పిక్నిక్‌లో విషాదం
● ‘జంఝావతి’లో ముగ్గురి గల్లంతు ● కొనసాగుతున్న గాలింపు చర్యలు ● కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
కొమరాడ:
పిక్నిక్ కోసం సరదాగా జంఝావతి రబ్బరు డ్యాం వద్దకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం సాయంత్రం డ్యాంలో స్నానానికని దిగి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యు లు డ్యాం వద్దకు చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో పిక్నిక్ కాస్త విషాదంగా మారింది. దీనికి సంబంధించి స్థానికులు, ఎస్‌ఐ నీలకంఠం తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. శివిని గ్రామానికి చెందిన అధికారి గోవిందనాయుడు(35), అరసాడ ప్రదీప్(29), రాయఘడ శరత్‌కుమార్(17) ముగ్గురూ కలిసి ఆదివారం పిక్నిక్ కోసమని జంఝావతి డ్యాంకు వెళ్లారు. ఉదయం పూట సరదాగా...ఉల్లాసంగా గడిపారు. సాయంత్రం తిరుగు ముఖానికి ముందు డ్యాంలో స్నానానికని ప్రదీప్, శరత్‌కుమార్ దిగారు. డ్యాంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మునిగిపోయారు. దీన్ని గమనించిన గోవిందనాయుడు వారిని కాపాడేందుకు డ్యాంలో దిగి మునిగిపోయాడు. ముగ్గురు గల్లంతవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పార్వతీపురం సీఐ రంగనాధ్, ఎస్‌ఐ నీలకంఠం, అగ్నిమాపక సిబ్బంది వెనువెంటనే డ్యాం వద్దకు చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు.
గల్లంతైన వారిలో అధికారి గోవిందనాయుడు గ్రామంలోనే వెల్డింగ్ షాపు నడుపుతున్నాడు. ఈయనకు భార్య సంధ్య, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ప్రదీప్ మూడు నెలల కిందట భీమవరంలోని రొయ్యల కంపెనీలో పని చేసేందుకు వెళ్లి ఇటీవలె గ్రామంలో ఒక వివాహానికి ఇక్కడకు వచ్చాడు. ప్రదీప్ తల్లిదండ్రులు వ్యవసాయంతో పాటు కూలి పనులకు వెళ్తుంటారు. శరత్‌కుమార్ పార్వతీపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈయన తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ బిడ్డను చదివిస్తున్నారు. ఇలా అందరి కుటుంబాలు ఏదో ఒక పనిపై ఆధారపడే జీవితాలే... దీంతో వీరి కుటుంబాలతో పాటు శివినిలో విషాదం అలుముకొంది. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు డ్యాం వద్దకు చేరుకొని కన్నీరుమున్నీరవుతున్నారు.
జంఝావతి రబ్బరు డ్యాం ఓ పిక్నిక్ స్పాట్‌గా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. పర్యాటకులు నిత్యం ఇక్కడకు వస్తూ ఉల్లాసంగా గడుపుతూ వెళ్తారు. అయితే ఇక్కడ కనీస రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉండగా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. గతంలో 2018లో కూడా పార్వతీపురం మండలానికి చెందిన ఎంబీబీఎస్ వైద్య విద్యార్థి పిక్నిక్ కోసం వచ్చి డ్యాంలో స్నానానికి దిగి మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతోనే మళ్లీ ఇలాంటి దుర్ఘటన జరిగిందని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికై నా డ్యాం వద్ద పర్యాటకులకు సంబంధించిన రక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
పిక్నిక్‌లో విషాదం


