మొలకెత్తే పెన్ను.. పర్యావరణానికి దన్ను

Seeds on the back of use and throw pens made of paper - Sakshi

పేపర్‌తో తయారు చేసిన ‘యూజ్‌ అండ్‌ త్రో’ పెన్నుల వెనుక విత్తనాలు 

వాడి పడేశాక మట్టిలో కలసిపోయి విత్తనాలు మొలకెత్తేలా రూపకల్పన 

ప్రయోగాత్మకంగా వినియోగంలోకి తెచ్చిన పాఠశాల విద్యాశాఖ 

గుంటూరు (ఎడ్యుకేషన్‌): సింగిల్‌ యూజ్‌ ప్లాస్టి­క్‌ వస్తువుల తయారీ, వినియోగంపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ప్ర­భుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే పెన్నులను సైతం పర్యావరణ అనుకూల విధానంలో ఉపయోగిస్తోంది. యూజ్‌ అండ్‌ త్రో (వాడిపారే­సే) ప్లాస్టిక్‌ పెన్నులు భూమిలో కలిసిపోయేందు­కు వందల ఏళ్లు పడుతుంది.

ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగు­లు రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల సంఖ్యలో పె­న్నులను వాడి పారేస్తుండటంతో పర్యావరణాని­కి హాని కలిగించని పెన్నుల తయారీ, వినియో­గంపై ప్రభు­త్వం దృష్టి సారించింది. తొలుత వి­ద్యా­శాఖలో ప్రయోగాత్మకంగా పర్యావరణ అను­కూల పెన్నుల వినియోగాన్ని అమల్లోకి తెచ్చింది.  

కాగితం పొరలతో.. 
కాగితం పొరలతో తయారు చేసిన పెన్నులకు మందపాటి అట్టతో రూపొందించిన క్యాప్‌ ఉంచిన పెన్నులను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఉచితంగా అందజేస్తున్నారు. ప్యాడ్‌తో పాటు పేపర్‌ పెన్నులను ఇస్తూ.. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు.

ప్రత్యేకంగా పేపర్‌ పెన్నుల ఉత్పత్తిదారులకు ఆర్డర్‌ ఇచ్చి పెన్నులు తయారు చేయిస్తున్నారు. వీటిని వాడిన తరువాత పడేస్తే అవి మట్టిలో కలిసిపోతాయి. మరో విశేషం ఏమిటంటే.. ఆ పెన్నుల వెనుక భాగంలో అమర్చిన చిన్న గొట్టంలో నవ ధాన్యాలు, వివిధ దినుసులు, పూల మొక్కల విత్తనాలను అమర్చారు. బీన్స్, సన్‌ఫ్లవర్, మెంతులు తదితర విత్తనాలను కూడా అమర్చుతున్నారు.

పెన్నును వాడి పారేసిన తరువాత ఇంటి పెరట్లోనో, రోడ్డు పక్కన మట్టిలోనో పారవేస్తే పెన్ను భూమిలో కరిగిపోయి.. అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. ప్రస్తుతం బల్క్‌ ఆర్డర్లపై తయారు చేస్తున్న ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నును కేవలం రూ.20కే కొనుగోలు చేయవచ్చు. గురువారం గుంటూరు నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు ఎకో ఫ్రెండ్లీ పెన్నులను విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top