
ఎమ్మెల్యే బాలకృష్ణతో టీడీపీ కార్యకర్త
మహిళతో టీడీపీ కార్యకర్త అసభ్య ప్రవర్తన
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాకాలో ఘటన
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేసిన ఓ మహిళను ఆసుపత్రిలో శానిటేషన్ పనులు చేయించే టీడీపీ పట్టణ నాయకుడు యుగంధర్(చింటు) ఉద్యోగం నుంచి తొలగించాడు. ఆమె ఉద్యోగం కోసం అనేక మార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో ఓ టీడీపీ కార్యకర్త నుంచి సదరు మహిళ సెల్‌కు కాల్ వచ్చింది. తాను సహాయం చేస్తానని, నీకు తిరిగి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అయితే తనతో పాటు చింటుకు కమిట్‌మెంట్ ఇవ్వాలని నిస్సిగ్గుగా అడిగాడు.
ఆ ఆడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను అలాంటి దానిని కాదని, డబ్బులు కావాలంటే ఇస్తానని బాధితురాలు చెప్పగా.. ‘డబ్బు వద్దు’ అని చెబుతూ గట్టిగా మాట్లాడుతూ ‘ఒప్పుకుంటే ఇప్పిస్తా.. లేదంటే లేదు’ అని తేల్చి చెప్పాడు. అది లేకుండా ఉద్యోగం కుదరదా? అని సదరు మహిళ ప్రశ్నిస్తూ..‘ఎవరు అడిగారు’ అని అడగ్గా.. తానే అడిగానంటూ అంటూ సదరు వ్యక్తి చెప్పడం గమనార్హం.
కాగా, ఈ ఘటన వారం క్రితం జరిగినట్లుగా తెలుస్తోంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. హిందూపురం పట్టణానికి చెందిన టీడీపీ నేత చింటు ఈ వ్యవహారం అంతా తనకు చుట్టుకుంటుందని తెలిసి నిందితుడి తరఫున మాట్లాడి తప్పించే ప్రయత్నం చేశాడు. ఇది కాస్తా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల దగ్గరకు వెళ్లగా.. విషయం బయటకు పొక్కకుండా చేసినట్టుగా తెలుస్తోంది.