
తిరువూరు ఎమ్మెల్యేను విచారణకు పిలిచినట్టు టీడీపీ క్రమశిక్షణ సంఘం హంగామా
బాధితులపై లేనిపోని నిందలు మోపిన ఎమ్మెల్యే కొలికపూడి
దాన్ని కవర్ చేసేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు
సాక్షి, అమరావతి: గొడవలు, ఘర్షణలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారాన్ని మసిపూసి మారేడుకాయ చేసేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నట్టు, చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు లీకులు ఇచ్చి పార్టీ క్రమశిక్షణ సంఘం సోమవారం ఆయన్ను విచారణకు పిలిచింది. కానీ.. విచారణలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు తన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ తప్పంతా బాధితులదేనని, వాళ్లు వైఎస్సార్‌సీపీకి చెందిన వారని తేల్చేశారు.
క్రమశిక్షణ సంఘంలోని సభ్యులు బీసీ జనార్థన్‌రెడ్డి, ఎంఏ షరీఫ్, వర్ల రామయ్య, కొనకళ్ల నారాయణ కూడా ఆయన చెప్పింది నిజమేనని భావిస్తున్నట్టు టీడీపీ నేతల ద్వారా తెలిసింది. ఈ నెల 11న ఎ.కొండూరు మండలం గోపాలపురంలోని టీడీపీ నేత భూక్యా రాంబాబు ఇంటికెళ్లిన ఎమ్మెల్యే అక్కడ సివిల్ వివాదంలో తలదూర్చారు. రాంబాబు ఇంటి పక్కనే ఉన్న భూక్యా కృష్ణ ఇంటిని ఆక్రమించి రోడ్డు నిర్మించడంతో వారు అప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ గొడవలో తలదూర్చిన ఎమ్మెల్యే కొలికపూడి.. బాధితుడు కృష్ణ ఇంట్లోకి వెళ్లి ఆయన్ను, ఆయన భార్య చంటిని ఇష్టం వచ్చినట్టు దూషించడంతోపాటు కొట్టారనే ఆరోపణలు వచ్చాయి. మనస్తాపం చెందిన చంటి ఆత్మహత్యాయత్నం చేశారు.ఎమ్మెల్యే వైఖరిపై నియోజకవర్గంలోనే కాకుండా బయట ప్రాంతాల్లోనూ ఆగ్రహం వ్యక్తమైంది.
ఇదో డ్రామా
టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వస్తుండడం, కొలికపూడి వ్యవహారంతో అది బహిర్గతమవడంతో చంద్రబాబు కవరింగ్ రాజకీయాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కొలికపూడిని విచారిస్తున్నట్టు, ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు టీడీపీ వర్గాలు లీకులిచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం క్రమశిక్షణ సంఘం ఎదుట విచారణకు హాజరైన ఎమ్మెల్యే కొలికపూడి బాధిత కుటుంబంపై రాజకీయ ముద్ర వేసి మొత్తం వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. దీంతో చంద్రబాబు చేయిస్తున్న విచారణ, బాధితులపైనే కొలికపూడి ఎదురుదాడిని బట్టి ఇదంతా ప్రజలను మాయ చేసేందుకు అడుతున్న డ్రామాలేనని స్పష్టమవుతోంది.