పుట్టపర్తి డీఎస్పీ చిత్రహింసలు! | Srisatya Sai District Puttaparthi DSP Vijay Kumar overaction | Sakshi
Sakshi News home page

పుట్టపర్తి డీఎస్పీ చిత్రహింసలు!

Jun 23 2025 5:18 AM | Updated on Jun 23 2025 5:18 AM

Srisatya Sai District Puttaparthi DSP Vijay Kumar overaction

నిందితుడికి ముసుగు వేసి మీడియా ముందు హాజరుపరిచిన పుట్టపర్తి డీఎస్పీ విజయ్‌కుమార్‌

మీడియా ఎదుట బాధితుడి ఆర్తనాదాలు 

నాలుగు రోజుల క్రితమే తనను అరెస్టు చేసినట్లు వెల్లడి 

తన కుటుంబాన్ని కాపాడాలంటూ వేడుకోలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి కొమ్ము కాస్తూ పౌరుల ప్రాథమిక హక్కులను అణచివేసేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నా, పలు సందర్భాల్లో న్యాయస్థానాలు సైతం చీవాట్లు పెడుతున్నా వారి తీరు మారడంలేదు! తాజాగా శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి డీఎస్పీ విజయ్‌కుమార్‌ శైలి వివాదాస్పదంగా మారింది. కొత్తచెరువులో ఓ స్థల వివాదానికి సంబంధించిన కేసులో నిందితుడు పాండును ఆదివారం ఉదయం కర్ణాటకలోని కొప్పళలో అరెస్టు చేసినట్లు ఆయన మీడియా సమావేశంలో ప్రకటించగా.. గత నాలుగు రోజులుగా తనను నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్లు పాండు మొర పెట్టుకోవడం గమనార్హం.

ఘర్షణ జరిగిన రోజు తాను గ్రామంలో లేకున్నా అరెస్టు చేశారని, పోలీసుల నుంచి తనను, తన కుటుంబాన్ని కాపాడాలని వేడుకున్నాడు. పుట్టపర్తి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విజయ్‌కుమార్‌ ఓ వర్గానికి అనుకూలంగా పని చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాపిరెడ్డిపల్లిలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన సమయంలో హెలిప్యాడ్‌ వద్ద భద్రతా అధికారిగా ఉన్న విజయ్‌కుమార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.

కాగా, రెండు రోజుల క్రితం ఎన్‌పీ కుంట (నంబులపూలకుంట) ఎస్‌ఐ వలీబాషా ఓ యువకుడు, ఇద్దరు మహిళలను విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిచి చితకబాదడంపై బాధితులు ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రత్న విచారణకు ఆదేశించారు.  విచారణాధికారిగా కదిరి డీఎస్పీ శివన్నారాయణ స్వామిని నియమించారు. నివేదిక ఆధారంగా ఎస్‌ఐపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement