
విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసుల క్రౌర్యం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రశాంతమైన పల్లెలో వారంతా కూలీలు... సన్న చిన్నకారు రైతులు... ఇతర పనులు చేసుకునేవాళ్లు... అర్ధరాత్రి ఆదమరిచి నిద్రిస్తున్నారు... అలాంటి సమయంలో 40 మంది పోలీసులు ఊరిమీద పడ్డారు. ఇళ్లల్లోకి చొరబడ్డారు... దొరికినవారిని దొరికినట్లు జీపుల్లో కుక్కేసి స్టేషన్‌కు తరలించారు. ఇదంతా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం జమ్ములో ఆదివారం జరిగింది. గ్రామంలో శనివారం పండుగ సందర్భంగా చోటుచేసుకున్న చిన్న తగాదాలో అధికార టీడీపీ నాయకుల మాటలు విని పోలీసులు చెలరేగిపోయారు.
అసలు ఏం జరిగిందంటే.. జమ్ము గ్రామంలో శనివారం రాత్రి వైఎస్సార్‌సీపీ, టీడీపీ వారు వేర్వేరుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. టీడీపీ ఊరేగింపులోని యువకులు వైఎస్సార్‌సీపీ ఊరేగింపులో అల్లర్లకు దిగారు. పోలీసులు కూడా వారికే మద్దతుగా నిలిచారు. వైఎస్సార్‌సీపీ యువతపై దాడి చేసి లాఠీలకు పని చెప్పారు. ప్రశాంతంగా ఊరేగింపు చేస్తున్నా ఎందుకు కొడుతున్నారని వైఎస్సార్‌సీపీ యువత ప్రశ్నించారు.
ఈ సమయంలో అదుపుతప్పి ఒకరిద్దరు పోలీసులు కిందపడ్డారు. దీన్నే తీవ్రమైన నేరంగా పరిగణించిన పోలీసులు... ఆదివారం అర్ధరాత్రి జమ్ము గ్రామం మీద పడ్డారు. గర్భిణులని కూడా చూడకుండా కాళ్లతో తన్నారు. పురుషుల్లో దొరికినవారిని దొరికినట్లు కొట్టుకుంటూ జీపుల్లోకి ఎక్కించి విజయనగరం రూరల్ స్టేషన్‌కు తరలించారు. కాగా, సర్పంచ్ జమ్ము నరసింహమూర్తితో సహా 23 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను తప్పించి 20 మంది వైస్సార్‌సీపీ కార్యకర్తలను రిమాండ్‌కు తరలించారు.