తిరుపతిలో షాడో ఎమ్మెల్యే! | Shadow MLA in Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో షాడో ఎమ్మెల్యే!

Jul 3 2024 5:45 AM | Updated on Jul 3 2024 5:45 AM

Shadow MLA in Tirupati

అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అన్న కుమారుడు 

తిరుపతి కార్పొరేషన్‌ అధికారులతో ఆయన సమీక్ష

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తిరుపతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒకరైతే... అన్నీ తానై వ్యవహరిస్తున్న షాడో ఎమ్మెల్యే మరొకరు. ఈ షాడో ఎమ్మెల్యే తీరుపై కూటమి నేతలే విస్మయం వ్యక్తంచేస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్న కుమారుడు ఆరణి శివకుమార్‌కు ఎలాంటి హోదా లేకపోయినా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. ఆయన సోమవారం తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో ఐఏఎస్‌ అధికారి అయిన కమిషనర్‌ అదితి సింగ్‌తో కలిసి విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ విషయం మంగళవారం వెలుగుచూసింది. ఎమ్మెల్యే అన్న కుమారుడు అధికారికంగా సమీక్ష నిర్వహించడం ఏమిటని మున్సిపల్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అదేవిధంగా స్విమ్స్‌లో నిర్వహించిన డాక్టర్స్‌ డే వేడుకల్లో కూడా ఆరణి శివకుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించడం తీవ్ర దుమారాన్ని లేపింది. ఆయా కార్యక్రమాల్లో అన్నీ తానే అన్నట్లుగా శివకుమార్‌ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. 

ఆయనతోపాటు మరో నలుగురు వ్యక్తులు సైతం తాము ఎమ్మెల్యేకు సమీప బంధువులం.. అంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో హల్‌చల్‌ చేస్తుండటం కలకలం రేపుతోంది. ఎన్నడూ లేనివిధంగా తిరుపతిలో వింత సంస్కృతిని చూస్తున్నామని అధికారులు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement