సంతోషాల మకరందం.. పల్లెల్లో సంక్రాంతి శోభ

Sankranti beauty in the countryside - Sakshi

సొంతూళ్ల బాట పట్టిన ప్రజలు

రహదారుల్లో వాహనాల రద్దీ  

కిటకిటలాడిన షాపులు  

రికార్డు స్థాయి దిగుబడులతో కళకళలాడుతున్న రైతుల లోగిళ్లు

వరుస నోటిఫికేషన్స్‌తో నిరుద్యోగ యువతలో జోష్‌

ఆనందాలు ముంగిళ్లలో రంగవల్లులై మెరిసినట్టు.. ఉత్సాహధ్వానాలు హరిదాసుల  కీర్తనలై మార్మోగినట్టు.. సంక్షేమ సిరులు పాలపొంగళ్లై పొంగినట్టు.. ‘‘నవరత్నాలు’’ పొదిగిన నవ్వుల ఇంద్రధనస్సులు భోగిమంటల వెలుగులో దేదీప్యమానమై శోభిల్లినట్టు.. ధాన్యలక్ష్మి బసవన్నలతో కలిసి లయబద్ధంగా నర్తించినట్టు.. ప్రతిపతాక గగనాన  పతంగులై సగర్వంగా రెపరెపలాడినట్టు..  ‘‘గడపగడపా’’ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతోంది. సంతోషాల ‘మకర’ందాలు గ్రోలుతోంది. పండగ కళతో ఉట్టిపడుతోంది. 

సాక్షి, అమరావతి: పల్లెలు సంక్రాంతి కాంతులతో తళుకులీనుతున్నాయి. దూరప్రాంతాల నుంచి బంధుమిత్రుల మిత్రుల రాకతో జన తరంగమై పరవళ్లు తొక్కుతున్నాయి. సంప్రదాయ కోడిపందేలు, ఎద్దుల ప్రదర్శనలకు సిద్ధమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయి పంటల దిగుబడులు రావడంతో కర్షకుల ఇంట ఆనందం తొణికిసలాడుతోంది. పెద్ద పండగను అట్టహాసంగా జరుపుకునేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. కొత్త దుస్తులు, కొత్తవస్తువుల కొనుగోళ్లకు తరలివెళ్తున్నారు. ఫలితంగా దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌ కిటకిటలాడుతున్నాయి.

మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్స్‌ ఇస్తుండడంతో నిరుద్యోగ యువతలో ఉత్సాహం ఉరకలేస్తోంది.  ఇప్పటికే గ్రూప్‌–1, గ్రూప్‌–2, జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్స్, అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్స్‌తోపాటు ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడంతోపాటు త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వబోతున్నట్టు సర్కారు ప్రకటించడంతో యువతరంలో కొత్త జోష్‌ కనిపిస్తోంది.  

సంక్షేమ ‘సిరి’నవ్వులు 
గడిచిన నాలుగున్నరేళ్లల్లో వివిధ పథకాల ద్వారా  ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో మొత్తం రూ.2.46 లక్షల కోట్లు జమ చేసింది. దాదాపు ప్రతినెలా ఏదో పథకం రూపంలో ప్రభుత్వం చేయూతనివ్వడంతో పేదలు ఆర్థిక సాధికారత సాధించారు. పేదలతోపాటు మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఇంటింటా చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి.
 
సేద్యలక్ష్మి కటాక్షం 
ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఆ తర్వాత మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలు రైతన్నలను కలవరపెట్టినప్పటికీ సాగైన విస్తీర్ణంలో మాత్రం రికార్డు స్థాయి దిగుబడులు రావడం రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. వరి ఎకరాకు గతేడాది సగటున 30–35 బస్తాల దిగుబడి రాగా, ఈ ఏడాది ఏకంగా ఎకరాకు సగటున 35–40 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో రైతన్నల గాదెలన్నీ ధాన్యపురాశులతో నిండిపోయాయి. 

వాహనాల అమ్మకాల జోరు 
మరొక వైపు కొత్త అల్లుళ్ల రాకతో రాష్ట్రంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో పురోగతి నమోదవుతుందన్న విక్రయదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌కు ముందు ప్రతి నెలా దేశ వ్యాప్తంగా సగటున 18 లక్షల వాహనాలు అమ్ముడవుతుంటే కోవిడ్‌ తర్వాత పది లక్షలకు పడిపోగా, గతేడాది 12 లక్షల వాహనాలు అమ్మకాలు జరిగాయి.

కాగా ఈ ఏడాది కనీసం 15 లక్షలకు పైగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. కార్ల అమ్మకాలు. కోవిడ్‌కు ముందు ప్రతి నెలా దేశ వ్యాప్తంగా 2.7 లక్షల కార్లు విక్రయం అవుతుంటే, ఆ తర్వాత 3.5 లక్షలకు చేరినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం 4లక్షలకు పైగా కార్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.  

వస్త్ర వ్యాపారంలో 20 శాతం వృద్ధి 
సంక్రాతి అమ్మకాల్లో వస్త్ర వ్యాపారం, ఎలక్ట్రానిక్స్‌ అమ్మకాలదే అగ్రస్థానంగా ఉంది. వస్త్ర వ్యాపారం గతేడాదితో పోలిస్తే 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే  ఈ ఏడాది 30 శాతం వృద్ధిని నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నారు. 
ళీ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈ సంక్రాంతికి రూ.వెయ్యి కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

♦  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వస్త్ర, బంగారం దుకాణాల ద్వారా రూ.300 కోట్ల మేర వ్యాపారం జరిగే అవకాశం నెలకొందని వ్యాపారులు చెబుతున్నారు.  
♦ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి సందర్భంగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వస్త్ర, బంగారం, కిరాణా దుకా­ణా­ల్లో మొత్తం రూ.250 కోట్ల మేర వ్యాపా­రం జరుగుతుందని విక్రయదారుల అంచనా. 

వాణిజ్య కార్యకలాపాల్లో 25 శాతం వృద్ధిరేటు 
పొరుగు రాష్ట్రాలు, పట్టణాల నుంచి సొంతూళ్ల బాట పట్టే వారితో బస్సులు, రైళ్లు, విమానాలు కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాలతో వచ్చే ప్రయాణికులతో టోల్‌ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. కొత్త దుస్తులు, కొత్త వస్తువుల కొనుగోలుదారులతో అన్ని షాపులూ కిక్కిరిసిపోతున్నా­యి. నూతన వస్త్రాల దగ్గర నుంచి కార్లు, బంగారం వరకు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు కొనుగోళ్లు చేస్తున్నారు. ఫలితంగా గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాల్లో 25 శాతానికి పైగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 

కొత్త అల్లుళ్లు, బంధువులతో కళకళ
బంధువులు, కొత్త అల్లుళ్లతో పల్లెలు కళలాడుతున్నాయి. వారి కోసం సంప్రదాయ పిండివంటల తయారీ చేయడంతో ఇళ్లన్నీ ఘుమఘుమలాడుతున్నాయి. ముగ్గులు, వివిధ క్రీడా పోటీలు, బొ­మ్మల కొలువులతో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. కొన్ని చోట్ల పూర్వ విద్యార్థులంతా స­మావేశాలు ఏర్పాటు చేసుకుని, నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. కోనసీమ గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా జరిగే ప్రభల తీర్థాలు, సంప్రదాయ కోడి పందాలను చూడటానికి ప్రజ­లు గ్రామీణ ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top