ఆలయ పూజాదికాల్లో జోక్యం చేసుకోం

Supreme Court on petition filed against TTD - Sakshi

టీటీడీపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు.. విచారణ ముగింపు

సాక్షి, న్యూఢిల్లీ: ఆలయాల రోజువారీ పూజాదికాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. సంప్రదాయాలు పాటించడం లేదని  అనుమానమొస్తే తగిన సాక్ష్యాధారాలతో ట్రయల్‌ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి కైంకర్యాల్లో టీటీడీ సంప్రదాయాలు పాటించడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. టీటీడీ దాఖలు చేసిన కౌంటరు పిటిషన్‌తో సంతృప్తి చెందడంలేదని, తక్షణ ఉపశమనం కలిగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. అభిషేకాలు, దర్శనాలు, బ్రహ్మోత్సవం తదితర అంశాల్లో సంప్రదాయాలు పాటించడం లేదని పేర్కొన్నారు.

పిటిషనర్‌ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇవ్వలేదా అని టీటీడీ న్యాయవాదిని జస్టిస్‌ హిమకోహ్లి ప్రశ్నించారు. పిటిషనర్‌ సందేహాలన్నింటినీ అఫిడవిట్‌ రూపంలో నివృత్తి చేశామని టీటీడీ న్యాయవాది తెలిపారు. సంప్రదాయాల ప్రకారం పూజాదికాలు జరుగుతున్నాయని సమగ్రంగా పిటిషనర్‌కు వివరించాలని, దీనికి ఎనిమిది వారాల గడువు ఇస్తున్నామని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. సంప్రదాయాలు పాటించడంలో లోపాలుంటే ట్రయల్‌ కోర్టును లేదా తగిన వేదికను ఆశ్రయించాలని జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న సూచించారు. ప్రాథమిక హక్కుగా భావించి పిటిషన్‌ దాఖలు చేశానని పిటిషనర్‌ పేర్కొనగా.. హిమకోహ్లి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసును మరో కోణంలోకి తీసుకెళ్లొద్దన్నారు. పిటిషన్‌ కొట్టేస్తామని, సివిల్‌ సూట్‌ దాఖలు చేసుకోమని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. ‘పూజాదికాలు కాకుండా పాలనపరమైన నిర్లక్ష్యంపై ఎవరు కోర్టు దృష్టికి తీసుకొచ్చినా టీటీడీని ప్రశ్నిస్తాం.

కొబ్బరికాయలు ఎలా కొట్టాలి, హారతి ఎలా ఇవ్వాలి అనేది న్యాయస్థానాలు నిర్ణయించవు. ఆలయ దైనందిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోం. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలపై ఎనిమిది వారాల్లో టీటీడీ సమాధానం ఇవ్వాలి. టీటీడీ లోపాలపై సాక్ష్యాధారాలుంటే పిటిషనర్‌ ట్రయల్‌ కోర్టును ఆశ్రయించవచ్చు’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ చెప్పారు. పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణ సమయంలో పిటిషనర్‌ కోర్టు సూచనలు పాటించకపోవడంతో జస్టిస్‌ ఎన్‌వీ రమణ పలుసార్లు వారించారు. సహనం పాటించాలని, కోర్టులు ప్రసంగాల కోసం కాదని, పిటిషన్‌ ప్రచారం కోసం దాఖలు చేసినట్లుగా భావించి కొట్టేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top