
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలకు మరింతగా బరితెగిస్తోంది. ఎంతగా అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సహజ మరణాలు, వృద్ధాప్య, అనారోగ్యసమస్యలతో మరణాలనూ వక్రీకరిస్తూ అక్రమ కేసుల నమోదుకు తెగబడుతోంది. 2022, మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 16 మంది మరణించారు. కోవిడ్ అనంతర అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలతో వారు మరణించారు.
వీటిపై అప్పట్లోనే ఎల్లో మీడియా సహకారంతో అప్పటి ప్రతిపక్ష టీడీపీ రాద్ధాంతం చేసింది. కల్తీసారా తాగి మరణించారని దుష్ప్రచారం చేసింది. అప్పట్లోనే విచారణ చేపట్టిన అధికారులు ఆ 16 మంది అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే మరణించారని నిర్ధారించారు. కాగా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ మరణాలపై విచారణ పేరుతో కొత్త కుట్రకు తెరతీయడం గమనార్హం.
ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ వత్తాసు
⇒ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
మరో అక్రమ కేసుకు తెరతీయాలన్న టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కుట్రకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వత్తాసు పలికారు. మూడేళ్ల క్రితం నాటి సహజ మరణాలపై తాజాగా ఆయన సందేహం వ్యక్తం చేయడమే అందుకు నిదర్శనం. ఆ మరణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల నివేదిక పంపారు. కల్తీ సారా వల్లే ఆ మరణాలు సంభవించాయని ఎఫ్‌ఎస్‌ఎల్ వెల్లడించిందని కూడా ఆయన ఏకపక్షంగా ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హం. విచారణతో నిమిత్తం లేకుండా ఏకంగా డీజీపీనే ఏకపక్షంగా కల్తీ సారా అని చెప్పేయడం విడ్డూరంగా ఉంది.
అంటే రాబోయే నివేదిక ఎలా రూపొందించాలన్నది కూడా ఆయన పోలీసు అధికారులకు పరోక్షంగా స్పష్టం చేశారు. ఇక తాము అనుకున్నట్టుగా డీజీపీ ద్వారా నివేదిక రాగానే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ మరణాలపై దర్యాప్తునకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిశోర్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ విభాగం అధిపతి కె.ఉమామహేశ్వరరావుతో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 2022లో జంగారెడ్డిగూడెంలో 16మంది మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, అప్పటి అధికారులు చేపట్టిన విచారణలో లోపాలు ఉంటే గుర్తించాలని, తదుపరి తీసుకోవాల్సిన న్యాయ, పరిపాలన, సాంకేతికపరమైన చర్యలను సూచించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే 16 మంది మృతి
⇒ ఆనాడే అధికారుల దర్యాప్తులో వెల్లడి
జంగారెడ్డిగూడెంలో 2022 మార్చిలో 16మంది మృతిపై అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే దర్యాప్తునకు ఆదేశించింది. అప్పటి పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేశారు. ఆర్డీవో ప్రసన్నలక్ష్మి, డీఎంహెచ్‌వో బి. రవి నేతృత్వంలో రెవెన్యూ, వైద్య అధికారులు మరణించిన 16 మంది నివాసాలకు వెళ్లి విచారణ చేశారు. మృతుల బంధువుల వాంగ్మూలాలను నమోదు చేశారు.
వారి కుటుంబ పరిస్థితులను అధ్యయనం చేశారు. వైద్య నివేదికలు పరిశీలించారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నిర్ధారించారు. వారిలో ముగ్గురికి మాత్రమే మద్యం వ్యసనం ఉందని కూడా తేల్చారు. వారు కూడా జంగారెడ్డిగూడెంలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. వారి మరణానికీ కేవలం మద్యంపానం ఒక్కటే కారణం కాదు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు.
ఆ నివేదిక ప్రకారం ఆ 16 మంది మృతికి కారణాలు ఇవీ...

నాటి ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ విచారణలోనూ అదే వెల్లడి
ఆయనే ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ మరణాలపై పోలీసు విచారణ కూడా నిర్వహించింది. అప్పటి ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఆ విచారణ నిర్వహించారు. ఆయన జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. అప్పటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైమావతి, ఆర్డీవో ప్రసన్న లక్ష్మి, డీఎంహెచ్‌వో బి.రవి, డిప్యూటీ డీఎంహెచ్‌వో మురళీకృష్ణ, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్) అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి, సూపరింటెండెంట్ బి.అరుణ కుమారి, డీఎస్పీ కేవీ సత్యనారాయణ తదితరులతో సమీక్షించారు.
వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నివేదించారు. అప్పుడు దర్యాప్తు నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ప్రస్తుతం రాష్ట్ర ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు కూడా. కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి అక్రమ కేసు నమోదుకు సిద్ధపడుతుండటం కేవలం రాజకీయ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది.