Horsley Hills: హార్సిలీహిల్స్‌ అసలు పేరేంటో తెలుసా....!

Chittoor Interesting Story Behind Horsley Hills Name - Sakshi

చిత్తూరు: హార్సిలీహిల్స్‌..ఈపేరు వింటే మండువేసవిలోనూ హాయిగొలిపే ఆంధ్రాఊటీగా గుర్తొస్తుంది. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉండి ఆకాశాన్ని తాకుతున్న అనుభూతిని కలిగించే కొండకు ఎక్కెక్కడి నుంచో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఏ రుతువుతోనూ సంబంధం లేకుండా విడిది చేసేందుకు సందర్శకులు ఇష్టపడ్తారు. చిత్తూరుజిల్లా బి.కొత్తకోట మండలంలోని ఈ హార్సిలీహిల్స్‌ కథేంటి, అసలా పేరెలా వచ్చింది, కొండను ఎలా గుర్తించారన్నదాని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. 

అసలు పేరు ఏనుగుమల్లమ్మ కొండ
హార్సిలీహిల్స్‌ బి.కొత్తకోట మండలం కోటావూరు రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నప్పటికి కొండలు, ఆడవి బయ్యప్పగారిపల్లె గ్రామంతోపాటు కురబలకోట మండలం తెట్టు అటవీప్రాంతంతో కలిసి ఉంటుంది. దీని అసలు పేరు ఏనుగుమల్లమ్మ కొండ. కొండపై మల్లమ్మ పశువులను కాస్తూ, ఏనుగులతో స్నేహంగా ఉండేది. దాంతో ఏనుగుమల్లమ్మ కొండగా పేరు. ్రçపస్తుతం కొండపైన గట్టు గ్రామం, ములకలచెరువు మండలం బురకాయలకోటల్లో ఏనుగుమల్లమ్మ ఆలయాలు ఉన్నాయి. వీటికి మాన్యం భూములు ఉన్నాయి. 

చల్లదనం కొండెక్కించింది 
1850లలో బ్రిటన్‌కు చెందిన డబ్ల్యూ.డీ.హార్సిలీ మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా, తర్వాత చిత్తూరు, కడప ఉమ్మడిజిల్లాలకు కలెక్టర్‌కు పనిచేశారు. సబ్‌కలెక్టర్‌గా ఉన్న సమయంలో హార్సిలీ గుర్రంపై కోటావూరు గ్రామం పరిధిలో పర్యటిస్తుండగా వాతావర ణం చల్లగా ఉండటం గుర్తించారు. గుర్రంపైనే కొండెక్కేశారు. దట్టమైన అడవి, అత్యంతచల్లదనానికి ముగ్దుడైపోయాడు. తర్వాత ఆయన కడప కలెక్టర్‌ కావడంతో కొండను వేసవి విడది కేంద్రం చేసుకోవాలని నిర్ణయించాడు. 1869లో ఏనుగుమల్లమ్మ కొండను వేసవి విడది కేంద్రంగా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అప్పటి మద్రాసు ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. దీనికి సమ్మతిస్తూ ప్రభుత్వం 1869 మే 4న జీవోఎంఎస్‌ నంబర్‌ 11579 జారీ చేసింది. అప్పటినుంచి కొండ వేసవి విడది కేంద్రంగా మారిపోయింది. 

అలా పేరు మారిపోయింది
కొండను వేసవి విడిదిగా చేస్తున్న కలెక్టర్‌ హార్సిలీ అంతటితో ఆగలేదు. ఏనుగుమల్లమ్మ కొండ పేరును తనపేరు వచ్చేలా హార్సిలీహిల్స్‌గా మారేందుకు ప్రయత్నాలు చేశారు. పశువులు మేపుకునేందుకు వచ్చే కాపరులకు పానీయాలు, తినుబండరాలు ఇస్తూ వారిచేత హార్సిలీహిల్స్‌ అని పలికించడం ప్రారంభించి కొండకు ఆపేరు చిరస్థాయిగా ఉండిపోయేలా చేశారు. దాంతో ఏనుగుమల్లమ్మ కొండ హార్సిలీíß ల్స్‌గా మారిపోయింది. ఇప్పడు రాష్ట్రంలో ఏకైక వేసవి విడది కేంద్రంగా ప్రఖ్యాతిగాంచింది. అయితే ఏనుగుమల్లమ్మ ఇక్కడి ప్రజలకు దేవతగా కొలువబడుతోంది. కొండపైనున్న ఆలయంలో నిత్యం పూజలందుకుంటోంది. 
 

Read latest AP Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top