అట్టహాసంగా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా సంబరాలు  | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా సంబరాలు 

Published Sat, Feb 10 2024 4:41 AM

State level competition will be held for five days at Visakhapatnam - Sakshi

విశాఖ స్పోర్ట్స్‌ : ‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు విశాఖ వేదికగా శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు, అధికారులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో బెలూన్లను ఎగురవేసి రాష్ట్ర పర్యాటక, యువజన స ర్విసులు, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థరెడ్డి, స్పోర్ట్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రద్యుమ్న, శాప్‌ ఎండీ ధ్యాన్‌చంద్ర, కలెక్టర్‌ డా. ఎ. మల్లికార్జున ఇతర అధికార, రాజకీయ ప్రముఖులతో కలిసి జాతీయ పతాకాన్ని, శాప్‌ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.

క్రీడాకారులందరితో ప్రతిజ్ఞ చేయించారు. శాప్‌ అధికారులు రూపొందించిన ప్రత్యేక ప్రకటనను చదవటం ద్వారా ‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్రస్థాయి పోటీలు క్రీడాకారుల కేరింతలు మధ్య విశాఖ రైల్వే మైదానంలో మంత్రి రోజా ప్రారంభించారు. అనంతరం.. అధికారులతో కలిసి 26 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. యువతలో క్రీడానైపుణ్యాలను పెంపొందించడానికే ఆడుదాం ఆంధ్రా పోటీలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు.

‘ఆడుదాం ఆంధ్ర’ అనేది అందరి ఆట.. యువతకు భవిష్యత్తుకు బంగారు బాట అని కొనియాడారు. యువ ఆటగాళ్లలో దాగి ఉన్న టాలెంట్‌ను వెలికితీసే వేట అన్నారు. 15,400 సచివాలయాల పరిధిలోని ఎంతో మందిని ఈ క్రతువులో భాగస్వామ్యం చేశామన్నారు. ఈనెల 13న  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజేతలకు వైఎస్సార్‌ స్టేడియంలో రాష్ట్ర టైటిల్స్‌ అందిస్తారన్నారు. 

విజేతలకు ప్రత్యేక శిక్షణ : కలెక్టర్‌  
ఈ క్రీడలకు విశాఖ మహానగరం వేదిక కావటం అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్‌ డా.ఎ. మల్లికార్జున చెప్పారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్ల సభ్యులకు ఏసీఏ, ప్రొ కబడ్డీ, బ్లాక్‌ హాక్స్, శ్రీకాంత్, సింధు బ్యాడ్మింటన్, ఖోఖో అసోసియేషన్ల తరఫున ప్రత్యేక శిక్షణ ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, డీసీసీబీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జేసీ కె. మయూర్‌ అశోక్, ఏడీసీ కె.ఎస్‌. విశ్వనాథన్, జాతీయ క్రికెటర్‌ శ్రీకర్‌ భరత్‌ తదితరులు పాల్గొన్నారు.  

బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి: బైరెడ్డి  
‘ఆడుదాం–ఆంధ్ర’ వేదికగా క్రీడాకారులు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆకాంక్షించారు. జీవితంలో గెలుపు ఓటములు సహజమని.. కష్టం విలువ తెలుసుకున్న రోజు విజయాలు వాటంతట అవే వస్తాయని క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా క్రీడల కోసం రూ.130 కోట్లు ఖర్చుపెట్టి గ్రామస్థాయి నుంచే పత్రిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేలా పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారన్నారు.

ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రద్యుమ్న మాట్లాడుతూ.. క్రీడాకారులు పోటీతత్వాన్ని అలవర్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం.. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు, వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అందులో భాగంగానే ‘ఆడుదాం ఆంధ్రా’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని శాప్‌ ఎండీ ధ్యాన్‌చంద్ర చెప్పారు. ఇక ఇప్పటివరకు జరిగిన క్రీడల్లో విజేతలకు రూ.12 కోట్లతో బహుమతులు అందజేశామని, రాష్ట్రస్థాయి విజేతలకు రూ.87 లక్షలతో బహుమతులు అందజేయనున్నామన్నారు.

ఆ బకాయిలు, ఆస్తులను రాబట్టండి..
షర్మిలకు మంత్రి రోజా సూచన 
అనంతరం.. మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు రావల్సిన రూ.ఆరువేల కోట్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాంలో ఏపీకి రావల్సిన రూ.లక్షా 80వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్‌ పార్టీకి చెందిన షర్మిల రాబట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి అక్కడ నేతలను ఆమె నిండా ముంచారని, పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీలో ఎందుకు పోరాటం చేస్తున్నారో షర్మిల చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు అమిత్‌ షా కాళ్లు పట్టుకోవడం సిగ్గుచేటన్నారు. రాజకీయంగా చంద్రబాబు రోజురోజుకి దిగజారిపోతున్నాడని రోజా ధ్వజమెత్తారు. ఇక ‘ఆడుదాం ఆంధ్రా’ కిట్‌లపై స్పందిస్తూ.. వాటిపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో వేస్తే తప్పేంటని.. ఆంధ్రా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫొటో వేయాలా అంటూ ప్రశ్నించారు. 

Advertisement
Advertisement