చిట్టడివి..చీకటి.. ఓ చిన్నారి కథ

The Story Of 7 Years Kid 14 Hours In The Bush Happy Ending - Sakshi

బిక్కుబిక్కుమటూ పొదలమధ్య 14 గంటలు

తెల్లవార్లు వెతికినా గ్రామస్తులకు తెలియని జాడ

తప్పిపోయిన పశువుల కోసం వెతుకుతున్న వారి కంటపడ్డాడు

సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు 

పోరుమామిళ్ల:  ఏడేళ్ల బాలుడు ఇంటికి బయలుదేరాడు. ఊరు దారి విడిచి అడవి దారి పట్టాడు. చిట్టడవిలో చిక్కుకుపోయాడు. చీకట్లో బిక్కుబిక్కుమంటూ తెల్లార్లు గడిపాడు. బిడ్డ కోసం తల్లిదండ్రులు, గ్రామస్తులు రాత్రంతా అడవిలో వెతుకులాడినా ఫలితం లేదు. తెల్లవారిన తర్వాత తప్పిపోయిన పశువుల కోసం వెతుకుతున్న వారి కంట పడ్డాడు. సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. 14 గంటల గ్రామస్తుల ఉత్కంఠకు తెరదించాడు. ఈ ఘటన వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్ల మండలంలో కవలకుంట్ల పంచాయతీలో జరిగింది.

గ్రామ­స్తుల కథనం ప్రకారం... కవలకుంట్ల పంచాయతీ బుచ్చం­పల్లెకు చెందిన మతకాల వెంకటసుబ్బ­య్య, సీతామహాలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సుమంత్‌(7) ఒకటవ తరగతి చదువుతున్నాడు. వెంకటసుబ్బయ్య గేదెలు మేపుకుంటూ, సీతామహాలక్ష్మి కూలిపనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం బడి నుంచి వ­చ్చి­న సుమంత్‌ తల్లి కట్టెపుల్లలకు వెళుతుంటే తనూ వెళ్లాడు. సమీపంలో అడవికి దగ్గరలో తండ్రి గేదె­లు మేపుతుండగా అమ్మతో చెప్పి నాన్న దగ్గరకు వెళ్లాడు. చీకటి పడుతుందని, నీవు ఈ దారిలో ఇంటికి వెళ్లు అని వెంకటసుబ్బయ్య కొడుక్కు చెప్పి..తాను చెట్లు, పొదల్లో మేస్తున్న గొడ్లను తోలుకొస్తానని దారి చూపించి వెళ్లాడు. బుడ్డో­డు సరేనని నాన్న చూపించిన దారిలో బయలుదేరాడు. పొరపాటున కొండదారి పట్టాడు. అలా నాలుగైదు కిలోమీటర్లు వెళ్లేసరికి బాగా చీకటిపడింది. కనుచూపు మేరలో ఊరు కనిపించలేదు. కేకలు వేసినా పలికే దిక్కు లేదు. బిక్కు బిక్కు మంటూ అలాగే ఓ పొద దగ్గర కూలబడిపోయాడు. చీకటి పడ్డా బిడ్డ ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. కనపడిన వారందరినీ అడిగారు. ఆచూకీ లభించలేదు. విషయం ఊరంతా పాకిపోయింది. ఓ యాభై మంది పిల్లాడిని వెతికేందుకు అడవికి బయలుదేరారు. పోలీసులు, ఫారెస్టు సిబ్బందికి సమాచారం అందడంతో వారూ వెతకడానికి వెళ్లా­రు. తెల్లారేంతవరకు పిల్లాడి ఆచూకీ దొరకలేదు.

పశువుల కోసం వెతుకుతుండగా... 
ఈ నేపథ్యంలో బుధవారం పొద్దుపొడవక ముందే కవలకుంట్లకు చెందిన ఏసయ్య, శాంతయ్యలు తప్పిపోయిన తమ గొడ్లను వెతికేందుకు అడవి దారి పట్టారు. అలా వారు వెళుతుండగా ఆరు గంటల ప్రాంతంలో పొద దగ్గర బాలుడి ఏడుపు విని అటు వెళ్లడంతో సుమంత్‌ కనిపించాడు. విచారిస్తే విషయం అర్థమయింది. బాలుడిని ఎత్తుకొని తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఊరి దారి పట్టారు. దారిలో ఉండగానే ఫారెస్టు సిబ్బంది, గ్రామస్తులు ఎదురయ్యారు. సుమంత్‌ను చూసి ఫారెస్టు సిబ్బంది వాళ్లకు కృతజ్ఞతలు చెప్పి పిల్లాడిని తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. 14 గంటలు ఎంతో టెన్షన్‌ పెట్టినా చివరాఖరుకు కథ సుఖాంతమయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top