వైఎస్సార్ కడప జిల్లాలో ఘటన
కడప కార్పొరేషన్: ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు సచివాలయంలో పనిచేసే హెల్త్ సెక్రటరీ బలయ్యారు. వైఎస్సార్ జిల్లా కడప నగరం 27/2 గౌస్ నగర్ సచివాలయంలో పనిచేస్తున్న జి.విజయకుమారి (42) అకస్మాత్తుగా మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... ఈ నెల 17న మధ్యాహ్నం పాత కడప యూపీహెచ్సీలో విజయకుమారి విధి నిర్వహణలో ఉన్నప్పుడు... ఉన్నతాధికారులు ఫోన్ చేసి సర్వేలు ఎందుకు చేయలేదు.., పై నుంచి చాలా ఒత్తిడి ఉంది.., తప్పకుండా ఆ సర్వేలు చేయాల్సిందేనని.. ఫోన్‌లో గట్టిగా మాట్లాడినట్లు సమాచారం. పండుగ సమయంలో విధి నిర్వహణలో ఉన్నా ఉన్నతాధికారులు గట్టిగా మాట్లాడడంతో ఆమె ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.
అప్పటికే ఆమెకు శ్వాస సమస్య ఉండడంతో ఇంటికి వచ్చాక తలనొప్పిగా ఉందని, మోషన్స్ అవుతున్నాయని కుమార్తెతో చెప్పినట్లు తెలిసింది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఊపిరి ఆడడం లేదని చెప్తూ కళ్లు మూసుకుని అలాగే ఒరిగిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. తమ తల్లి మరణించడానికి అధికారుల ఒత్తిళ్లే కారణమని వారు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకులు ఆమె నివాసానికి చేరుకుని విజయకుమారి మృతదేహానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల ఒత్తిడి భరించలేక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒక సచివాలయానికి 8 మంది కార్యదర్శులు, 20 మంది వలంటీర్లు ఉండేవారని, ఇప్పుడు ఐదారు మంది మాత్రమే ఉన్నారని, వలంటీర్లు చేసే పని వారిపైనే పడిందన్నారు. దీనివల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. విజయకుమారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


