108 లేకపోవడంతో ప్రైవేట్ వాహనంలో బాధితుడుని తరలిస్తున్న కుటుంబీకులు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం
సీతారామపురం: సర్కారు వైద్య వ్యవస్థ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలయ్యింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సర్కారు వైద్య వ్యవస్థలో ఏర్పడిన తీవ్ర నిర్లక్ష్యానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మండల కేంద్రం సీతారామపురంలోని బెస్త కాలనీకి చెందిన మారుబోయిన వెంకటరమణ (55) ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆగమేఘాల మీద ఆయనను 24/7 పీహెచ్‌సీకు తరలించారు. అయితే అక్కడ ఒక మేల్, ఒక ఫిమేల్ డాక్టర్లు ఇద్దరు ఉన్నప్పటికీ వారివురూ విధులకు హాజరు కాలేదు.
ఇక్కడ ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉండాల్సి ఉండగా, ఇద్దరు బదిలీపై వెళ్లిపోవడంతో ఒక్క నర్స్ మాత్రమే విధులు నిర్వర్తిస్తోంది. ఆమె కూడా నైట్ షిఫ్ట్ చేసి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆయనకు ప్రాథమిక వైద్యం అందించే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా ఉదయగిరికి తరలించేందుకు 108 వాహనాన్ని సంప్రదించగా అది కూడా అందుబాటులో లేదు. పచ్చ రంగులు వేయించేందుకు ఈ వాహనాన్ని విజయవాడకు తరలించారు.
ప్రత్యామ్నాయంగా మరో వాహనాన్ని ఉంచకపోవడంతో గత్యంతరం లేక ప్రైవేట్ వాహనం రప్పించి ఉదయగిరికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వెంకటరమణ మృతి చెందాడు. వైద్య సిబ్బంది పీహెచ్‌సీలో అందుబాటులో ఉండి సకాలంలో ప్రాథమిక చికిత్సను అందించి ఉంటే వెంకటరమణ బతికుండేవాడని కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. 108 అయినా అందుబాటులో ఉంటే సకాలంలో ఉదయగిరికి తరలించి వైద్యం చేయించేవారమని విలపించారు.


