రంపచోడవరం ఐటీడీఏ కసరత్తు
గిరిజన రైతులకు మంచి రోజులు
మెరుగుపడనున్న ఆర్థిక పరిస్థితి
ఫలించనున్న ఎన్నో ఏళ్లనాటి కల
మన్యం కొండల్లో ప్రకృతి ప్రసాదించిన చల్లని వాతావరణం ఇప్పుడు గిరిజన రైతుల పాలిట వరంగా మారుతోంది. మారేడుమిల్లి ప్రాంతం రబ్బరు సాగుకు అనుకూలంగా ఉన్నందున ఇక్కడ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు రంపచోడవరం ఐటీడీఏ కసరత్తు మొదలుపెట్టింది. మూడు దశాబ్దాల క్రితం చిన్నగా మొదలైన ఈ రబ్బరు సాగు ప్రస్థానం, ఇప్పుడు వేల ఎకరాలకు విస్తరించడమే కాకుండా.. స్థానికంగానే వస్తువుల తయారీ పరిశ్రమ ఏర్పడే స్థాయికి చేరింది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమతో గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది.
రంపచోడవరం: అల్లూరి జిల్లాలో సముద్ర మట్టానికి ఎత్తులో ఉండి, చల్లని వాతావరణం కలిగిన మారేడుమిల్లి ప్రాంతం రబ్బరు సాగుకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు రబ్బరు ఉత్పత్తికి అనుకూలంగా ఉండటంతో, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ ఐటీడీఏ అధికారులు ఈ ప్రాంతంలో రబ్బరు పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
1994లో మొదలైన ప్రస్థానం..
రబ్బరు బోర్డు పర్యవేక్షణలో 1994లోనే ఇక్కడ సాగుకు పునాదులు పడ్డాయి. ఐటీడీఏ – రబ్బరు బోర్డు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాయి.
బ్లాక్ ప్లాంటేషన్–1: దేవరపల్లి గ్రామంలో 1994లో 50 హెక్టార్లలో తొలిసారిగా రబ్బరు మొక్కలు నాటారు.
బ్లాక్ ప్లాంటేషన్–2 : పుజారిపాకలు, వేటుకూరు గ్రామాల్లో 1998 – 2003 మధ్య 35 మంది రైతులకు చెందిన 45 హెక్టార్లలో సాగు చేపట్టారు.
బ్లాక్ ప్లాంటేషన్–3 : పందిరిమామిడి కోటలో 2009–2013 మధ్య వంద హెక్టార్లలో మొక్కలు నాటారు.
మొక్కలు నాటిన మూడేళ్ల వరకు రైతులకు సాంకేతిక సహకారం అందించగా, ఆ తర్వాత రెండేళ్లకు పాల ఉత్పత్తి ప్రారంభమై రైతులకు ఆదాయం మొదలైంది.
ఐటీడీఏ సహకారంతో విస్తరిస్తున్న సాగు
గతంలో సాంకేతిక లోపాలతో కొన్ని మొక్కలు దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుతం గిరిజనులు ఈ సాగుపై మక్కువ చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐటీడీఏ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది:
» రంపచోడవరం, మారేడుమిల్లి, వై.రామవరం (అప్పర్ పార్ట్) పరిధిలో 3 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో మొక్కలు నాటేందుకు రైతులను సిద్ధం చేస్తోంది.
» మిగిలిన రెండేళ్లలో మరో 2వేల ఎకరాల్లో సాగు విస్తరించనున్నారు. ఈ ప్రాంతంలో రబ్బరు బోర్డు ద్వారా 2024లో 370 ఎకరాలు, 2025లో 501 ఎకరాల్లో సాగు చేపట్టారు.
» ఎకరానికి 450 కిలోల వరకు రబ్బరు షీట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం కిలో ధర రూ. 170 వరకు ఉంది
రూ. 5 కోట్లతో పరిశ్రమ
మారేడుమిల్లిలో పండుతున్న రబ్బరుకు స్థానికంగానే విలువల జోడింపునకు రూ. 5 కోట్ల వ్యయంతో వస్తువుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రూ. 2.50 కోట్ల నిధులు విడుదలయ్యాయి. స్థల సేకరణ ప్రక్రియ పూర్తయింది. రబ్బరు బోర్డు నుంచి డీపీఆర్ అనుమతి వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రబ్బరు సాగుచేసే రైతులకు గిట్టుబాటు ధర లభించనుంది.
ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం
పందిరిమామిడి కోటలో ఆరు ఎకరాల్లో 1200 రబ్బరు మొక్కలు ఉన్నాయి. ఏడాదికి రూ. 8లక్షలు వరకు ఆదాయం వస్తుంది. రబ్బరు పాల సేకరణ కోసం గ్రామంలో కొంత మందికి ఉపాధి కూడా కలి్పస్తున్నా. రబ్బరు సాగుకు మరింత ప్రోత్సాహం ఇస్తే ఇంకా రైతులు సాగు చేసేందుకు అవకాశం ఉంటుంది. – కత్తుల సోమిరెడ్డి, పందిరిమామిడి కోట
స్మోక్ రూమ్‌లకు ప్రతిపాదనలు
రబ్బరు సాగు చేసే రైతుల సంఖ్య పెరగడంతో రబ్బరు షీట్ల తయారీకి స్మోక్ రూమ్‌లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇప్పటికే ఐదు స్మోక్ రూమ్‌ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. మూడు వేల ఎకరాల్లో రబ్బరు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. – దేవనందం, పీహెచ్‌వో, రంపచోడవరం
ఆదాయం పెరుగుతుంది
రబ్బరు ఆధారిత పరిశ్రమ ఏర్పాటుతో సాగు రైతులకు ఆదాయం పెరుగుతుంది. రబ్బరు ఆధారిత పరిశ్రమలో రైతులను భాగస్వాములను చేస్తే బాగుంటుంది. ఈ దిశగా రంపచోడవరం ఐటీడీఏ, రబ్బరు బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలి. – కత్తుల రామిరెడ్డి, వేటుకూరు, మారేడుమిల్లి మండలం
ఆన్‌లైన్‌లో మార్కెటింగ్
రబ్బరు సాగు తొలుత దేవరపల్లిలో ప్రారంభమైంది. ఉత్పత్తి చేసిన రబ్బరును ఆన్‌లైన్ మార్కెట్‌లో ధరల వివరాలు తెలుసుకుని అమ్ముకుంటున్నాం. ఎటువంటి మోసాలకు అవకాశం లేదు. రబ్బరు బోర్డు, ఐటీడీఏ సహకారంతో మెరుగైన ఆదాయం పొందగలుగుతున్నాం. – పల్లాల సూర్యవతి, దేవరపల్లి


