Kurnool Tandoori Tea Story: ఆహా.. ఏం‘టీ’ గురూ!

Tandoori Tea Special Story In Kurnool - Sakshi

కర్నూలులో ‘తందూరి’ చాయ్‌ ప్రత్యేకం 

మట్టి కుండలో నుంచి మట్టి గ్లాసులోకి

కొత్త రుచిని ఆస్వాదిస్తున్న నగరవాసులు

పని ఒత్తిడి ఉన్నప్పుడో.. తలనొప్పి బాధిస్తున్నప్పుడో.. నలుగురు మిత్రులు కలిసినప్పుడో  టీ తాగడం సర్వసాధారణం. అయితే అది కొత్త రుచిని ఇచ్చినప్పుడు ఆ అనుభవమే వేరుగా ఉంటుంది. కర్నూలులోని తందూరి చాయ్‌ (మట్టికుండ టీ) నగర వాసులకు సరికొత్త అనుభూతులను పంచుతోంది. విభిన్న రుచిని అందిస్తోంది. (చదవండి: ఆసక్తికర దృశ్యాలు: వానరమా.. ఇంత వయ్యారమా..)

కర్నూలు కల్చరల్‌: పొగలు కక్కే తందూరి చాయ్‌ కర్నూలులో ఇప్పుడు బాగా ఫేమస్‌. పాలను బాగా మరిగించి తగినంత చక్కెర వేసి తందూరి టీ పౌడర్‌ వేసి టీ తయారు చేస్తారు. ఒక డ్రమ్ము లాంటి ఇనుప పాత్రలో సగానికిపైగా ఇసుకతో నింపి దానిపై బొగ్గులు వేసి నిప్పు పెడతారు. బొగ్గులు బాగా వేడెక్కిన తరువాత కొత్త మట్టి కుండలను వేడి చేస్తారు. ఫిల్టర్‌ చేసిన టీని వేడిగా ఉన్న  మట్టి కుండలో వేసి దాన్ని మట్టి గ్లాస్‌లో పోసి అందిస్తారు. అంతే తందూరి చాయ్‌ని సిప్‌ చేస్తూ రుచిని ఆస్వాదించడమే.

ఎక్కడెక్కడ అంటే.. 
కర్నూలులోని ఓల్డ్‌సిటీలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద, ధర్మపేట సమీపంలో,  బళ్లారి చౌరస్తా, బిర్లాగేట్‌లో  మట్టి కుండ టీ తయారు చేస్తున్నారు. శుచి, శుభ్రత, రుచి ఉండటంతో నగర వాసులు తందూరి చాయ్‌ను ఇష్టపడుతున్నారు. ఈ వ్యాపారం రోజు రూ.వేలల్లో నడుçస్తోంది. ఒక్క ఓల్డ్‌సిటీలోని కుండ టీ పాయింట్‌ వద్దే సుమారు ఆరు వేల మట్టి గ్లాస్‌ల టీ అమ్ముడు పోతోంది. మిగతా మూడు ప్రాంతాల్లో ఆరు వేల టీ గ్లాస్‌ల విక్రయం జరుగుతోంది. ఒక్కొక్క టీ రూ.10. ఇలా రోజుకు సుమారు 12 వేల టీలు అమ్ముడు పోయినా రూ.1.20 లక్షల వ్యాపారం జరుగుతోంది.
చదవండి: హార్సిలీహిల్స్‌ అసలు పేరేంటో తెలుసా....!

మట్టిగ్లాస్‌ల దిగుమతి 
మట్టికుండలను స్థానికంగా తయారు చేసినప్పటికీ మట్టి గ్లాస్‌లు ఇక్కడ దొరకడం లేదు. వీటిని ఆర్డర్‌ పెట్టుకొని రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్‌ల నుంచి తెప్పించుకుంటారు. ఒక్కొక్క గ్లాస్‌ ధర 2.50 రూపాయలు పడుతుంది. వీటిని వాడి పడేస్తారు.

రుచి ప్రత్యేకం 
మట్టి కుండలో వేసి మట్టి గ్లాస్‌లో పోసి ఇవ్వడంతో తందూరి చాయ్‌ రుచి ప్రత్యేంగా ఉంటుంది. మేం ఓల్డ్‌సిటీలో తాగుతాం. ఎవరైనా కొత్తదనం కోరుకుంటారు కదా. మేము, మా ఫ్రెండ్స్‌ కూడా అంతే. మట్టి గ్లాస్‌లో టీ తాగడం మరచిపోలేని అనుభూతి. 
– సుకుమార్, ప్రభుత్వ ఉద్యోగి, కర్నూలు 

రిలాక్స్‌ అవుతా 
నేను ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తా. పని ఒత్తిడి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి తందూరి చాయ్‌ తాగి రిలాక్స్‌ అవుతా. ప్రత్యేకంగా తయారు చేసి మట్టి కుండ, మట్టి గ్లాస్‌లో పోసి ఇవ్వడంతో టీ రుచి వెరైటీగా ఉంటుంది.
– బడేసావలి, గోనెగండ్ల  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top