పట్టణ పోరు ముందు టీడీపీ శ్రేణుల్లో గుబులు
వానొస్తే వీధులన్నీ చెరువులేగుంతల రోడ్లు.. పొంగుతున్న మురుగు కాలువలు
పెరుగుతున్న మలేరియా, డెంగీ కేసులు
ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన వైనం
వీధివీధినా చెత్తకుప్పలు, దోమల స్వైరవిహారం
సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలోనూ తాగునీటి కష్టాలు
విజయవాడలోనే రూ.350 కోట్ల బిల్లులు పెండింగ్.. నిలిచిన అభివృద్ధి పనులు
చేయని పనులకు బిల్లుల చెల్లింపులపై ఆరోపణలు.. నిజమైన పనులకు నిధుల కొరత
ఎన్నికల వేళ శిలాఫలకాలు.. రూ. కోట్ల పనులకు అనుమతులు.. అమలుపై సందేహాలు
రెండేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. వార్డుల్లోకి వెళ్లాలంటేనే వణుకుతున్న టీడీపీ నేతలు
సాక్షి, అమరావతి: వాన పడితే జలాశయాల్లా మారే రోడ్లు.. గుంతల రోడ్లు.. వీధి చివర కొండలా చెత్త.. దోమలు, జ్వరాలు.. గుక్కెడు తాగునీరు ఇవ్వలేని దుస్థితి. ఇంటి నుంచి బయటకు అడుగు పెడితే కుక్కల బెడద.. పద్మవ్యూహంలా ట్రాఫిక్.. ఏ పట్టణానికి వెళ్లినా జనం నోట ఇదే మాట. ఈ పరిస్థితుల్లో వార్డుల్లోకి వెళ్లి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలని కూటమి పార్టీల శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి. చంద్రబాబు రెండేళ్ల పాలనలో నగరాలు, పట్టణాలను గాలికి వదిలేసి ఇప్పుడు ఓట్ల కోసం జనం వద్దకు ఎలా వెళ్లాలని ఆందోళన చెందుతున్నాయి.
కనీస సౌకర్యాలు లేక జనం అల్లాడిపోతున్నా ఏమీ చేయలేకపోయామని, ఓట్లు ఎలా అడగాలని వాపోతున్నాయి. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాల్టీల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైన తరుణంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు జనం వద్దకు వెళ్లాలంటేనే వణుకుతున్నాయి. ఇటీవల ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని జనం పట్టించుకోలేదని, ఇప్పుడు వాళ్లు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలని వాపోతున్నారు.
సీఎం సొంత ఇలాకాలోనే దాహం కేకలు
పట్టణాల దుస్థితికి సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పమే నిలువెత్తు సాక్ష్యం. సొంత నియోజకవర్గంలో తాగునీటి సమస్యను ఆయన పరిష్కరించలేకపోయారు. అరకొరగా ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసి మొత్తం సమస్య తీరిపోయిందని చెప్పుకుంటున్నారు. కానీ జనం మాత్రం సరిపడా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర పట్టణాల పరిస్థితి మరీ దారుణం.
కర్నూలు నగరానికి నీరందించే గాజులదిన్నె ప్రాజెక్టులో 1.5 టీఎంసీలే మిగిలాయి. వానలు పడకపోతే నగరం గొంతెండటం ఖాయం. పాలకొండ నగర పంచాయతీలో కుళాయి తిప్పితే మొదటి ఐదు నిమిషాలు బురద నీరే. మంచినీటి కోసం కుళాయిల దగ్గర సిగపట్లు పట్టాల్సిన దుస్థితి. గత్యంతరం లేక పేదలు సైతం 20 లీటర్ల క్యాన్‌కు రూ.20 నుంచి రూ.40 చెల్లిస్తున్నారు. రక్షిత నీరు అందించాల్సిన మున్సిపాల్టీలు చేతులెత్తేయడంతో నీళ్లు కొనుక్కోవడం పట్టణ పేదలకు అదనపు భారంగా మారింది.
మురుగులో పట్టణాలు
వర్షాకాలానికి ముందే డ్రైనేజీ కాలువల్లో పూడిక తీయాలి. ఈ పనిని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో చేయలేదు. ఫలితంగా చిన్న వానకే కాలువలు పొంగుతున్నాయి. వర్షపు నీరు రోడ్లపైకి, లోతట్టు కాలనీల్లో నేరుగా ఇళ్లలోకి చేరుతోంది. శివారు కాలనీల్లో అసలు డ్రైనేజీలే లేవు. మురుగు గుంతల్లో నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు లేక పట్టణాల మురుగంతా నేరుగా చెరువులు, నదుల్లోకి వెళ్తోంది. వ్యర్థ జలాలతో చుట్టుపక్కల చెరువులన్నీ కలుషితమవుతున్నాయి. అదే నీరు తాగునీటి పథకాలు, బోర్లలోకి ఉబికి వస్తోంది. ఆ చెరువుల్లో పెరిగిన చేపలు తిని జనం అనారోగ్యం పాలవుతున్నారు.
వాన పడితే చెరువులే
వర్షపు నీరు పోయే దారిలేక ప్రధాన రహదారులే చెరువులవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ నడిబొడ్డులోని మొగల్రాజపురం, ఆటోనగర్ సహా అనేక ప్రాంతాలు చెరువుల్లా మారిపోయాయి. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ రోడ్డు చెరువును తలపించింది. రోడ్లపై డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదు. దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లోనే వాన వస్తే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. అయినా రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు.
పడకేసిన పారిశుద్ధ్యం.. విజృంభిస్తున్న జ్వరాలు
రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో పారిశుథ్యం అధ్వాన్నంగా మారిపోయింది. ఇంటింటి చెత్త సేకరణ పేరుకే మిగిలింది. వీధి చివర్లలో రోజుల తరబడి చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. తరలించే దారిలేక సిబ్బందే కుప్పలకు నిప్పు పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ పొగతో చుట్టుపక్కల వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు పట్టణాల్లో వీధికుక్కలు గుంపులుగా స్వైరవిహారం చేస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నిలిచిన మురుగు, పేరుకుపోయిన చెత్త ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటివల్ల దోమలు విపరీతంగా పెరిగాయి.
ఈ ఏడాది ఆగస్టు 30 నాటికి రాష్ట్రంలో మలేరియా కేసులు 27.9 శాతం పెరిగి 7,895కు చేరాయి. జూన్ నాటికే మలేరియాతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. డెంగీ కేసులు సైతం పెరిగాయి. విశాఖ, కర్నూలు, కడప, చిత్తూరు, ఎన్టీఆర్; కాకినాడ జిల్లాల్లో డెంగీ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. ఫాగింగ్, దోమల నివారణ చర్యలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. జ్వరాల బారిన పడిన పేదలు ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.
గుంతల రోడ్లు.. గంటల ట్రాఫిక్
పట్టణాల్లో అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారాయి. వేసిన రోడ్లకూ నాణ్యత లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హడావుడిగా అరకొరగా వేసిన రోడ్లు, చేసిన మరమ్మతులు అనేక చోట్ల వర్షాలకు కొట్టుకుపోయాయి. నాణ్యత లేకపోవడంతో ఆ రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. రాష్ట్రంలోనే పెద్ద నగరాలైన విశాఖ, విజయవాడలో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోంది. కొద్ది దూరం ప్రయాణానికే గంటల సమయం పడుతోంది.
బిల్లుల్లేక ఆగిన పనులు
పట్టణాల్లో అరకొరగా చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలోనూ ప్రభుత్వం చేతులెత్తేసింది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోనే పది నెలలుగా రూ.350 కోట్ల బిల్లులు పేరుకుపోయాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, మెటీరియల్ ఖర్చులు భరించలేక కాంట్రాక్టర్లు ఆగస్టులో అభివృద్ధి పనులన్నీ నిలిపివేశారు. మరోవైపు పనులు చేయకుండానే బిల్లులు దండుకున్న ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి.
ఏలూరు నగరపాలక సంస్థలో ఓ ఏజెన్సీకి రూ.5.36 కోట్లు, ఓ కాంట్రాక్టర్ పేరుతో రూ.2.67 కోట్ల బిల్లులు చెల్లించారు. పార్కులో జిమ్ పరికరాల మరమ్మతుల పేరుతోనే రూ.4.92 లక్షలు డ్రా చేశారు. అధికార పార్టీ నేతలు, వారి బినామీ కాంట్రాక్టర్ల కోసమే నిబంధనలు తుంగలో తొక్కి ఈ పనుల పందేరం సాగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన పనులకు డబ్బుల్లేవు, జరగని పనులకు బిల్లులు మాత్రం అందుతున్నాయి.
ఎన్నికల ముందు శిలాఫలకాల హడావుడి
రెండేళ్లకు పైగా పట్టణాల వైపు కన్నెత్తి చూడని చంద్రబాబుకు స్థానిక ఎన్నికలు దగ్గర పడగానే అభివృద్ధి గుర్తొచ్చింది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో రూ.7,469 కోట్లతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల పనులకు ఆగస్టులో హడావుడిగా పరిపాలనా అనుమతులు ఇచ్చి జనాన్ని మోసం చేయడానికి సిద్ధమయ్యారు. చేసిన పనులకే బిల్లులు చెల్లించలేని ప్రభుత్వం ఈ పనులను ఎప్పటికి పూర్తి చేస్తుందన్నది ప్రశ్నార్థకమే. ఇవన్నీ ఓట్ల కోసం వేసిన శిలాఫలకాలేనని పట్టణ ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
వార్డుల్లోకి వెళ్లాలంటేనే వణుకు
ఈ పరిస్థితుల్లో ఎన్నికలంటేనే టీడీపీ స్థానిక నేతలు బెంబేలెత్తుతున్నారు. వార్డుల్లోకి వెళ్తే పొంగుతున్న డ్రైనేజీలు, అందని తాగునీరు, గుంతల రోడ్లపై ప్రజలు నిలదీయడం ఖాయమని వారు ఆందోళన చెందుతున్నారు. రెండున్నరేళ్లలో పట్టణాలకు చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో చెప్పుకోవడానికి ఏమీ మిగల్లేదని ఆ పార్టీ శ్రేణులే అంతర్గతంగా వాపోతున్నాయి. శిలాఫలకాలతో ఓట్లు రాలవని, కనీస వసతులు కల్పించలేని పాలనకు పట్టణ ఓటరు తగిన తీర్పు ఇవ్వనున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


