
కర్నూలు మార్కెట్ యార్డులో పేరుకుపోయిన ఉల్లి నిల్వలు
ఉల్లిగడ్డలు క్వింటా రూ.1,200తో కొంటామన్న సీఎం
మూడ్రోజులైనా విధి విధానాలు రాలేదని చెబుతున్న అధికారులు
గతంలో మిర్చి, పొగాకు రైతులకు న్యాయం చేస్తున్నామంటూ ఇలాగే హడావుడి
ఒక్కరికీ న్యాయం చేయని టీడీపీ కూటమి ప్రభుత్వం
సీఎం హామీతో ఉల్లి కోతలు వాయిదా వేసుకుంటున్న రైతులు
కర్నూలు (అగ్రికల్చర్): ఇదుగో ఉల్లి రైతులను ఆదుకుంటున్నాం.. వెంటనే క్వింటా రూ.1,200కు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నానని ఈనెల 28న మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇది జరిగి మూడ్రోజులైనా ఉల్లి కొనుగోలుపై జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఆదేశాలుగానీ, విధి విధానాలుగానీ రాలేదు. దీంతో రైతులు ఉసూరుమంటున్నారు. ఆగస్టు నెల మొత్తం వర్షాలు కురవడంతో ఉల్లి పంట భారీగా దెబ్బతింది. ఫలితంగా నాణ్యతలేదనే కారణంతో వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. దీంతో.. రైతులు ఉల్లిగడ్డలను పొలాల్లోనే పశువులు, గొర్రెలు, మేకలకు వదిలేస్తున్నారు. ఇలా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రోజూ 150 క్వింటాళ్లపైనే ఉల్లి కుళ్లిపోతోంది.
మిర్చి, పొగాకుపైనా సీఎం ఇదే హంగామా
నాలుగైదు నెలల క్రితం కూడా మిర్చిని కొంటామని ముఖ్యమంత్రి హంగామా చేశారు. మిర్చి రైతులు, వ్యాపారులతో గంటల తరబడి సమీక్ష నిర్వహించారు. మిర్చి కొనుగోలుపై కేంద్ర మంత్రితోనూ చర్చించామన్నారు. అనంతరం క్వింటాకు రూ.12వేల మద్దతు ధరతో కొంటామన్నారు. కానీ, ఇందుకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు, జీఓలు రాలేదు. ఫలితంగా ఒక్క మిర్చి రైతుకు కూడా న్యాయం జరగని పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో రైతులు అతితక్కువ ధరకే అమ్ముకుని నష్టపోయారు.
అలాగే, మొన్నటికి మొన్న పొగాకు రైతులను ఆదుకుంటామని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని హడావుడి చేశారు. అయినా ఒక్క క్వింటా పొగాకు కూడా కొనలేదు. దీంతో.. 2024–25లో పండించిన పొగాకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 46 వేల క్వింటాళ్లు రైతుల దగ్గర ఉండిపోయింది. మరోవైపు.. రైతుల కోసం సీఎం కష్టపడుతున్నారని అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటారు. కానీ, విధి విధానాలు, జీవోలు మాత్రం రావడంలేదు. ఇప్పుడు ఉల్లి రైతుల వంతు వచ్చింది. వచ్చే వారం పదిరోజుల్లో దాదాపు 6 వేల టన్నుల ఉల్లి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి చెప్పారు కదా.. రెండు, మూడ్రోజులు చూద్దాం అని కొందరు రైతులు కోతలు వాయిదా వేస్తున్నారు. కనీసం రూ.2 వేల ధరతోనైనా కొంటేనే రైతులకు పెట్టుబడి దక్కుతుందని వారంటున్నారు. కానీ క్వింటాకు రూ.1200పైనే అని ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఇది కూడా బాబు డ్రామానే అని రైతులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. శనివారం మార్కెట్‌కు 38 మంది రైతులు 1,289 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు తెచ్చారు. ఇలా అతి తక్కువగా వచ్చిన ఉల్లిని కూడా నాణ్యత బాగోలేదని వ్యాపారులు కొనకపోవడంతో రైతులు ఉసూరుమంటున్నారు.
క్వింటాకు రూ.708 వచ్చింది..
ఈసారి ఒకటిన్నర ఎకరాల్లో ఉల్లి సాగుచేశాం. పెట్టుబడి రూ.1.20 లక్షల వరకు పెట్టాం. అర ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడి అయింది. బస్తా ఎరువు ధర రూ.1,900. ప్రస్తుతం అర ఎకరాలో ఉల్లి గడ్డలు తెంపుకుని మార్కెట్‌కు వచ్చాం. 31.50 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్‌కు తీసుకొస్తే క్వింటాకు రూ.708 మాత్రమే లభించింది. పంటను అమ్మగా రూ.22,302 వచ్చింది. ఇందులో హమాలీ ఖర్చులు, కమీషన్ ఏజెంటు కమీషన్ మినహాయిస్తే రూ.20 వేల వరకు మాత్రమే మిగులుతోంది. అంటే.. రూ.20 వేల వరకు నష్టం. – చంద్రయ్య, పెనుమాడ, క్రిష్ణగిరి మండలం