
ఆది నుంచి శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారశైలి వివాదాస్పదమే
గత ఏడాది ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో ఆగడాలు
సాక్షి, నంద్యాల: అటవీశాఖ సిబ్బందిపై శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దాడి వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. గత ఏడాది ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి తీవ్ర వివాదాస్పదమవుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా పేట్రేగిపోతున్నారు. రౌడీమూకలను పెంచి పోషిస్తున్నారని.. వారితో దాడులు చేయిస్తూ నియోజకవర్గంలో అరాచకం సృష్టిస్తున్నారన్న ఆరోపణలు కోకొల్లలు.
రేషన్ బియ్యం స్మగ్లింగ్‌గానీ, బెల్ట్ షాపుల నుంచి వసూళ్లు లేదా అక్రమంగా ఇసుక తరలింపు వ్యవహారాల్లో ఈ బ్యాచ్ ద్వారానే దోపిడీపర్వం సాగిస్తారన్న పేరుంది. అడ్డుచెబితే ‘అడ్డు’తొలగిస్తామన్నట్లుగా వారి్నంగ్‌లు ఇస్తున్నారు. చెప్పిన మాట వినకపోతే కక్షసాధింపులకూ వెనుకాడడంలేదు.
గత ఎన్నికల సమయంలో ‘ఎవడైనా ఎక్కువ మాట్లాడితే జీపునకు కట్టుకుని పోతా’ అంటూ ‘బుడ్డా’ చేసిన హెచ్చరిక ఆయన నేరస్వభావానికి అద్దంపడుతోంది. అందుకు తగ్గట్లుగానే గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో చెలరేగిపోతూ అలజడి సృష్టిస్తున్నారు. తాజాగా.. అటవీశాఖ సిబ్బందిపై ఆయన బరితెగించి చేసిన దాడి ఇందులో భాగమేనని తెలుస్తోంది. ఈ దాడి కాకతాళీయంగా జరగలేదని.. కక్షసాధింపులో భాగంగానే ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే దాడిచేసినట్లు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు రుజువుచేస్తున్నాయి.
వైఎస్సార్ స్మృతివనంలో సిబ్బంది తొలగింపు..
ఎనిమిది నెలల క్రితం టీడీపీకి చెందిన దుండగులు ఆత్మకూరు మండలంలోని వైఎస్సార్ స్మృతివనంలో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. దుండగులను అడ్డుకోవడంలో విఫలమైనందుకు విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని ఆత్మకూరు డీడీ సస్పెండ్ చేశారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్యే బుడ్డా.. డీడీ సాయిబాబాను కోరారు. సెక్యూరిటీ సిబ్బంది అలసత్వాన్ని క్షమించలేమని డీడీ చెప్పినట్లు సమాచారం. నాటి నుంచి ఎమ్మెల్యే పగతో రగిలిపోతున్నారు.
గ్రావెల్ అక్రమార్కులకు వత్తాసు..
రెండునెలల కిందట సున్నిపెంటకు చెందిన కొందరు టీడీపీ కూటమి నాయకులు నల్లమల అడవిలోకి ప్రవేశించి అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ అటవీ సిబ్బందికి దొరికారు. వెంటనే సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కూటమి నాయకులు ఎమ్మెల్యేకు విషయం తెలిపారు. దీంతో ఆత్మకూరు డీడీ సాయిబాబాకు ఎమ్మెల్యే బుడ్డా కాల్‌చేసి ‘ట్రాక్టర్లు మా వాళ్లవే. వదిలేయండి’.. అన్నారు.
ఈ విషయంలోనూ అటవీ అధికారి నిబంధనలు పాటించి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.60వేల చొప్పున జరిమానా విధించినట్లు సమాచారం. దీంతో ఎలాగైనా కక్ష సాధించాలన్న లక్ష్యంతోనే ఎమ్మెల్యే మంగళవారం రాత్రి అటవీశాఖ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.
ఏడాది కాలంగా ఎమ్మెల్యే బుడ్డా ఆగడాలు..
» ఆత్మకూరు పట్టణంలో ఒక వైశ్య ప్రముఖుడిపై పట్టపగలే దాడికి పాల్పడ్డారు. తర్వాత బలవంతంగా కేసును రాజీ చేయించారు.
» వెలుగోడుకు చెందిన మరో వ్యాపారిపై కేసులు పెట్టించి మానసికంగా, ఆర్థికంగా వేధించారు.
» మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో జరిగిన మూడు హత్యలలో బుడ్డా అనుచరులే ప్రధాన నిందితులు.
» కడపలో టీడీపీ మహానాడుకు ఆత్మకూరు నుంచి వాహనాల్లో వెళుతూ దారిలో భోజన ఏర్పాట్లు చేశారు. ఆహారం సరిపోకపోవడంతో వంట మాస్టర్‌ను చితకబాదారు.
» బుడ్డా అనుచరుడొకరు ప్రభుత్వ కార్యాలయంలో పనిచేయించుకున్నాడు. అయితే, తనకు చెప్పకుండా ఎలా చేయించుకుంటావంటూ అతనిపై విచక్షణారహితంగా దాడిచేశారు. అడ్డొచి్చన మరో ఇద్దరినీ తీవ్రంగా కొట్టడంతో వారంతా ఆస్పత్రిపాలయ్యారు. బాధితులను మీడియా ప్రతినిధులు ఎవరూ కలవకుండా ఆస్పత్రి వద్ద ఎమ్మెల్యే మనుషులను కాపలాగా ఉంచారు.
రౌడీబ్యాచ్‌తో ఆగడాలు..
నిజానికి.. ‘బుడ్డా’ గత ఏడాది గెలిచినప్పటి నుంచి నియోజకవర్గాన్ని పీల్చిపిప్పి చేస్తున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ తరలింపు, రేషన్ బియ్యం స్మగ్లింగ్, బెల్ట్ షాపుల విషయంలో అడ్డగోలుగా దోచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. వీటన్నింటినీ చక్కబెట్టేందుకు ఆయన ఒక రౌడీబ్యాచ్‌ను పెంచిపోషిస్తున్నారని, ఎవరిపైనైనా దాడిచేయాలంటే ఈ బ్యాచ్ అక్కడ వాలిపోతుందని స్థానికులు చెబుతున్నారు.
మంగళవారం కూడా ఎమ్మెల్యే వెంట ఈ రౌడీబ్యాచ్ ఉందని, వీరితోనే అటవీ సిబ్బందిపై దాడిచేసినట్లు తెలుస్తోంది. అలాగే, రెండునెలల కిందట మాజీమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డిపై భౌతికంగా దాడిచేసి ఆయన ఇంటిని ధ్వంసం చేసిన ఘటన కూడా ఈ రౌడీబ్యాచ్ కనుసన్నల్లోనే జరిగింది.