
సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారని బాధితురాలు తల్లి సుగాలి పార్వతి ప్రశ్నించారు. మాకు న్యాయం చేస్తానని నమ్మించి.. పవన్ నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. జనసేన ఎమ్మెల్యేలు, నేతలు తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోతే.. చంద్రబాబు, పవన్, లోకేష్‌కు తమ ఉసురు తగులుతుందని ఘాటు విమర్శలు చేశారు.
సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు ఆమె తల్లి పార్వతి . ఈ సందర్భంగా సుగాలి పార్వతి మాట్లాడుతూ..‘2017 నుండి నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాం. ఎనిమిదేళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నాం. విజయవాడ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించాను అయినా మాకు న్యాయం జరగలేదు. కూటమి ప్రభుత్వంలో తమ కేసును సీబీఐకి అప్పగించినట్లు ప్రకటన చేయడం లేదు. దీనిపై స్పష్టత ఇవ్వలేదు.
సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామని చంద్రబాబు, పవన్ గొప్పలు చెబుతున్నారు. మా సమస్యలను పట్టించుకోవడం లేదు. అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పిన పవన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఒక్కసారైనా అసెంబ్లీలో ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు. ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. జనసేన పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు మాపై అనేక ఆరోపణలు చేసి కించపరిచే విధంగా మాట్లాడారు. మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ ఎమ్మెల్యే గాద వెంకటేశ్వర్లు అనేక ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు పవన్ అనేక హామీలు ఇచ్చారు. కానీ అధికారంలో వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదు. న్యాయం చేస్తానని చెప్పి.. నమ్మక ద్రోహం చేశారు. హైకోర్టులో పిటిషన్ వేశాం. మాకు న్యాయం జరగడం కోసం వీల్ చైర్ యాత్ర నిర్వహించేందుకు హైకోర్టును ఆశ్రయిస్తాం. మాకు న్యాయం జరగకపోతే పవన్, చంద్రబాబు, లోకేష్‌కు మా ఉసురు తగులుతుంది. వీల్ చైర్ యాత్ర చేస్తానంటే అడ్డుకున్నారు. చిత్తశుద్ధి ఉంటే వీల్ చైర్ యాత్రకు అనుమతి ఇప్పించాలి.
బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా మేము కలిసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈనెల 16వ తేదీ ప్రధాని మోదీ కర్నూలు వస్తున్నారు.. అప్పుడు మోదీని కలిసి మా బాధను విన్నవించే ప్రయత్నం చేస్తాను. బీజేపీ నేతలు మాకు అపాయింట్‌మెంట్ ఇప్పించండి. మోదీని కలవడానికి అనుమతించకుంటే 13,14,15 తేదీలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తా. కలెక్టరేట్ ముందు ఆందోళన చేయకుండా అడ్డుకుంటే ఇంట్లోనే నిరాహార దీక్ష చేస్తా’ అని చెప్పుకొచ్చారు.