖి నదిలో పడేశారు. అక్కడ ఆలయ ఆనవాళ్లు పూర్తిగా తుడిచిపెట్టేశారు. సమాచారం అందుకున్న హిందూ సంఘాలు, జై భజరంగ్‌దళ్ కార్యకర్తలు బుధవారం ఘటన స్థలానికి చేరుకుని స్వర్ణముఖి నదిలో పడేసిన విగ్రహాలను జేసీబీ సాయంతో వెలికితీశారు, అప్పటికే విగ్రహాలు పగిలిపోవడంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి.
హిందూ సంఘాలు, ఆలయ నిర్వాహకులు తిరుచానూరు పోలీసు స్టేషన్ సమీపంలో విరిగిన విగ్రహాలతో నిరసనకు దిగారు. పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకుంటూ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆలయాన్ని కూలి్చవేసి.. ఆ భూమిని అప్పగించేందుకు టీడీపీ నేతలు రూ.10 లక్షలకు ఒప్పందం కుదిర్చుకున్నట్టు సమాచారం. ఈ దురాగతం టీడీపీ నేత కిశోర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని ఆలయ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. కిశోర్‌రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కావడం గమనార్హం.
టీడీపీ నేత అండతోనే కూల్చివేత
శ్రీవారాహి అమ్మవారి ఆలయం కూల్చివేత, విగ్రహాల ధ్వంసం ఘటనలు తిరుచానూరుకు చెందిన టీడీపీ నాయకుడు కిషోర్‌రెడ్డి అండతోనే జరిగిందని జై భజరంగదళ్ జిల్లా అధ్యక్షుడు కిరీఠి ఆరోపించారు. టీడీపీ నేతలు ఆలయాలపై దాడికి పాల్పడడం సహించబోమని, జిల్లావ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ మొత్తం కూటమి కనుసన్నల్లోకి వెళ్లిపోయిందని, సీఐ సునీల్‌కుమార్ కూటమి నేతల దౌర్జన్యాలకు సహకరిస్తున్నారని మండిపడ్డారు.