ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో వసూల్‌రాజాలు | TDP Leaders Commissions from network hospitals at Aarogyasri Trust | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో వసూల్‌రాజాలు

Apr 13 2026 5:12 AM | Updated on Apr 13 2026 5:12 AM

TDP Leaders Commissions from network hospitals at Aarogyasri Trust

తొందరగా బిల్లులు ఇప్పిస్తామంటూ కొన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నుంచి కమీషన్లు

బిల్లింగ్‌ మీద ఒక శాతం నుంచి ఐదు శాతం వరకు డిమాండ్‌

బట్టబయలైన ఓ కార్పొరేట్‌ సంస్థ బాగోతం

చెల్లింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని కొద్దికాలంగా యాజమాన్యాల్లో అనుమానాలు

తాజా ఘటనతో అక్రమాల బండారం వెలుగులోకి..

సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో ఆరోగ్య­శ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ అక్రమాలకు అడ్డాగా మారి­పోయింది. ఓ వైపు ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ ఔట్‌ (ఫిఫో) విధానాన్ని తుంగలో తొక్కి చంద్రబాబు బావ­మరిది, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆస్పత్రికి అడ్డదారుల్లో బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తుండగా.. మరోవైపు బిల్లులు తొందరగా ఇప్పిస్తామంటూ ఆ ట్రస్ట్‌లోని ఫైనాన్స్‌ విభాగంలో కొందరు వివిధ ఆస్పత్రుల యజమా­నుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడు­తున్నారు. ఈ బాగోతంపై ఇటీవల ట్రస్ట్‌కు ఫిర్యా­దులు వెళ్లినట్లు సమాచారం. బిల్లింగ్‌ మీద ఒక శాతం నుంచి ఐదు శాతం వరకూ కమీషన్‌ను వారు ఆస్పత్రులకు ఫోన్‌చేసి డిమాండ్‌ చేస్తు­న్నా­రు. పైగా.. వెనకున్న బిల్లులను ఆన్‌లైన్‌లో ముందుగా అప్‌లోడ్‌ చేయడం, ప్రభుత్వం నుంచి బిల్లులు జమ కావడానికి ముందే మీ ఆస్పత్రికి ఇంత మొత్తంలో నిధులు వస్తాయని ఉప్పందించడం ద్వారా కమీషన్లు దండుకుంటున్నట్లు తెలుస్తోంది. 

వాటాల్లో తేడా రావడంతో..
ఈ బాగోతంలో ఇద్దరి మధ్య వాటాల్లో తేడా రావడంతో మొత్తం వ్యవహారం బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఓ కార్పొరేట్‌ సంస్థ తెలంగాణాతో పాటు, ఏపీ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆస్పత్రులను నడుపుతోంది. ఈ సంస్థ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇప్పిస్తామంటూ ఫైనాన్స్‌ విభాగంలోని వారు కొందరు పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో సదరు కార్పొరేట్‌ సంస్థ ఉద్యోగి ఒకరు ట్రస్ట్‌ ఫైనాన్స్‌ విభాగంతో నిత్యం టచ్‌లో ఉంటూ బిల్లులను అప్‌లోడ్‌ చేయించడం, నిధులు జమ అయ్యాక కమీషన్లు ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది. బిల్లులు జమయ్యాక ట్రస్ట్‌కు ఇచ్చే కమీషన్‌లో కొంత మొత్తాన్ని కార్పొరేట్‌ సంస్థ ఉద్యోగి కూడా నొక్కేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో.. ఈ ఉద్యోగిని సైడ్‌చేసి ట్రస్ట్‌ ఫైనాన్స్‌ ఉద్యోగి ఒకరు ఆస్పత్రి యాజమాన్యంతో నేరుగా టచ్‌లోకి వెళ్లి, బిల్లులు జమ అయిన వెంటనే హైదరాబాద్‌కు వెళ్లి ముడుపులు తెచ్చుకుంటున్నాడు. ఇది పసిగట్టిన సదరు ఉద్యోగి మొత్తం బండారాన్ని బట్టబయలు చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ కార్పొరేట్‌ ఆస్పత్రి నుంచి గతేడాది రూ. లక్షల్లో ఫైనాన్స్‌ విభాగానికి కమీషన్లు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాణిజ్య పన్నుల విభాగం నుంచి డిప్యూటేషన్‌పై ట్రస్ట్‌లో పనిచేస్తున్న ఓ అధికారిపైనా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన డిప్యూటేషన్‌ ముగిసినా, సదరు అధికారిపై ట్రస్ట్‌ ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు అందినా ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


రగిలిపోతున్న నెట్‌వర్క్‌ ఆస్పత్రులు..
నిజానికి.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఫిఫో విధానాన్ని తుంగలో తొక్కింది. ప్రాధాన్యతా క్రమంలో చెల్లింపుల పేరిట ప్రత్యేక ఉత్తర్వులిచ్చి నందమూరి బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆస్పత్రికి వేగంగా బిల్లులు చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం అరకొరగా చేపడుతున్న మిగిలిన చెల్లింపుల్లోనూ అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు అనుమానిస్తున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశాల్లోను ప్రస్తావించాయి. ఇప్పుడు తాజాగా వసూళ్ల పర్వం వెలుగుచూడటంతో ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు రగిలిపోతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement