సాక్షి, కృష్ణా: గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఓ లారీని ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక వస్తున్న కారు.. ట్రావెల్స్ బస్సును ఢీకొంది. అయితే, ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గాయపడటంలో అతడిని ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. గన్నవరం వే బ్రిడ్జ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 18 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు.. బస్సును వెనుక నుండి ఢీకొన్న కారణంగా కారు ముందు భాగంగా పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.
అయితే, లారీ హనుమాన్ జంక్షన్ నుండి హైదరాబాద్ వెళ్లేందుకు వే బ్రిడ్జి వద్ద యూటర్న్ తీసుకుంటుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఇక, ఎస్‌వీకే ట్రావెల్స్ బస్సు విజయవాడ నుండి శ్రీకాకుళం పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తుంది. ఈ ప్రమాదం కారణంగా బస్సు డ్రైవర్ గాయపడటంతో అతడిని పిన్నమనేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


