కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు.. సీఎం జగన్‌ చిత్తశుద్ధికి సాక్ష్యాలివే!

Speedy Construction Of Kidney Research Centre Palasa Srikakulam - Sakshi

పచ్చటి ఉద్దానం కంట వెచ్చగా జారిన కన్నీటి బొట్లు ఏ నాయకుడి కంటా పడలేదు. ఏళ్లుగా ఇక్కడి బీల నేలలో తెగిపడిన తాళిబొట్లు ఏ నేతనూ కదిలించలేదు. ఐదో తనం కోల్పోయిన తల్లులు, అమ్మనాన్నలకు దూరమైన పిల్లలు, మనుషులు లేక వారి జ్ఞాపకాలుగా మిగిలిన ఇళ్లు.. ఏవీ ప్రజా ప్రతినిధుల కరకు గుండెలను కరిగించలేదు. హామీలిచ్చిన వారు కొందరు, అన్నీ చేసేశామని ప్రచారం చేసుకున్న వారు ఇంకొందరు.

అలాంటి ఆపత్కాలంలో వచ్చాడొక నాయకుడు. వైద్యం కోసం విశాఖ వెళ్లే రోగుల చెంతకు డయాలసిస్‌ యూనిట్లు రప్పించాడు. డబ్బుల్లేక అల్లాడుతున్న అభాగ్యులకు చేతిలో నెలకు రూ.10 వేలు పెడుతున్నాడు. ఎక్కడో ఉన్న వంశధారను ఉద్దానంకు తీసుకువస్తున్నాడు. అతడే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, 200 పడకల ఆస్పత్రి, ఉద్దానం ప్రాజెక్టు ఆయన చిత్తశుద్ధికి సజీవ సాక్ష్యాలు. 

సాక్షి, శ్రీకాకుళం: ఉద్దానం ఊపిరి పీల్చుకుంటోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండడంతో మృత్యుకౌగిట నుంచి విడుదలవుతోంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఒకవైపు వ్యాధి మూలాలు కనుగొనేందుకు కిడ్నీ రీసెర్చ్‌ ఆస్పత్రిని నిర్మిస్తోంది. మరోవైపు వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యంతో పాటు డయాలసిస్, ఉచిత మందులను పూర్తిస్థాయిలో అందిస్తోంది. ఇంకోవైపు వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణం తాగునీరై ఉండొచ్చన్న నిపుణుల సూచనల మేరకు రూ.700 కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మిస్తోంది. ఇవి త్వరలోనే పూర్తి కానున్నాయి.  

పాదయాత్రలో చూసి.. 
పాదయాత్రలో కిడ్నీ వ్యాధి బాధితుల బాధలను వైఎస్‌ జగన్‌ దగ్గరుండి చూశారు. ప్రతిపక్ష నేత హోదాలో కవిటి మండలం జగతిలో కిడ్నీ బాధితుల భరోసా యాత్ర పేరిట పర్యటించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి.. తన కార్యాచరణను అప్పుడే స్పష్టంగా ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం డయాలసిస్‌ సెంటర్ల ఏర్పాటు, పింఛన్ల పెంపు, ఉపరితల తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు.  

బాబుదంతా బడాయే.. 
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, ఆయన భాగస్వామి పవన్‌ కల్యాణ్‌ ఉద్దానం కిడ్నీ బాధితులను పట్టించుకున్న పాపాన పోలేదు. తిత్లీ సమయంలో గోడు చెప్పుకుందామని వెళ్లిన వారిపై చంద్రబాబు మండిపడ్డారు కూడా. 2019 ఎన్నికల ప్రచారానికి సీఎం హోదాలో వచ్చిన చంద్రబాబు ఒక్క కిడ్నీ వ్యాధి బాధితుడికి కూడా భరోసా ఇవ్వలేకపోయారు. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ పెద్ద ఎత్తున ఉద్దానం సమస్య పరిష్కరించేశానని ప్రచారం చేసుకున్నారు తప్ప.. చేసిన పని ఒక్కటీ లేదు. తన మిత్రపక్షం అధికారంలో ఉన్నా కూడా ఏమీ చేయలేకపోయారు.   


కిడ్నీ రీసెర్చ్‌సెంటర్‌ పరిశీలనలో మ్యాప్‌ చూస్తున్న మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు  

బతుకుతా అనుకోలేదు.. అంతా జగనన్న దయే!
నా పేరు సుగ్గు లక్ష్మీ. ఇచ్ఛాపురం మండలం మారుమూల ప్రాంతం సన్యాసిపుట్టుగ గ్రామం మాది. నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ లక్షల రూపాయలు ప్రైవేటు ఆస్పత్రికే ధారబోశాను. అప్పట్లో కనీసం ఒక్క డాక్టర్‌ గానీ, మందులు ఇచ్చేవారు గానీ మా గ్రామానికి వచ్చేవారు కాదు. రెండున్నరేళ్ల నుంచి రూ.10వేలు పింఛన్‌ వస్తోంది. అంతే కాదు నన్ను డయాలసిస్‌ కేంద్రానికి తీసుకువెళ్లడానికి 108 బండి వస్తోంది. కలలో కూడా అనుకోలేదు నేను ఇప్పటి వరకు బతుకుతానని, అంతా జగనన్న దయే!  

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక..
►కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పింఛన్‌ను రూ.3500 నుంచి రూ.10వేలకు పెంచారు. 5పైబడి సీరం క్రియేటినిన్‌ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్‌ రోగులకు రూ. 10వేల పింఛను ఇస్తున్నారు.  
►ఉపరితల తాగునీరు అందించేందుకు రూ.700 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో గల 827 గ్రామాలకు ఇంటింటికీ కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. 
►వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు రీసెర్చ్‌ సెంటర్‌తో పాటు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కూడా మంజూరు చేశారు. మార్చిలో వీటిని ప్రారంభించనున్నారు. 
►టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో డయాలసిస్‌ సెంటర్లు ఉన్నాయి. 63 మెషీన్లతో 68పడకలపై డయాలసిస్‌ అందిస్తున్నారు. సోంపేట, కవిటిలో పడకలు పెంచారు. హరిపురంలో పది పడకలతో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్‌ సెంటర్లు మంజూరయ్యాయి.

►ఇవి కాకుండా ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో 10పడకలు, బారువ సీహెచ్‌సీలో 10పడకలతో డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కొత్తగా ప్రతిపాదనలు తయారయ్యాయి. ఇవికాకుండా రెండు కంటైన్డ్‌ బేస్డ్‌ సరీ్వసెస్‌ డయాలసిస్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అవి జిల్లాకొచ్చాయి. కవిటి, సోంపేట సీహెచ్‌సీల్లో వీటిని అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో యూనిట్‌లో ఏడేసి పడకలు ఉంటాయి.  

►టీడీపీ హయాంలో డయాలసిస్‌ రోగులకు 20రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37రకాల మందులను అందుబాటులో ఉంచారు.  

►కిడ్నీ రోగులకు వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్‌ ఎనలైజర్స్, యూరిన్‌ ఎనలైజర్స్‌ను ఉద్దానం పరిధిలో ఉన్న 29 ల్యాబ్‌లలో అందుబాటులో ఉంచారు. పాతవి పాడైతే ఎప్పటికప్పుడు కొత్తవి కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతున్నారు.  

►టీడీపీ హయాంలో జిల్లాలో నెఫ్రాలజీ విభాగమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం జీజీహెచ్‌లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించారు. ప్రతి శనివారం పలాస సీహెచ్‌సీకి వెళ్లి అక్కడి రోగులకు వైద్యం అందిస్తున్నారు.  

రూ. 10వేలు పింఛన్‌  అందుకుంటున్నాం  
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.10వేలు పింఛన్‌ ఇస్తున్నారు. టీడీపీ హయాంలో డయాలసిస్‌ చేసుకోవడానికి స్థానికంగా సరిపోయిన బెడ్స్‌ లేక ఇబ్బంది పడేవాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక సమస్యలు నుంచి గట్టెక్కాం. డయాలసిస్‌ కూడా సకాలంలో చేసుకుంటున్నాం.  
– మర్రిపాటి తులసీదాస్, డయాలసిస్‌ రోగి, పెద్దశ్రీరాంపురం, కంచిలి మండలం  

ఆదుకున్న జగనన్న ప్రభుత్వం 
పూర్తిగా చితికిపోయిన కిడ్నీ బాధితుల్ని జగనన్న ప్రభు త్వం వచ్చాక ఆదుకుంది. ఉద్దానం పర్యటన సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా మా సమస్యల మీద దృష్టిపెట్టారు. మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. 
 – లండ శంకరరావు, కిడ్నీ డయాలసిస్‌ రోగి, పెద్దశ్రీరాంపురం గ్రామం, కంచిలి మండలం

ఉచితంగా మందులు, ఇంజెక్షన్లు.. 
డయాలసిస్‌ కేంద్రంలో కిడ్నీ రోగులకు అవసరమైన అన్ని మందులను, ఇంజెక్షన్లను ఉచితంగానే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక విశాఖపట్నం లాంటి దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండానే డయాలసిస్‌ చేయించుకుంటున్నాం.    
– అందాల రత్నాలు, డయాలసిస్‌ రోగి, లోహరిబంద గ్రామం, 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top