
విశాఖ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండ కాస్తా వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశాలో వాయుగుండంగా కొనసాగుతోంది. ఒడిశాలో దక్షిణ నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఒడిశా నుంచి ఉత్తర ఛత్తీస్‌ఘడ్ వరకు పయనించి మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఏపీలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు గా వర్షాలు పడే అవకాశం ఉంది.
కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది దీని ప్రభావంతో పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు జిల్లా లో కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు అవకాశం ఉంది. 35 నుంచి 45 కిలోమీటర్లు, గరిష్టం గా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. టెక్కలి, మందస 17 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.

శ్రీకాకులం జిల్లాలో భారీ వర్షాలు
తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కేరాసింగ్‌లో రోడ్డుపై కొండచరియుల విరిగిపడ్డాయి. వరద ఉధృతికి రహదారి భారీగా కోతకు గురైంది. ఆముదాలవలస, సిరుబుజ్జిలి మండలాల్లో భారీ వర్షం కురవగా, ఎల్‌ఎన్‌పేట, బూర్గ, జలుమూరు మండలాల్లో భారీ వర్షం పడింది.

పార్వతీపురం నాగావళి నదికి వరద ఉధృతి పోటెత్తింది. బాసింగి గ్రామం వరద ముంపునకు గురైంది. సంగమేశ్వరస్వామి వారి ఆలయం నీట మునిగింది. మరొకవైపు అల్లూరి జిల్లాలో సైతం పలుచోట్ల వర్షం పడింది. చింతూరు, వీఆర్‌పురం మండలాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సోకిలేరు ఉధృతంగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీనిపై ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోవడంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు తక్షణ ఆర్థిక సాయం అందక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.