
వర్గపోరు నేపథ్యంలో జవిశెట్టి సోదరుల్ని హతమార్చిన టీడీపీ నేతలు
ఆరుగురు నిందితులూ టీడీపీకి చెందిన వారే
పిన్నెల్లి సోదరుల కోసం గాలిస్తున్నామన్న పల్నాడు ఎస్పీ
రాజకీయ కక్షతో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై అక్రమ కేసు
పిన్నెల్లి సోదరుల పాత్రపై ఆధారాలు చూపని పోలీసులు
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. ఈ కేసులో టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్య, జవిశెట్టి శ్రీనివాసరావు, తోట గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రంలను ఈ నెల 4న సాయంత్రం వెల్దుర్తిలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు.
టీడీపీలో వర్గపోరు నేపథ్యంలో గత నెల 24న గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు (మొద్దయ్య), జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురైన విషయం విదితమే. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపిన ఎస్పీ శ్రీనివాసరావు చనిపోయిన, చంపిన వ్యక్తులు టీడీపీకి చెందిన వారేనని మీడియాకు వీడియో రూపంలో వివరించారు.
మృతుల సమీప బంధువు తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు
జంట హత్యల కేసును వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై నెట్టాలన్న దురుద్దేశంతో పోలీసులు ఓ కట్టుకథ అల్లారు. హత్యలపై టీడీపీ నేత తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదులో గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే హత్యలు జరిగాయని తెలిపాడు. జవిశెట్టి వెంకటేశ్వర్లును హతమారిస్తే టీడీపీలో తనకు ఎదురుండదని, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ ఉండదన్న కారణంతోనే నిందితుడు తోట వెంకట్రామయ్య హత్య చేశాడని స్పష్టం చేశారు.
ఆ తరువాత ఎలాగైనా పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించాలన్న దుర్బుద్ధితో కట్టుకథ అల్లారు. హత్యలో పాల్గొన్న నిందితులు జవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య, దొంగరి నాగరాజు హత్యానంతరం ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులును కారులోని కత్తులు తీసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా కారులో కత్తులే ఉంటే.. జవిశెట్టి సోదరులను బండరాళ్లతో మోది ఎందుకు చంపుతారని, వారిని హత్య చేసేందుకు కత్తులే వాడేవారు కదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోలీసుల ఎఫ్‌ఐఆర్, ప్రభుత్వ వైద్యుల పంచనామాలో ఎక్కడా కత్తులు వాడినట్టు పేర్కొనలేదు. ‘వచ్చేది మా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. మిమ్మల్ని బతకనివ్వం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి చెబితేనే మేం చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లు చూసుకుంటారు’ అంటూ హత్యానంతరం నిందితులు కారులోంచి కతు్తలు చూపించి బెదిరిస్తూ వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిజంగా హత్యకు పిన్నెల్లి సోదరులు కుట్ర పన్ని ఉంటే ఇలా చెబుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఇది కేవలం పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇరికించేందుకే ప్రభుత్వం, పోలీసులు పన్నిన కుట్రగా అర్థమవుతోంది. నిందితులు బెదిరించారన్న కట్టుకథలు తప్ప ఈ హత్యలో పిన్నెల్లి సోదరుల పాత్రపై ఎటువంటి ఆధారాలు దొరకలేదు.