రిమ్స్ మార్చురీ నుంచి మృతదేహాన్ని తీసుకొస్తున్న బంధువులు
హాస్టల్ గదిలో ఉరివేసుకున్న స్థితిలో గుర్తించిన మరో విద్యార్థిని
కడప శివారు ఊటుకూరులో ఘటన
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై విద్యార్థిని బంధువుల ఆగ్రహం
యాజమాన్యం తీరుపై మండిపడ్డ డీఈవో
చింతకొమ్మదిన్నె: వైఎస్సార్ జిల్లా కడప శివారులోని చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు రింగురోడ్డు సర్కిల్ వద్ద ఉన్న ఓ ప్రయివేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కె.జస్వంతి (14) సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండూరు మండలం పాలూరు గ్రామానికి చెందిన కె.రవిశంకరరెడ్డి, లక్ష్మీదేవి దంపతుల పెద్దకుమార్తె జస్వంతి ఓ ప్రయివేట్ స్కూల్ హాస్టల్‌లో ఉంటోంది. ఉదయం 6.40 గంటల సమయంలో జస్వంతి తాను ఉంటున్న గదికి గడియ వేసుకుంది.
అదే గదిలో ఉంటున్న మరో విద్యార్థిని పాలు తాగేందుకు మెస్ వద్దకు వెళ్లి 6.55 గంటల సమయంలో రూం వద్దకు వచ్చి కిటికీలోంచి చూడగా చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది గది తలుపుల్ని పగులగొట్టి లోనికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న జస్వంతిని కడప నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. దీంతో రిమ్స్ ఆస్పత్రికి విద్యార్థిని మృతదేహాన్ని తరలించారు.
యాజమాన్యం తీరుపై మండిపడ్డ డీఈవో
విద్యార్థిని జస్వంతి మృతి చెందిన విషయం తెలిసి విచారణ నిమిత్తం జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ పాఠశాలకు రాగా.. సిబ్బంది పాఠశాల తాళాలు తెరవలేదు. అరగంటకు పైగా వేచి డీఈవో వేచి ఉండాల్సిన పరిస్థితి కల్పించారు. దీంతో ఆయన పాఠశాల ప్రిన్సిపాల్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం డీఈఓ వచ్చినా స్పందించరా, మీ తీరు ఏమిటో దీనిని బట్టి అర్థమవుతోంది అని మండిపడ్డారు. డీఈవో వెంట మండల విద్యాధికారులు సుబ్బరాయుడు, రమాదేవి ఉన్నారు.
ఏం జరిగిందో చెప్పని పాఠశాల యాజమాన్యం
ఉదయం 7.55 గంటల సమయంలో విద్యార్థిని కళ్లు తిరిగి కిందపడిపోయినట్టు ఆమె తండ్రి రవిశంకర్‌రెడ్డికి స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్‌చేసి చెప్పారు. బాలిక తల్లిదండ్రులు రిమ్స్ మార్చురీ వద్దకు చేరుకోగా.. బిడ్డ మృతి చెందిందని చెప్పడంతో తీవ్రంగా రోదించారు. సుమారు రెండు గంటలు పైగా మార్చురీ వద్ద వేచి ఉన్నప్పటికీ పాఠశాల యాజమాన్యం బిడ్డ ఎలా మృతి చెందిందనే విషయం చెప్పలేదని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన చెందారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసనగా నినాదాలు చేస్తూ బాలిక మృతదేహంతో పాఠశాలకు వచ్చే ప్రయత్నం చేశారు.
పోలీసులు వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ వద్దకు చేరుకుని వాహనాలను రహదారికి అడ్డుగా ఉంచి అడ్డుకున్నారు. దీంతో బాలిక బంధువులు, పోలీసుల మధ్య దాదాపు గంటసేపు వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. చివరకు పోలీసులు పోస్టుమార్టం జరిగితేనే వాస్తవాలు తెలుస్తాయని విద్యార్థిని బంధువులకు నచ్చజెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


