సాక్షి,తిరుపతి: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీ యూనివర్సిటీ)లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సైకాలజీ విభాగంలో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఘటనపై నలుగురు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు చేసిన విద్యార్థులపై కక్ష్య సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. వారిని ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడికి గురిచేశారు. అంతేకాక, వారిపై బెదిరింపులకు కూడా దిగినట్లు సమాచారం.
ఈ ఒత్తిడిని భరించలేక, నలుగురు విద్యార్థులు తమ టీసీలు తీసుకుని యూనివర్సిటీని విడిచిపెట్టారు. ర్యాగింగ్ ఘటనలో ప్రమేయం ఉన్న ఆరుగురు సీనియర్ విద్యార్థులతో పాటు, సైకాలజీ విభాగ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (హెచ్‌ఓడీ) ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిని యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. విద్యార్థుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు యూనివర్సిటీ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ర్యాగింగ్‌ను ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై కూడా బెదిరింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి.


