సీఎం చంద్రబాబుతో షర్మిల ఆత్మీయ సంబంధాలు!
వీలు చిక్కినప్పుడల్లా ఇరువురి భేటీలు..
కుమార్తె వివాహానికి స్వయంగా కలిసి ఆహ్వానించిన షర్మిల
తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నది కూటమి నేతలేనని గతంలో ఆవేదన
అలాంటి నేతలతోనే సన్నిహిత సంబంధాలా అంటూ నెటిజన్ల నిలదీత
ఏపీసీసీ అధ్యక్షురాలిగా కూటమి ప్రభుత్వంపై పోరాటమెక్కడ?
కాంగ్రెస్‌ను గాలికి వదిలేసి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమా?
షర్మిల ద్వంద్వ రాజకీయ వైఖరిపై సోషల్ మీడియాలో చర్చ
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. చంద్రబాబు విషయంలో మాత్రం పూర్తి భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనపై వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ గతంలో కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. ఇప్పుడు అదే కూటమి అధినేత, సీఎం చంద్రబాబుతో ఆత్మీయ సంబంధాలు కొనసాగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తాజాగా తన కుమార్తె వివాహానికి చంద్రబాబును స్వయంగా కలిసి ఆహ్వానించడం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. ఒకవైపు వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని నిత్యం రాజకీయ విమర్శలు.. మరోవైపు చంద్రబాబుతో స్నేహపూర్వక పలకరింపులు.. ఈ భిన్న వైఖరి వెనుక రాజకీయ వ్యూహమేమిటన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా అధికార కూటమి విధానాలపై పోరాడాల్సిన షర్మిల.. ఆ బాధ్యతను పక్కనపెట్టి రాజకీయ ప్రాధాన్యాలకే పెద్దపీట వేస్తున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబుతో ఎందుకంత ఆత్మీయత?
గత రెండున్నరేళ్లలో చంద్రబాబుతో షర్మిల పలుమార్లు సమావేశమయ్యారు. తాజాగా కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను స్వయంగా అందజేయడం అటు సోషల్ మీడియాలో ఇటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూటమి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. కానీ ఆ బాధ్యతను ఆమె పూర్తిగా పక్కనపెట్టారని, కేవలం ప్రధాని మోదీ లక్ష్యంగానే వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారని నెటిజన్లు ఎత్తిచూపుతున్నారు.
మరోవైపు చంద్రబాబుతో మాత్రం వ్యక్తిగతంగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ ఈ రెండు వైఖరుల మధ్య ఉన్న వైరుధ్యాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబుకు రాజకీయ ఇబ్బందులు తలెత్తినప్పుడు వెనకేసుకుని రావడానికి లేదా అసలు అంశాన్ని పక్కదారి పట్టించడానికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని షర్మిల ఉపయోగించుకుంటున్నారని, పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపణలు ఇప్పటికే ఆ పార్టీ వర్గాల నుంచి ఉన్నాయి. వాటికి బలం చేకూర్చేలా ఏపీసీసీ చీఫ్ వ్యవహరిస్తున్నారని నెటిజన్లు అంటున్నారు.
తనను తిట్టినవారితోనే చెలిమా?
షర్మిల గతంలో తనపై కూటమి నేతలు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారని నెటిజన్లు ఎత్తిచూపుతున్నారు. కానీ అలాంటి విమర్శలకు కారణమైన రాజకీయ వర్గాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
తన ఆత్మగౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేసినవారిని రాజకీయంగా నిలదీయాల్సిన బాధ్యత లేదా? వ్యక్తిగతంగా ఆత్మీయత ప్రదర్శించడం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశాలేమిటి? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. జగన్‌పై విమర్శలు చేయడంలో చూపుతున్న ఉత్సాహం కూటమి నేతల విషయంలో ఎందుకు కనిపించడం లేదన్నది సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తున్న మరో ప్రధాన ప్రశ్న.
కాంగ్రెస్ బాధ్యతలు గాలికేనా?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ స్థానం కల్పించాలంటే అధికార పక్షం విధానాలపై బలంగా పోరాడాలి. కానీ చంద్రబాబుతో సాన్నిహిత్యం కొనసాగిస్తూ ప్రభుత్వంపై చేసే విమర్శలు ఎంతవరకు విశ్వసనీయంగా ఉంటాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కుమార్తె వివాహానికి రాజకీయాలకు అతీతంగా ప్రముఖులను ఆహ్వానించడం తప్పు కాకపోవచ్చు. కానీ ప్రజాజీవితంలో ఉన్న నాయకురాలిగా షర్మిల వ్యవహారశైలిని ప్రజలు రాజకీయ కోణంలోనూ విశ్లేíÙస్తారు. వ్యక్తిగత మర్యాద పేరుతో రాజకీయ బాధ్యతలను విస్మరిస్తున్నారా? రాజకీయంగా అధికార పార్టీని లక్ష్యంగా చేసుకోవాల్సిందిపోయి సాన్నిహిత్యం కొనసాగించడం వెనుక ఉన్న వ్యూహమేమిటి? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదీ చదవండి: రాష్ట్రస్థాయి కార్యక్రమంగా రామోజీ జయంతి


