28% పనుల కోసం రూ.524.70 కోట్లు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో
రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ
72 శాతం పనులకు రూ.363.68 కోట్లు
మిగతా 28 శాతం పనులకు మాత్రం ఏకంగా రూ.524.70 కోట్లు
అంతులేని అవినీతి, దోపిడీకి ఇది మరో నిదర్శనమంటున్న ఇంజినీర్లు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ల కోసం రాజధానిలో 432 ఫ్లాట్ల నిర్మాణం
2017లో రూ.635.90 కోట్లతో ఎన్‌సీసీ సంస్థకు సీఆర్‌డీఏ పనుల అప్పగింత..
2019 నాటికి రూ.363.68 కోట్లతో 72% పనులు పూర్తి
మిగిలిన పనుల అంచనా వ్యయం రూ.272.22 కోట్ల నుంచి రూ.524.70 కోట్లకు పెంపు
ఈ లెక్కన ఒకేసారి అంచనా వ్యయం ఏకంగా రూ.252.48 కోట్లు పెంపు
పరిపాలన అనుమతి లేకుండానే ఆ పనులను మళ్లీ ఎన్‌సీసీకే కట్టబెట్టిన వైనం
స్టీలు, సిమెంట్, నిర్మాణ సామగ్రి ధరల్లో వ్యత్యాసం లేదు.. పైగా ఇసుక ఉచితం
అయినా దాదాపు వంద శాతం అంచనా వ్యయం పెంచేయడంపై సర్వత్రా విస్మయం.. పెంచిన అంచనా వ్యయం మొత్తం బిగ్‌బాస్ జేబులోకే అంటున్న అధికార వర్గాలు
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలు దోపిడీకి సర్కారు పెద్దలు బరితెగించారు. ఇష్టారాజ్యంగా అంచనా వ్యయం పెంచేసి ‘నీకింత–నాకింత’ అంటూ పంచుకుంటున్నారు. తుదకు పరిపాలనా అనుమతులు లేకుండానే పనులు కట్టబెట్టారంటే ఏ రీతిన అవినీతికి పాల్పడుతున్నారో ఇట్టే స్పష్టమవుతోంది. రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ కోసం ఎస్+12 పద్ధతిలో 18 టవర్లలో 432 ఫ్లాట్ల (యూనిట్లు) నిర్మాణ పనులు 2019 నాటికే 72 శాతం పూర్తయ్యాయి. ఆ పనులకు రూ.363.68 కోట్లు బిల్లులు చెల్లించారు. మిగిలిన 28 శాతం పనుల వ్యయం రూ.272.22 కోట్లు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.524.70 కోట్లకు పెంచేసి, 2017లో వాటిని అప్పగించిన ఎన్‌సీసీ సంస్థకే మళ్లీ ఇప్పుడు కట్టబెట్టారు.
అంటే.. అంచనా వ్యయాన్ని రూ.252.48 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. 2018–19 నాటితో పోల్చితే ఇప్పుడు స్టీలు, సిమెంటు, పెట్రోల్, డీజిల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యతాస్యం లేదు. పైగా ఇసుక ఉచితం. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 92.75 శాతం పెంచేయడంపై ఇంజినీర్లు నివ్వెరపోతున్నారు. పెంచేసిన అంచనా వ్యయం మొత్తం బిగ్‌బాస్ జేబులోకి చేరుతుందంటున్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలు దోపిడీకి ఇది మరో నిదర్శనమని ఇంజినీర్లు చెబుతున్నారు. రూ.608 కోట్ల అంచనా వ్యయంతో 432 ఫ్లాట్ల నిర్మాణానికి 2017లో సీఆర్‌డీఏ టెండరు పిలిచింది.
4.59 శాతం అధిక ధరలకు కోట్ చేసి రూ.635.90 కోట్లకు ఆ పనులను ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. ఈ పనులను ఎన్‌సీసీకి అప్పగిస్తూ 2017 నవంబర్ 13న సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం 2019 ఫిబ్రవరి 12 నాటికి ఈ పనులు పూర్తి కావాలి. అయితే 2019 నాటికి 72 శాతం పూర్తయినట్లు.. అందుకు రూ.363.68 కోట్లను వ్యయం చేసినట్లు 2023లో కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తేలి్చంది. అంటే.. మిగిలిన 28 శాతం పనుల అంచనా వ్యయం రూ.272.22 కోట్లు మాత్రమే.

రద్దు చేసి.. అంచనా వ్యయం పెంపు
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేశారు. మిగిలిన 28 శాతం పనుల అంచనా వ్యయాన్ని రూ.272.22 కోట్ల నుంచి రూ.524.70 కోట్లకు పెంచేసి మళ్లీ టెండర్లు పిలిచి.. అదే ఎన్‌సీసీ సంస్థకు మళ్లీ అప్పగించారు. అంటే.. నాడూ, నేడూ వాటిని టెండర్ ద్వారా ఒకే కాంట్రాక్టు సంస్థకు అప్పగించారన్నది స్పష్టమవుతోంది. సాంకేతికంగా చూస్తే.. 2017లో ఆ పనులను దక్కించుకున్న సంస్థే 2025లో వాటిని మళ్లీ దక్కించుకోవడం సాధ్యం కాదు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేయక ముందే సిండికేట్ కాంట్రాక్టర్లకు బిగ్‌బాస్ దిశా నిర్దేశం చేసి.. సీఆర్‌డీఏ అధికారులకు కనుసైగ చేయడం వల్లే పెంచిన అంచనా వ్యయంతో చేపట్టిన పనులను మళ్లీ ఎన్‌సీసీకే కట్టబెట్టారని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు.
పరిపాలన అనుమతి లేకుండానే ఒప్పందం
అంచనా వ్యయాన్ని రూ.524.70 కోట్లకు పెంచేస్తూ చేపట్టిన పనులను పరిపాలన అనుమతి లేకుండానే సీఆర్‌డీఏ అధికారులు ఏప్రిల్ 28న ఎన్‌సీసీ సంస్థకు కట్టబెట్టేస్తూ ఒప్పందం చేసుకున్నారు. కాంట్రాక్టు అగ్రిమెంట్ విలువలో పది శాతం (ఐదు శాతం మెషినరీ, ఐదు శాతం లేబర్) మొబిలైజేషన్ అడ్వాన్స్‌ను కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మేరకు ఎన్‌సీసీ సంస్థకు మెషినరీ విభాగం కింద 5 శాతం... అంటే రూ.26.68 కోట్లు చెల్లించాలని సీఎఫ్‌ఎంఎస్ (కాంప్రహెన్షివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ద్వారా పీఏవో (పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్)కు సీఆర్‌డీఏ అధికారులు ప్రతిపాదన పంపారు. పరిపాలన అనుమతి లేకుండా ఆ పనిని చేపట్టిన నేపథ్యంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించలేమంటూ పీఏవో దానిని సీఆర్‌డీఏ అధికారులకు తిప్పి పంపారు. దాంతో సీఆర్‌డీఏ అధికారులు చేసుకున్న ఒప్పందాన్ని కేబినెట్‌లో ఆమోదింపజేసి.. జూలై 13న ఆ పనులకు పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయించడం గమనార్హం.

రూ.457.92 కోట్లకు పైగా దోపిడీ!
రాజధానిలో ప్రభుత్వం సీఆర్‌డీఏ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులకు నిర్మీస్తున్న తరహాలోనే హైదరాబాద్ మహా నగరంలో అత్యంత ప్రాధాన్యమైన ప్రాంతంలో, ఇటాలియన్ మార్బుల్స్, అత్యాధునిక హంగులతో నిర్మీంచిన ఫ్లాట్ల ధర ఒక్కొక్కటి రూ.కోటికి మించదని ఇంజినీర్లు, రియల్టర్లు, బిల్డర్లు గుర్తుచేస్తున్నారు. అది కూడా భూమి విలువతో కలిపి. కానీ.. సీఆర్‌డీఏ పరిధిలో భూమి ఉచితం.. ఇసుక ఉచితం.. అయినా సరే 432 ఫ్లాట్ల అంచనా వ్యయం రూ.888.38 కోట్లు. (2019 నాటికి చేసిన వ్యయం రూ.363.68 కోట్లు+తాజా వ్యయం రూ.524.70 కోట్లుకు చేరుకుంది.) అంటే.. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయం రూ.2.06 కోట్లు. ఈ లెక్కన ఒక్కో ఫ్లాట్‌పై రూ.1.06 కోట్లు చొప్పున అధికంగా వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనిని బట్టి ఈ ఫ్లాట్ల నిర్మాణంలో మొత్తంగా రూ.457.92 కోట్లకుపైగా దోపిడీ చేస్తున్నారని ఇంజినీర్లు చెబుతున్నారు.


