భావి భారత నిర్మాతల సమగ్ర వికాసానికి పాఠ్యేతర కార్యకలాపాలే పునాది | Special story by CBIT Principal Professor CV Narasimhulu | Sakshi
Sakshi News home page

భావి భారత నిర్మాతల సమగ్ర వికాసానికి పాఠ్యేతర కార్యకలాపాలే పునాది

Jun 14 2026 5:55 AM | Updated on Jun 14 2026 5:55 AM

Special story by CBIT Principal Professor CV Narasimhulu

రేపటి నేతలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు తరగతి గదుల్లోనే కాదు క్రీడా మైదానాల్లోనూ తయారవుతారు

సాంస్కృతిక వేదికలు, ప్రయోగశాలల్లో పుట్టుకొస్తారు

సేవా కార్యక్రమాల్లో రూపుదిద్దుకుంటారు.

ప్రపంచానికి పట్టభద్రులు కాదు.. సమాజాన్ని మార్చగల సృజనశీలురు అవసరం  

సీబీఐటీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సీవీ నరసింహులు 

సాక్షి, ఎడ్యుకేషన్‌ డెస్క్‌: మానవ జీవిత సార్థకత అనేది విజ్ఞాన సముపార్జనలోనే కాక వ్యక్తిత్వ పరిపూర్ణతలోనూ నిక్షిప్తమై ఉందని హైదరాబాద్‌­లోని చైతన్య భారతీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ­(సీబీఐటీ) ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సీవీ నరసింహులు చెప్పారు. ఆయన శుక్రవారం మాట్లాడు­తూ జీవన పరమార్థం, మానవ అస్తిత్వం, సమాజం పట్ల బాధ్యత వంటివాటిపై  నిరంతర జిజ్ఞాస కలిగిన యువతే భావి భారత నిర్మాణానికి పునాదిగా నిలుస్తుందన్నారు. అలాంటి యువశక్తి­ని తీర్చిదిద్ద­గల పవిత్ర వేదికలు విద్యాసంస్థలని చెప్పారు. 

ఆధునిక విద్యా వ్యవస్థలో పాఠ్యపుస్త­కాలు, పరీక్షలు, మార్కులు మాత్రమే వి­ద్య­కు ప్రమాణాలు కావని, మేధో వికాసంతో పాటు భావో­ద్వేగ పరిపక్వత, సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, బాధ్యతా­యుత పౌరసత్వం వంటి గుణాలను పెంపొందించడమే నిజమైన విద్య లక్ష్యంగా చెప్పారు. ఈ సమగ్ర వికాసానికి సహ పాఠ్య, పాఠ్యేతర కార్య­క్రమాలు కీలక సాధనా­లు­గా నిలుస్తున్నాయ­న్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..  

సృజనాత్మకతను పెంపొందిస్తాయి..  
చర్చా వేదికలు, క్విజ్‌ పోటీలు, ఇన్నోవేషన్‌ ఫోరంలు, రోబో­టిక్స్, కోడింగ్‌ క్లబ్బులు, పరిశోధ­నా వేదికలు, మోడల్‌ యు­నైటెడ్‌ నేషన్స్‌ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచ­న­తో పాటు, సమస్యల పరిష్కార నైపుణ్యం, విశ్లే­ష­ణా­త్మక దృక్పథం, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. సాంకేతి­కత ఆధారిత సమకాలీన ప్రపంచంలో ఇవి అత్యంత అవసరమైన లక్షణాలు.

సాంస్కృతిక చైతన్యంతో ఆత్మవిశ్వాసం 
సంగీతం, నృత్యం, నాటకం, లలి­త కళలు, ఫొటోగ్రఫీ, చిత్ర నిర్మా­ణం, సాంస్కృతిక సంఘాలు వంటివి విద్యార్థులకు తమ ప్రతిభను వ్యక్తీకరించుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. వీటి ద్వారా ఆత్మవిశ్వాసం, భావోద్వేగ మేథస్సు, సాంస్కృతిక అవగాహన వంటివి అలవడతాయి.  

క్రీడలతో సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం 
క్రికెట్, ఫుట్‌బాల్‌ బాస్కెట్‌ బాల్, బ్యాడ్మింటన్, యోగా, మార్షల్‌ ఆర్ట్స్‌ వంటి క్రీడా కార్యక్రమాలు శారీరక దృఢత్వాన్ని ఇవ్వడంతో పాటు క్రమ­శిక్షణ, జట్టు భావన, ఓర్పు, పట్టు­దలను మనలో నింపుతాయి. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యా­న్నిస్తాయి. జీవితంలో విజయాన్ని సాధించడానికి అవసరమైన అనేక గుణాలు క్రీడా రంగంలోనే అలవడతాయి.

మనలో దక్షత పెంపుదలకు ఆ అనుభవాలే మూలం  
విద్యార్థి వేదికలు, సాంకేతిక ఉత్సవాలు, వార్షి­కోత్సవాలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్ర­మాలు, సహ విద్యార్థుల మార్గదర్శకత్వం వంటివి యువతకు బాధ్యతలను స్వీకరించే అవకాశా­న్నిస్తాయి. ఈ అనుభవాలు నాయకత్వం, సంభా­షణా నైపుణ్యం, నిర్ణయ సామర్థ్యం, నిర్వహణా దక్షతలను పెంపొందిస్తాయి.

సమాజ సేవ ద్వారా సామాజిక స్పృహ
ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమా­లు, రక్తదాన శిబిరాలు, అక్షరాస్యత, గ్రామీ­ణా­భివృద్ధి కార్యక్రమాలు విద్యార్థుల్లో సేవా భావం, సామాజిక బాధ్యత, మానవతా దృక్పథాన్ని పెంపొందిస్తాయి. సమాజ నిర్మాణంలో తమ పాత్రను వారు గుర్తించేందుకు ఇవి దోహదపడతాయి.

‘పరిశ్రమల’తో వ్యాపార నైపుణ్యాలు 
స్టార్టప్‌ కార్యక్రమాలు, పారిశ్రామిక వేత్తల క్లబ్బు­లు, ఇంటర్న్‌షిప్‌లు, ఇన్నోవేషన్‌ సెంటర్లు, పరి­శ్రమలతో అనుసంధాన కార్యక్రమాలు విద్యార్థు­లకు వాస్తవ ప్రపంచ సవాళ్లను పరిచయం చేస్తాయి. సమస్య పరిష్కారం, ఉమ్మడిగా పనిచేయడం, వృత్తిపరమైన సంభాషణ, వ్యాపార దృక్పథం వంటి నైపుణ్యాలను పెంపొందిస్తాయి.  

అభ్యసనం అనేది తరగతి గోడలను దాటి రావాలి 
ప్రపంచవ్యాప్తంగా యాజమాన్యాలు ఆవిష్కరణ సామర్థ్యం, సంభాషణా నైపుణ్యం, సహకార భా­వ­న, మార్పులకు అనుగు­ణంగా ఎదగగల సామర్థ్యా­న్ని కలిగిన యువతను కోరుకుంటున్నాయి. అందువల్ల విద్యాసంస్థలు తరగతి గది గోడలను దాటి విద్యార్థుల్లో సమగ్ర అభ్యాసనాన్ని ప్రోత్సహించాలి.

ప్రేరణలే ప్రతిభకు ప్రాణవాయువు
యువతలోని అంతర్గత సామర్థ్యాలు వెలుగులోకి రావాలంటే వారిని స్ఫూర్తిదాయకమైన అనుభవా­లకు, ఆలోచనలకు, సవా­ళ్లకు పరిచయం చేయాలి. జిజ్ఞాసను, నైతిక విలువలను, సామాజిక బాధ్యతను పెంపొందించే కార్య­క్ర­మాలే మానవ ప్రతిభ, వికాసానికి నిజమైన ఉత్ప్రేరకాలు.

అలాంటి విద్యా సంస్థలే భావి ప్రపంచానికి నాయకులను తయారుచేస్తాయి   
సంప్రదాయ పరిమితులను అధిగమించి సృజనాత్మక ఆలోచ­నలకు ప్రాధాన్యమిస్తూ.. బాధ్యతాయుతమైన ప్రయోగాలను ప్రోత్సహించే విద్యాసంస్థలే భావి ప్రపంచానికి నాయకులను అందించగలవు. మార్పును అవకాశంగా స్వీకరించే దృక్పథం విద్యార్థుల్లో స్థిరపడాలి.

చదువంటే మార్కుల సమాహారం కాదు.. విలువల నిర్మాణం
‘ముందడుగు వేయనిదే ఏదీ స్వయంగా సంభవించదు’.. అనే సత్యం విద్యార్థి జీవితానికీ వర్తిస్తుంది. ప్రశ్నించడం, అన్వేషించడం, నాయకత్వం వహించడం, బాధ్యత స్వీకరించడం వంటి లక్షణాలను విద్యాసంస్థలు పెంపొందించినప్పుడే యువత సమాజ మార్పున­కు కారకులవుతారు. విద్య అనేది మార్కుల సమాహారం కాదు.. విలువల నిర్మాణం. మ­నం సాధించిన పట్టాలు అవకాశాల ద్వారా­లను తెరవగలవు. 

కానీ వ్యక్తిత్వం, నాయక­త్వం, సేవా భావం, లక్ష్య సాధన సంకల్పమే మనిషిని శిఖరాలకు చేర్చగలవు. రేపటి నా­య­కులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సా­మా­జిక మార్పునకు దారితీసే మహనీయులు కేవలం తరగతి గదుల్లోనే కాదు, క్రీడా మైదా­నాల్లో, సాంస్కృతిక వేదికలపై, ఆవిష్కరణ ప్రయోగశాలల్లో, సేవా కార్యక్రమాల్లో రూపు­దిద్దుకుంటారు. ప్రపంచానికి మరింత మంది పట్టభద్రులు అవసరం లేదు.. సమాజాన్ని మార్చగల సృజనాత్మక నాయకులు అవసరం. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement