మిట్టల్‌పై మోహం.. ప్రైవేటు దాహం | Chandrababu Naidu Conspiracy Against Visakha Steel Industry, More Details Inside | Sakshi
Sakshi News home page

మిట్టల్‌పై మోహం.. ప్రైవేటు దాహం

Aug 12 2025 6:20 AM | Updated on Aug 12 2025 11:52 AM

Chandrababu conspiracy against Visakha Steel Industry

విశాఖ ఉక్కును ఉద్ధరిస్తామంటూనే.. ప్రైవేటు జపం చేస్తున్న కూటమి సర్కారు 

రాయితీల కోసం దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న మిట్టల్‌ స్టీల్స్‌ 

రాయితీలు ఇవ్వకపోతే ప్లాంట్‌ మూసివేస్తామంటూ హెచ్చరికలు 

ఇక్కడా అదే తరహా బెదిరింపులుంటాయని విమర్శలు 

ఇప్పటికే మిట్టల్‌ ప్లాంట్‌కు రూ.28 వేల కోట్ల ప్రోత్సాహకాలిచి్చన కూటమి  

స్టీల్‌ప్లాంట్‌కు తక్షణమే రూ.30 వేల కోట్ల సాయం కోరుతున్న ప్రజాసంఘాలు

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమను ఉద్ధరిస్తామంటూ ఊదరగొడుతున్న చంద్రబాబు సర్కారు.. ఆ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రానికి పరోక్షంగా సహకరిస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెబుతుండగా.. మరోవైపు ప్లాంట్‌కు కొద్ది దూరంలోనే మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పరిశ్రమను నిలబెట్టేందుకు రూపాయి కూడా విదల్చని చంద్రబాబు.. మిట్టల్‌ స్టీల్స్‌పై వ్యామోహంతో ఏకంగా రూ.28 వేల కోట్ల ప్రోత్సాహకాలు అందించడం విస్మయానికి గురి చేస్తోంది.

 మొదట్లో కొద్దోగొప్పో రాయితీలు అడిగి ఆ తర్వాత ప్రభుత్వం నెత్తినెక్కి కూర్చుంటుంది మిట్టల్‌ సంస్థ. దక్షిణాఫ్రికాలో ప్లాంట్‌ ఏర్పాటు చేసి ఇప్పుడు గొంతెమ్మ కోర్కెలు మిట్టల్‌ సంస్థ కోరుతోంది. భవిష్యత్తులో ఏపీ పరిస్థితి కూడా ఇలా మారకముందే మేల్కొనాలని ప్రజాసంఘాలు సూచిస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌కు పునరుజ్జీవనంపై దృష్టి సారించకుండా మిట్టల్‌కు మోకరిల్లడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

నాడు ప్రగల్భాలు పలికి.. 
ఎన్నికల ముందువరకూ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ, జనసేన నేతలు కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత విశాఖ ఉక్కును ముక్కలు చేసేందుకు ఏం చెయ్యాలో అన్నీ చేస్తోంది. ఓ వైపు కేంద్ర గనుల శాఖ మంత్రిత్వ శాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేసి తీరతామని మరోసారి కుండబద్దలుగొట్టింది. అయినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం ప్లాంట్‌ మూసివేసేందుకు పూర్తిగా సహకారం అందిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ ఉక్కుకు కొద్ది దూరంలో అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తోంది.

ప్రజలు, ఉద్యోగుల ఆందోళనలు, ప్రజాసంఘాలు, రాజకీయ పారీ్టల నిరసనలను ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ అండ్‌ కో మిట్టల్‌కు మోకరిల్లుతున్నారు. స్టేజ్‌–1లో మిట్టల్‌ పరిశ్రమ ఏర్పాటుకు ఏకంగా రూ.28 వేల కోట్ల ప్రోత్సాహకాలు అందించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ సంస్థకు కావల్సిన సమస్త సౌకర్యాలు కలి్పంచేందుకు సిద్ధమవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మిట్టల్‌ బెదిరింపులు మామూలుగా ఉండవు 
మిట్టల్‌ సంస్థ ప్లాంట్‌ ఏర్పాటు చేశాక ప్రభుత్వాన్నే బెదిరించే స్థాయికి చేరుకుంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. దక్షిణాఫ్రికాలో ఇదే మిట్టల్‌ సంస్థ అక్కడి ప్రభుత్వాన్ని బెదిరిస్తోంది. ఇప్పుడిస్తున్న రాయితీలు సరిపోవడం లేదనీ.. తాము కోరినంత రాయితీ, ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. లేదంటే ప్లాంట్‌ మూసేస్తామంటూ హెచ్చరిస్తోంది. దీంతో భయాందోళనలకు గురైన దక్షిణాఫ్రికా ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో 92 మిలియన్‌ డాలర్ల భారీ రాయితీలు కల్పించేందుకు అంగీకారం తెలిపింది. మిట్టల్‌ని పెంచి పోషిస్తే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంపైనా ఇలాంటి బెదిరింపులు తప్పవని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కాగా.. కూటమి ఎంపీల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడేందుకు ఒక్కసారి కూడా కూటమి ఎంపీలు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ వద్దకు వెళ్లలేదు. కానీ.. మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌కు సకల సదుపాయాలు కలి్పంచాలని కోరేందుకు మాత్రం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, విశాఖ ఎంపీ భరత్‌ నేతృత్వంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వద్ద సాగిలపడ్డారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని ఏ ఒక్కరోజూ కోరని కూటమి ఎంపీలు మిట్టల్‌ ప్లాంట్‌కు మాత్రం సొంత ఐరన్‌ ఓర్‌ గనులు కేటాయించాలని మోకరిల్లుతున్నారు. విశాఖ ఉక్కుపై కూటమి ఎంపీలు, ప్రభుత్వ తీరుచూసి విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి.  

మిట్టల్‌పై ఎందుకంత మోజు? 
మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ కోసం ఇప్పటికే వేల ఎకరాల భూముల్ని ధారాదత్తం చేసి.. ప్రజల జీవనోపాధి, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దశాబ్దాల చరిత్ర గల విశాఖ ఉక్కుని పరిరక్షించాలన్న ధ్యాస రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. సొంత గనులు కేటాయించాలని పదేపదే కోరినా పట్టించుకోని ఎంపీలు.. ఇప్పుడు మిట్టల్‌కు సొంత గనులు కేటాయించాలని కోరడం దుర్మార్గం. ప్రభుత్వ తీరు చూస్తే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని పూర్తిగా బలహీనపరచడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మిట్టల్‌ సంస్థపై చంద్రబాబు ప్రభుత్వం ఎందుకంత మోజు చూపిస్తోందో అర్థం కావడం లేదు. ఎంపీలు ప్రైవేటుకు ఊడిగం చేయడం హేయమైన చర్య. ఇప్పటికైనా కళ్లు తెరిచి స్టీల్‌ప్లాంట్‌కు రూ.30 వేల కోట్ల ఆరి్థక సాయం తీసుకొచ్చి ఆంధ్రుల హక్కుని బతికించాలి. – ఈఏఎస్‌ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement