అభివృద్ధి, సంక్షేమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లండి

Take development and welfare to field level - Sakshi

అనుబంధ విభాగాల సమావేశంలో వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి 

త్వరలో అనుబంధ విభాగాల జోనల్‌ స్థాయి సమావేశాలు 

అభివృద్ధి కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ అనుబంధ విభాగాలైన మహిళ, యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షులు, జోనల్‌ ఇన్‌చార్జిలు, జిల్లా అధ్యక్షులతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో పార్టీ అనుబంధ విభాగాల జోనల్‌ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అనుబంధ విభాగాల జిల్లా, మండల, రాష్ట్రస్థాయి కమిటీల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు సవివరంగా వివరించాలని చెప్పారు. పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ అనుబంధ విభాగాలకు భాగస్వామ్యం కల్పించే విధంగా చూస్తామన్నారు.

సీఎం జగన్‌ విద్య, వైద్య వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు, మార్పులను అందరికీ తెలియజేసేలా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ విద్యార్థి విభాగం సమావేశంలో విజయసాయిరెడ్డి దిశా నిర్దేశం చేశారు. గతంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఈ నాలుగేళ్లలో సీఎం జగన్‌ తీసుకొచ్చిన సంస్కరణలను అందరికీ వివరించాలన్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేయాలని, 2019కి ముందు విద్యార్థి విభాగంలో పనిచేసిన నాయకులకు సీఎం జగన్‌ మంచి అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. 

పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేలా 15 రోజుల్లో కమిటీలను నియమిస్తామని చెప్పారు. మహిళల సాధికారతకు సీఎం జగన్‌ ఎంతో కృషి చేస్తున్నారని పార్టీ మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వరుదు కళ్యాణి తెలిపారు. అమ్మ ఒడి, ఆసరా వంటి పథకాల ద్వారా మహిళలకు ఎంతో తోడ్పాటును అందజేస్తున్నారన్నారు. అంతకు ముందు యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నేతృత్వంలో యువజన విభాగం సమావేశం జరిగింది. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్‌ ఇన్‌ఛార్జ్‌లు, జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలను విజయసాయిరెడ్డి తెలుసుకున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top