ఏపీపీఎస్సీ వద్ద 1,125 ఏఈఈ, ఏఈ పోస్టులు
ఈ సంవత్సరం జూలై నాటికి ఉన్న ఖాళీలివి
ఆశగా ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులు
నోటిఫికేషన్ ఇచ్చేందుకు చేయిరాని చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టులు భర్తీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి మనసు రావడం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇచి్చన నోటిఫికేషన్లను సైతం పూర్తి చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రూప్–1, 2 పోస్టులతో పాటు డీవైఈవో, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క వివిధ శాఖల్లోని ఇంజినీరింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఏడాదిన్నర కాలంగా ఏపీపీఎస్సీ ఎదురుచూస్తున్నా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు.
దీంతో ఇంజినీరింగ్ చదివిన వేలమంది అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రజారోగ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణ నీటి సరఫరా–శానిటేషన్, రోడ్లు భవనాలు, వాటర్ రిసోర్స్ శాఖల్లో దాదాపు 1,125 ఇంజినీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో పనులు ముందుకుసాగడం లేదని, వెంటేనే నియామకాలు చేయాల్సిందిగా పలు శాఖలు ప్రభుత్వాన్ని అభ్యర్థించినా స్పందిచకపోవడం గమనార్హం. ఖాళీలను పదోన్నతులతో నింపేందుకే ఆసక్తి చూపుతున్నారు గానీ కొత్త నోటిఫికేషన్లకు మాత్రం అంగీకరించడం లేదు.
మొత్తం 1,125 పోస్టులు
ప్రస్తుతం ప్రజారోగ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో 88 ఏఈఈ, 33 ఏఈ (డిప్లొమా అర్హత), గ్రామీణ నీటి సరఫరా–పారిశుధ్య విభాగంలో 95 ఏఈఈ, 71 ఏఈ, రోడ్లు భవనాల శాఖలో 187 ఏఈఈ, 74 ఏఈ, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌లో 211 ఏఈఈ, 366 ఏఈ.. మొత్తం 1,125 పోస్టులున్నాయి. 2021, 2022లో ఇచ్చిన నోటిఫికేషన్లలో మిగిలిన (క్యారీ ఫార్వర్డ్) పోస్టులు మరో 9 ఉన్నాయి. కేవలం నాలుగు శాఖల్లోనే 1,125 పోస్టుల ఫైల్ ఏపీపీఎస్సీ వద్ద ఉంది. నిబంధనల ప్రకారం ఆయా శాఖల్లోని ఖాళీలలో 70 శాతం పదోన్నతులతో, 30 శాతం నేరుగా భర్తీ చేయాలి.
నేరుగా చేపట్టాల్సిన నియామకాలనూ పదోన్నతులతో నింపేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఏఈ ఉద్యోగాలకు డిప్లొమా ఇంజినీరింగ్ అభ్యర్థులు, ఏఈఈ పోస్టులకు బీటెక్, బీఈ చదివినవారు ఎదురుచూస్తున్నారు. తమ ఆశలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోందని వీరంతా వాపోతున్నారు. అన్ని అర్హతలున్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో వయో పరిమితి దాటిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


