
రిజిస్ట్రార్ ఆఫీస్‌ను ముట్టడించిన విద్యార్థులు
విశాఖ ఏయూను ముట్టడించిన విద్యార్థులు
అసమర్థ వీసీ రాజీనామా చేయాలని నినాదాలు
కనీస వసతుల కల్పనలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం
ఎవరి కోసమో వర్సిటీని భ్రష్టుపట్టిస్తున్నారు
ప్రతిచోటా విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్నారు
మేము రాజకీయాలు చేస్తున్నామని మంత్రి లోకేశ్ చెప్పడం భావ్యం కాదు
బీచ్‌రోడ్డు (విశాఖ జిల్లా): ‘ఊపిరి పీల్చుకోలేని స్థితిలో తమ సహ విద్యార్థి ఆక్సిజన్.. ఆక్సిజన్.. అంటూ చనిపోయాడని, ఇందుకు ఆంధ్ర యూనివర్సిటీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు మండిపడ్డారు. ఆరు నెలలుగా వర్సిటీలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నా ఏయూ పాలకులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని, వారి నిర్లక్ష్యం ఖరీదే బీఈడీ విద్యార్థి మణికంఠ మరణమని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించడం చేతకాని వీసీ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఏయూలో బీఈడీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మణికంఠ బుధవారం ఉదయం ఊపిరి తీసుకోలేక అస్వస్థతకు గురవ్వడం.. సహ విద్యార్థులు ఏయూ ఆరోగ్య కేంద్రానికి ఫోన్ చేయడం.. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ ఉన్నప్పటికీ.. ఆక్సిజన్ పెట్టకుండానే కేజీహెచ్‌కు తరలించడం.. కాసేపటికే మణికంఠ మరణించడం తెలిసిందే. ఈ ఘటనపై విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శుక్రవారం ఏయూ విద్యార్థులు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఆరు నెలలుగా తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఈడీ ప్రవేశ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి వర్సిటీలో చేరిన మణికంఠను విగతజీవిగా అప్పగించడంపై ఆయన తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అధికంగా ఉన్న పరీక్షల ఫీజులు తగ్గించాలని కోరినా పట్టించుకోలేదని, అలాంటప్పుడు వీసీగా కొనసాగటం ఎందుకని, తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు ఎవరి మేలు కోసమో వర్సిటీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్టోబర్ 6వ తేదీ నాటికి సమస్యలన్నీ పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మెస్ చార్జీల పెంపు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అతీగతీ లేదని మండిపడ్డారు. సమస్యల గురించి మాట్లాడితే ఫెయిల్ చేస్తామంటూ విభాగాధిపతులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇది విశ్వవిద్యాలయమా.. లేక జైలా అని మండిపడ్డారు.
పోలీసుల అత్యుత్సాహం
ఏయూలో విద్యార్థులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తమను అడ్డుకుంటున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న కలెక్టరేట్ వద్ద సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు అమానుషంగా ప్రవర్తించి, భీమిలి పోలీస్ స్టేషన్‌కు తరలించారని వాపోయారు. మణికంఠ మృతికి నష్ట పరిహారం కోసం ఏయూ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు.
పురుష పోలీసులతో విద్యార్థినులపై దాడి చేయటం ఘోరమన్నారు. రాజకీయ ద్వేషంతో ఆందోళనలు చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. తామెలాంటి రాజకీయాలు చేయడం లేదని, సమస్యల్ని తప్పుదోవ పట్టించేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాక్ కమిటీ ఏయూను సందర్శిస్తుందని తెలిసి ఒక్క రాత్రిలోనే రోడ్లు వేసిన ఉన్నతాధికారులు.. తమ సమస్యలను మాత్రం ఆరు నెలలుగా పరిష్కరించకుండా సాగదీస్తున్నారని ధ్వజమెత్తారు.
ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ
ఏయూ డిస్పెన్సరీలో అందిస్తున్న సేవలు, విద్యార్థి మణికంఠ మరణానికి గల కారణాలపై విచారించేందుకు డీఎంఅండ్‌హెచ్‌వో, కేజీహెచ్ సూపరింటెండెంట్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌లతో కలెక్టర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదికను కలెక్టర్‌కు సమర్పించనుంది. వారం రోజుల్లో నివేదికలోని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తరుఫున డీఎస్పీ ప్రమీల హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
పోలీసులు మాపై దాడి చేశారు
మా తోటి విద్యార్థికి జరిగిన అన్యాయం, మా సమస్యల పరిష్కారం కోసం మేము ఉన్నతాధికారుల వద్దకు వెళ్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మహిళలని కూడా చూడకుండా మాపై దాడి చేశారు. నన్ను ఒక పోలీసు మోకాలితో నెట్టి వెనక్కి తోశారు. నా చేతికి గాయాలయ్యాయి. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఏయూను శవాల దిబ్బగా మారుస్తున్నారు. – సౌజన్య, ఎంబీఏ విద్యార్థిని
వర్సిటీలో నియంత పాలన
ఆంధ్ర యూనివర్సిటీలో నియంత పాలన సాగుతోంది. తనపై చాన్స్‌లర్ అయిన గవర్నర్ ఉన్నారనే విషయాన్ని కూడా గమనించకుండా వీసీ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయలేని అసమర్థ ఉన్నతాధికారులు తక్షణమే రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి. – తరుణ్, బీఈడీ విద్యార్థి
లిఖిత పూర్వకంగా ఇవ్వాలి
విద్యార్థుల సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు? ఎలా పరిష్కరిస్తారు? లిఖిత పూర్వకంగా ఏయూ అధికారులు తెలపాలి. ఇచి్చన గడువు లోపు సమస్యలు పరిష్కరించ లేకపోతే వారి పదవులకు రాజీనామా చేయాలి. ఆరు నెలలుగా అనేకసార్లు మా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రతిసారీ చేస్తాం అంటున్నారే తప్ప పరిష్కరించడం లేదు. ఈసారి పరిష్కరించే వరకు వదిలే ప్రసక్తి లేదు. – ప్రవీణ్ కుమార్, లా స్టూడెంట్