రహదారులు, డ్రైన్లు, వీధిలైట్ల ఏర్పాటుకు రెండు దశల్లో టెండర్లు
నాలుగు అస్మదీయ కంపెనీలకే కాంట్రాక్టులు
తొలి విడత 16 ప్యాకేజీల కింద రూ.2,994.73 కోట్ల అంచనాతో టెండర్లు
4.67 శాతం అధిక ధరలతో రూ.3,134.70 కోట్లకు పనుల అప్పగింత
ఖజానాపై 139.88 కోట్ల అదనపు భారం
తాజాగా 11 పట్టణాల్లో 272.42 కోట్ల విలువైన పనులకు టెండర్లు
4.74 శాతం అధిక ధరలతో రూ.285.34 కోట్లకు ఒక సంస్థకే అప్పగింత
ఈ మొత్తంలో కాంట్రాక్టు సంస్థలు, ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు
బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత పట్టణ, గ్రామ ప్రణాళిక విభాగానిదే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రహదారులు, డ్రైన్లు, విద్యుత్ దీపాలు, రోడ్డు సెంట్రల్ లైటింగ్, పార్కుల అభివృద్ధి వంటి మౌలిక వసతుల కల్పనకు రెండు దశల్లో నిర్వహించిన టెండర్లలో గోల్‌మాల్ జరిగింది. రెండున్నరేళ్ల పాటు మున్సిపాలిటీల ప్రగతిని పట్టించుకోని సర్కారు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎత్తుగడ వేస్తూనే.. అభివృద్ధి పనుల పేరుతో దోచుకోవడానికి సిద్ధమైంది. ఈ పనుల్లో చిన్న కాంట్రాక్టర్లకు చోటులేకుండా చేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) విధానాన్ని తెరపైకి తెచ్చి ఎల్–1గా నిలిచారని చూపుతూ అస్మదీయులకు చెందిన నాలుగు కాంట్రాక్టు సంస్థలకు అధిక ధరలకు పనులు కట్టబెట్టింది.
ప్రతి ప్యాకేజీలోనూ సరాసరిన 4.67 శాతం అధిక ధరలకు పనులు అప్పగించింది. తద్వారా కాంట్రాక్టర్లకు రాష్ట్ర ఖజానాను దోచిపెట్టి ‘నీకింత.. నాకింత’ అని పంచుకు తినేందుకు స్కెచ్ వేశారు. తొలిదశలో 106 పట్టణాలు/నగరాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి 16 ప్యాకేజీల కింద రూ.2,994.73 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు వేర్వేరుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం ప్రజారోగ్య విభాగం సర్కిళ్ల ద్వారా టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో సగటున 4.67 శాతం అధిక ధరలకు కోట్ చేసిన నాలుగు కాంట్రాక్టు సంస్థలు పనులు దక్కించుకున్నాయి.
మొత్తం 16 ప్యాకేజీల పనులను రూ.3,134.70 కోట్లతో చేపట్టేందుకు ముందుకొచ్చాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ.139.88 కోట్ల భారం పడనుంది. తాజాగా గురువారం నెల్లూరు సర్కిల్ పరిధిలోని తిరుపతి, చిత్తూరు జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో రూ.272.42కోట్ల విలువైన పనులను మేఘా సంస్థకే అప్పగించారు. అంచనా వ్యయం కంటే 4.74 శాతం అధికంగా రూ.285.34 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు.ఈ ఒప్పందం వల్ల ప్రభుత్వ ఖజానాపై అధికంగా 12.92 కోట్ల భారం పడనుంది.
అస్మదీయులకే పనుల అప్పగింత
మున్సిపాలిటీల్లో చేపట్టనున్న పనులను సైతం చంద్రబాబు తన అస్మదీయ సంస్థలకే కట్టబెట్టారు. ఎన్‌సీసీ సంస్థకు రూ.767.10 కోట్ల విలువైన 4 ప్యాకేజీలు, మేఘా సంస్థకు తాజాగా కేటాయించిన వాటితో రూ.1,589.57 కోట్ల విలువైన పనులు అప్పగించారు. ఇక సివెట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు రూ.491.16 కోట్ల విలువైన మూడు ప్యాకేజీలు, ఎంపీ సీఎం రమే‹Ùకు చెందిన జేడబ్ల్యూఐఎల్ ఇన్‌ఫ్రా–రిత్విక్ ప్రాజెక్ట్స్ (జాయింట్ వెంచర్)కు రెండు, రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు ఒక ప్యాకేజీ చొప్పున రూ.572.19 కోట్లవిలువైన మూడు ప్యాకేజీల పనులు కట్టబెట్టారు.
కౌన్సిళ్లు గడువు ముగిశాక..
ప్రభుత్వం ఖరారు చేసిన పనులకు ఆమోదం తెలుపుతూ ఆయా మున్సిపల్ కౌన్సిళ్లు తీర్మానాలు చేయాలి. అయితే.. ఎన్నికైన పాలక మండళ్ల గడువు ముగిసిన సమయంలో ఈ విధానాన్ని తెరపైకి తేవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు కావాల్సిన సంస్థలకు పనులు కట్టబెట్టేందుకు ప్రత్యేకాధికారులపై ఒత్తిడి తెచ్చి, తీర్మానాలు చేయించుకోవడానికి ప్రభుత్వం హడావుడిగా ఈ నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైబ్రిడ్ యాన్యుటీతో చెల్లింపులు
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో నిర్మాణ సమయంలోనే 40 శాతం నిధులను పనులు జరిగే మున్సిపాలిటీలే చెల్లించాలి. మిగిలిన 60 శాతం నిధులను 40 త్రైమాసిక వాయిదాల్లో ఆయా మున్సిపాలిటీలు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల ఎంపికైన సంస్థలు పనులు పూర్తి చేసిన తర్వాత కూడా మున్సిపాలిటీలపై దీర్ఘకాలిక చెల్లింపు బాధ్యత కొనసాగుతుంది. దీంతో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పనులు చేసే అవకాశం కూడా ఆయా మున్సిపాలిటీలకు ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ప్రాజెక్టు వ్యయం రూ.5,500 కోట్లే కానీ..
మొత్తం పనులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.7,469.46 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. అయితే ఇందులో రూ.5,500 కోట్లు అసలు ప్రాజెక్టు వ్యయం కాగా, మరో రూ.1,969.46 కోట్లు పదేళ్ల కాలానికి వడ్డీగా చూపించింది. ప్రాజెక్టు వ్యయంతో పోలిస్తే వడ్డీ మొత్తం సుమారు 35.8 శాతం మేర ఉంటుంది. రూ.5,500 కోట్ల అసలు ప్రాజెక్టు వ్యయానికి అదనంగా రూ.1,969.46 కోట్ల వడ్డీ చెల్లించాలి. మరోవైపు యాన్యుటీల చెల్లింపుల కోసం ఎస్క్రో ఖాతాకు నిధులు సమకూర్చే బాధ్యతను పట్టణ, గ్రామ ప్రణాళిక విభాగానికి అప్పగించింది.


