పొదుపు మహిళల రుణాల వడ్డీ రేపు జమ | Sakshi
Sakshi News home page

పొదుపు మహిళల రుణాల వడ్డీ రేపు జమ

Published Thu, Aug 10 2023 5:17 AM

Savings Womens Loan Interest Deposited Tomorrow - Sakshi

సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లిస్తే ఆ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తోంది. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. వరుసగా నాలుగో ఏడాది కూడా ప్రభుత్వమే భరించి, ఆ వడ్డీ డబ్బులను శుక్రవారం నేరుగా మహిళల ఖాతాలలో జమ చేయనుంది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం నాలుగో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల మంది మహిళలకు సంభంధించిన 10 లక్షల రుణ ఖాతాల వడ్డీ మొత్తం రూ.1,353.76 కోట్లను ప్రభుత్వం ఆ మహిళలకు అందజేయనుంది.

ఈ లబ్ధిదారులు 9,48,122 సంఘాలకు చెందిన వారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లి గ్రామంలో లబ్దిదారులైన వేలాది మంది మహిళల సమక్షంలో బటన్‌ నొక్కి వడ్డీ డబ్బును వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా.. ఉమ్మడి రాష్ట్రం నుంచి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారు. దీంతో అప్పట్లో పొదుపు సంఘాల మహిళలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపో­యి ఇబ్బందులు పడ్డారు.

వైఎస్‌ జగన్‌తన సుదీర్ఘ పాదయాత్రలో పొదుపు సంఘాల మహిళల ఇబ్బందులు గుర్తించారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక 2019 ఎన్నికలు జరిగిన నాటికి పొదుపు సంఘాలకు సంబంధించి మహిళలకు ఉండే బ్యాంకు అప్పులను నాలుగు విడతల్లో చెల్లించేందుకు వైఎస్సార్‌ ఆసరా పథకం తీసుకొచ్చారు. రుణాలు సకాలంలో చెల్లించే మహిళలకు వడ్డీ డబ్బును ప్రభుత్వమే భరించేలా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికీ జీవం పోశారు. 

ముఖ్యమంత్రి కార్యక్రమం ఇలా.. 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అమలాపురం చేరుకుంటారు. అక్కడి నుంచి జనుపల్లి గ్రామానికి వెళ్తారు. జనుపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం లబి్ధదారులకు నిధులు విడుదల చేస్తారు. అనంతరం తాడేపల్లికి తిరుగు పయనమవుతారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.  

గత మూడు విడతలతో కలిపి రూ.4,969 కోట్లు 
2019 నుంచి ఇప్పటికే వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాలకు పొదుపు సంఘాల మహిళల రుణాల వడ్డీ మొత్తాలను ప్రభుత్వమే భరించింది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ. 3615.29 కోట్లను లబ్ధిదారులకు అందజేసింది. నాలుగో విడత కూడా కలిపితే మొత్తం రూ. 4969.05 కోట్లు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారానే అందజేసినట్టు అవుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) అధికారులు వెల్లడించారు. మరోవైపు తొలి ఏడాది 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ద్వారా అందజేసిన లబ్ధిదారుల సంఖ్య కంటే నాలుగో ఏడాది లబ్ధి పొందే వారి సంఖ్య 20 లక్షల వరకు పెరిగినట్టు అధికారులు తెలిపారు.

2019–20లో 7.81 లక్షల సంఘాలకు చెందిన దాదాపు 81.52 లక్షల మంది మహిళలకు సంబంధించిన రుణాలపై రూ. 1,257.99 కోట్లు వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం భరించింది. ప్రస్తుత నాలుగో ఏడాదిలో లబ్ధిదారుల సంఖ్య 1.05 కోట్లకు, సంఘాల సంఖ్య 9,48,122 పెరిగింది. వడ్డీ మొత్తం కూడా రూ. 1,353.76 కోట్లకు పెరిగింది. నాలుగో విడతలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 83.86 లక్షల మంది రూ.1002.31 కోట్ల మేర లబ్ధి పొందనుండగా.. పట్టణ ప్రాంతాలకు చెందిన 21.26 లక్షల మంది మహిళలు రూ. 351.45 కోట్లు లబ్ధి పొందనున్నారు. అత్యధికంగా శ్రీకాకు­ళం జిల్లాలో 5.92 లక్షల మంది మహిళలు రూ. 69.50 కోట్లు లబ్ధి పొందనున్నారని అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement