ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదు
వాజ్‌పేయి విగ్రహావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌ను హైటెక్ సిటీతో అభివృద్ధి చేసినట్టే.. అమరావతిని క్వాంటం వ్యాలీతో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా గుంటూరు జిల్లా వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వాజ్‌పేయి స్మృతి వనంలో 14 అడుగుల ఏబీ వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రాభివృది్ధకి ప్రధాని మోదీ పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. పీపీపీ విధానంలో దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పీపీపీ ద్వారా సంపద సృష్టిస్తుంటే.. ఏమీ తెలియని కొందరు నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నా, ఉద్యోగాలు కల్పించాలన్నా పీపీపీ మోడల్ కరెక్ట్ అనే విషయాన్ని 30 ఏళ్లుగా చూస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వస్తే కాలేజీలు కట్టిన వాళ్లను జైలులో పెడతామంటున్నారని.. అభివృద్ధి చేసే వాళ్లను, జైలులో పెట్టేవాళ్లను ఏవిధంగా చూడాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదన్నారు.
అపరదేశ భక్తుడు వాజ్‌పేయి: చౌహన్
సభకు హాజరైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని అపర దేశభక్తుడని కొనియాడారు. పార్టీలు వస్తాయి, పోతాయి గానీ దేశభక్తి అన్న భావన ప్రతి వ్యక్తిలో ప్రధానంగా ఉండాలని చెప్పిన నేత వాజ్‌పేయి అన్నారు. వాజ్‌పేయి తొలిసారి ప్రధాని అయిన సమయంలో ఫిరాయింపులను ప్రోత్సహించాలని చెప్పినా విలువలకే కట్టుబడి నిలబడ్డారని చెప్పారు. వాజ్‌పేయి వేసిన పునాదుల కారణంగానే దేశం, ఏపీ ముందుకు సాగుతున్నాయన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్రమంత్రులు సత్యకుమార్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్ మాట్లాడారు. వాజ్‌పేయిపై రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను, కవర్‌ను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సీఎం చంద్రబాబు అవిష్కరించారు.
పునర్విభజన చట్టం కింద
కేంద్ర అగ్రి వర్సిటీ నెలకొల్పండి
ఏపీలో కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డు సహా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతి పర్యటనలో భాగంగా గురువారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన కేంద్రమంత్రికి చంద్రబాబు వినతి పత్రం అందించారు. ఏపీ పునర్విభజన చట్టం–2014 షెడ్యూల్ 13లో పేర్కొన్న మేరకు రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. దీనికోసం రూ.2,585 కోట్ల అంచనాలతో డీపీఆర్ సమర్పించినట్టు చెప్పారు. సూక్ష్మ సాగునీటి విస్తరణకు అదనంగా రూ.695 కోట్లు కేటాయించాలని, ఏపీని సహజ సాగుకు జాతీయ వనరుల రాష్ట్రంగా ప్రకటించాలని, అమరావతిలో అత్యాధునిక ఆక్వా ల్యాబ్, పులికాట్ సరస్సు అభివృద్ధికి నిధులు కేటాయించాలనే తదితర అంశాలను వినతిపత్రంలో చేర్చారు.


