విజయనగరం
చేయని పనులు చెప్పుకోవడం సిగ్గుచేటు రైతులు, ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పండి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్డున పడుతున్న రైతాంగం కొనుగోలు కేంద్రాల్లేక నష్టపోయిన మొక్కజొన్న రైతులు అన్నదాత సుఖీభవ అమల్లో ఘోర వైఫల్యం యువతకు ఉద్యోగాల కల్పనలో అసత్య ప్రకటనలు అబద్ధాలు మాని ప్రజలకు మేలు చేయండి జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
న్యూస్‌రీల్
గతంలో ధరల స్థిరీకరణ నిధితో రైతులకు అండ
అమాత్యా..
మీకిది తగునా...!
జిల్లాకు, ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పండి...
సోమవారం శ్రీ 24 శ్రీ నవంబర్ శ్రీ 2025
విజయనగరం:
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమైందని జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. నగరంలోని ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా లో రైతాంగం పడుతున్న ఇబ్బందులపై బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి తెలియజేస్తే జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అవన్ని అసత్య ఆరోపణలని, చంద్రబాబు ప్రభుత్వంలో రైతాంగం ఆనందంగా ఉన్నారని చెప్పటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుండటం నిజం కాదా.. అని ప్రశ్నించారు. బాధ్యత గల మంత్రిగా అసత్యపు ప్రకటనలు చేయటం తగ దని మండిపడ్డారు. అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వమే సకాలంలో స్పందిస్తే రైతులు ఎందుకు ఇబ్బందులు పడతారని నిలదీశారు. స్వయానా జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గం పరిధిలోనే పత్తి పంట సాగించిన రైతు తనకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం మంత్రికి తెలియదా.. అంటూ ప్రశ్నించారు.
మొక్కజొన్న రైతులకు చంద్రబాబు ప్రభుత్వం తీరుతో తీవ్ర అన్యాయం జరిగిందని మజ్జి శ్రీనివా సరావు స్పష్టం చేశారు. పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమైన విజయనగరంలో జిల్లాలో వరి, మొక్కజొన్న పంటలు ప్రధానంగా రైతులు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో చెరుకు పంటను సాగు చేయగా... సంబంధిత కర్మాగారాలు మూతపడటంతో పాటు రెండవ పంటగా మొక్కజొన్న సాగుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారన్న విషయం అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఖరీఫ్‌కు ముందుగా సాగు చేసిన మొక్కజొన్న పంట దిగుబడికి వచ్చినా ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవటం నిజం కాదా.. అని మంత్రి కొండపల్లిని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరగా క్వింటా మొక్కజొన్నకు రూ.2,400 ప్రకటించినప్పటికీ జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక రూ.1700 నుంచి రూ.1800 ధరకే రైతులు విక్రయించి నష్టాలను చవిచూశారని వివరించారు. మొంథా తుఫాన్ రావటంతో రైతులు పండిన పంటకు ఎక్కడ ధర లభించకపోతుందన్న భయంతో దళారులకు తక్కువ మొత్తానికి మొక్కజొన్నను విక్రయించారని చెప్పారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించటం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయ స్థాయిలో మొక్కజొన్న కొనుగోలు చేస్తున్న అన్నవరం ప్రాంతంలో ఒక కంపెనీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను కాదని, రైతుల నుంచి కేవలం రూ.1900కు కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వం, మంత్రులు నిద్రపోతున్నారా.. అంటూ ప్రశ్నించారు. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం శతశాతం కనిపిస్తోందని, ప్రభుత్వం, మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఎందుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
వర్షాభావ పరిస్థితుల్లో ఒకప్పుడు వరి సాగులో జిల్లా వెనుకంజలో ఉంటే నేడు లక్షలాది టన్నులు దిగుబడి ఎలా సాధిస్తుందో మంత్రి తెలుసుకోవాల ని హితవు పలికారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించటంతో పాటు, ప్రాజెక్టులు పూర్తి చేయటం ద్వారా రైతాంగానికి భరోసా నిలవటంతో రైతులు సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు 100 శాతం రైతుల నుంచి దళారుల ప్రమేయం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ పేరిట రైతులందరికీ ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం అరకొరగా ఆ పథకాన్ని అమలు చేసి చేతులు దులుపుకున్నారని మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. గడిచిన రెండు ఖరీఫ్ సీజన్‌లలో కలిపి ఒక్కో రైతుకు రూ.40,000 అందాల్సి ఉండగా.. కేవలం రూ.14వేలు మాత్రమే ఖాతాల్లో వేయటం రైతులంతా గమనిస్తున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 2.50 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేయగా.. చంద్రబాబు ప్రభుత్వం 2.20 లక్షలకు తగ్గించటంలో అంతర్యమేమిటని నిలదీశారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ అంతా తమ ఆధీనంలో ఉంటుందని చెప్పటం ప్రజలను నమ్మించి మోసగించటమే అన్నారు. ఒకసారి ప్రైవేటు వ్యవస్థకు అప్పగిస్తే ప్రభుత్వం చెప్పినట్లు వాళ్లు ఎందుకు వింటారని ప్రశ్నించారు. అందుకే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదే విధంగా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతంలో తీర్మానం చేస్తే 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 30 డిపార్ట్‌మెంట్‌లను ప్రైవేటీకరించటాన్ని ప్రజలంతా అర్ధం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్షంపై బురద చల్లడం మానుకుని ప్రజలకు మంచి చేసే ఆలోచనలు చేయాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి.సూర్యనారాయణరాజు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్ పాల్గొన్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటే చంద్రబాబు ప్రభుత్వం రైతాంగం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని దుమ్మెత్తిపోశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పా టు చేసి కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచారని గుర్తు చేశా రు. చంద్రబాబు ప్రభుత్వం పండిన పంటకు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని ఎత్తి వేయటంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపో వటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాకు, స్థానిక ప్రజలకు గడిచిన 18 నెలల్లో ఏం మంచి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వారి చెబుతున్న అవాస్తవాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే 1.60 లక్షల సచివాలయ ఉద్యోగులు కల్పిస్తే.... కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 16వేల డీఎస్సీ పోస్టులు చేసి గొప్పులు చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్‌లో ప్రకటించిన ఆడబిడ్డ నిధి, 50 సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్, ఉచిత గ్యాస్ సిలిండర్, నూతన పింఛన్ల మంజూరు ఏమయ్యాయని నిలదీశారు.


