మాల్‌ కాజేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి కుట్ర | TDP MLA Prathipati Pullarao conspiracy to occupy the mall | Sakshi
Sakshi News home page

మాల్‌ కాజేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి కుట్ర

Jun 10 2026 3:55 AM | Updated on Jun 10 2026 3:55 AM

TDP MLA Prathipati Pullarao conspiracy to occupy the mall

ప్రవాసాంధ్రుల ఆస్తుల్ని కాజేస్తుంటే ఏ ధైర్యంతో వారు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారు

అప్పుల పేరుతో వేధించి మాల్‌ను మూతపడేలా చేశారు 

రూ.90 లక్షల అప్పునకు రూ.7.50 కోట్లు కట్టాలట 

ఆ మొత్తం చెల్లించేందుకు ముందుకొచ్చినా ఒప్పుకోవడం లేదు 

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి

సాక్షి, అమరావతి: అవసరాల కోసం ఒక ప్రవాసాంధ్రుడు (ఎన్నారై) చేసిన అప్పులను ఆసరాగా చేసుకుని తన అనుచరుల ద్వారా చిలకలూరిపేటలో ఉన్న మాల్‌ని కాజేయాలనే కుట్రకు టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెరతీశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రవాసాంధ్రుడు మురళీమోహన్‌ భార్య కృష్ణప్రియతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ ఎన్నారై టీడీపీ కార్యకర్త అని, ప్రత్తిపాటు పుల్లారావు గెలుపు కోసం పనిచేశారని, అయినా ఎమ్మెల్యే ఈ దౌర్జన్యానికి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. 

ప్రవాసాంధ్రుల ఆస్తులను కాజేస్తుంటే ఏ ధైర్యంతో వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సమయంలో అప్పు చేస్తే, నాలుగేళ్లపాటు పట్టించుకోకుండా చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రవాసాంధ్రుడికి చెందిన చిలకలూరిపేటలోని మాల్‌ని చేజిక్కించుకోవాలనే కుట్రతో ఆ కుటుంబంపై వేధింపులు మొదలుపెట్టారని చెప్పారు. దీంతో ఎన్నారై మురళీమోహన్‌ భార్య కృష్ణప్రియ అమెరికా నుంచి వచ్చి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించినట్టు వెల్లడించారు. ఆమె బాధలను విన్న వైఎస్‌ జగన్‌ పార్టీ లీగల్‌ సెల్‌ అండగా ఉంటుందని హామీ ఇచ్చారని చెప్పారు.   

కోర్టు తీర్పును అమలు చేయడం లేదు 
బాధిత ఎన్నారై మురళీమోహన్‌ భార్య కృష్ణప్రియ మాట్లాడుతూ.. ‘20 ఏళ్లుగా అమెరికాలో ఉద్యోగం చేసి కూడబెట్టిన సొమ్ముతో చిలకలూరిపేటలో ఒక మాల్‌ నిర్మించుకున్నాం. అందులో అత్యాధునిక టెక్నాలజీతో రెండు థియేటర్లు, బాంకెట్‌ హాల్, ఎల్రక్టానిక్‌ స్టోర్ని ఏర్పాటు చేశాం. కోవిడ్‌ సమయంలో వ్యాపారం లేని కారణంగా రూ.90 లక్షలు అప్పు చేశాం. దాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా మాల్‌ని పూర్తిగా మూతపడేలా చేశారు. రూ.90 లక్షల అప్పులు చేస్తే నాలుగేళ్లలో రూ.7.50 కోట్లు అయ్యిందన్నారు. 

ఆమొత్తం చెల్లించేందుకు ముందుకొచ్చినా మాల్‌ని అప్పగించేందుకు అంగీకరించడం లేదు. పైగా రూ.7.50 కోట్లు తీసుకుని పారిపోయారంటూ మా మామ ఫొటోలతో పాంప్లెట్లు ప్రింట్‌ చేసి ఊరంతా పంచి పెట్టి మా పరువును రోడ్డున పడేలా చేశారు. రైతుల సొమ్ము రూ.30 కోట్లు కాజేశామంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. మమ్మల్ని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోనివ్వాలని కోర్టు ఉత్తర్వులిచ్చినా పట్టించుకోవడం లేదు. ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడకొచ్చి కూర్చుంటారు. కళ్లముందు దౌర్జన్యాలు కనిపిస్తున్నా వారికేం సంబంధమే లేనట్టు వ్యవహరిస్తున్నారు. 

జనం థియేటర్లకు, మాల్‌కి రాకుండా రోడ్డుపై టెంట్‌ వేసి గుంపులుగా రౌడీలను మోహరించి అడ్డుకున్నా, సీసీ కెమెరాలను పగులగొట్టినా పోలీసులు పట్టించుకోలేదు. దీనిపై మాట్లాడటానికి నా భర్త మురళీమోహన్‌ చిలకలూరిపేట వస్తే డ్రగ్స్‌ కేసులు పెడతామని వేధించి వెనక్కి పంపించారు. వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామని బెదిరిస్తున్నారు. మాకు జరుగుతున్న అన్యాయంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి న్యాయం చేయాలని కోరాం. వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, పార్టీ తరఫున న్యాయ సహాయం అందజేస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement