సాక్షి, అనంతపురం: అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై ఓ వివాహిత మహిళ చేసిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తనకు రావాల్సిన రూ.60 లక్షల బకాయి అడిగితే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. పదేపదే వాట్సాప్ కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో వారి మధ్య ఫోన్ కాల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని భైరవనగర్‌లో తనకు ఉన్న 10 సెంట్ల స్థలాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు రూ.70 లక్షలకు విక్రయించినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రూ.10 లక్షలకు చెక్కు ఇచ్చారని, మిగిలిన రూ.60 లక్షలు చెల్లించాలని అడిగినప్పటి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. భూ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించిన ఆమె, తన భూమికి సంబంధించిన డబ్బుల విషయంలో ప్రశ్నించడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 16న ఎమ్మెల్యే అనుచరులు తనను వెంబడించారని, వారి నుంచి తప్పించుకుని బయటపడ్డానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు బాధితురాలు అనంతపురం డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.
కర్నూలుకు చెందిన ఈ మహిళ.. మంత్రి టీజీ భరత్ సిఫార్సుతో తన భూ సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యేను కలిసినట్లు తెలిసింది. అయితే, తనకు వాట్సాప్ సందేశాలు పంపడం, పదేపదే వాట్సాప్ కాల్స్ చేయడం ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వేధించవద్దంటూ ఎమ్మెల్యేను ప్రాధేయపడినట్లు చెబుతున్న ఫోన్ సంభాషణ కూడా బయటకు రావడంతో ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను వేధించవద్దని బాధితురాలు ప్రాధేయపడినట్టు ఆడియోలో ఉంది. కాగా, మహిళ భూ సమస్య పరిష్కారం కోసం మంత్రి టీజీ భరత్ సిఫార్సు చేసిన నేపథ్యంలో, ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేపైనే ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
భూ వివాదంతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు బెదిరింపులు, వేధింపులు, దాడి యత్నం ఆరోపణల వరకు వెళ్లడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కేసు నమోదు చేస్తారా? ఆరోపణలపై ఎమ్మెల్యే, ఇతర నేతలు ఎలా స్పందిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై కేసు నమోదుకు పోలీసు ఉన్నతాధికారులు తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి: మున్సిపల్ టెండర్లలో గోల్‌మాల్!



