22న మొదటి విడత నిధులు జమ చేస్తామన్న సర్కారు
అందరికి పెట్టుబడి సాయం అందేనా?
అన్నదాతల్లో అనుమానాలు
కామారెడ్డి క్రైం: ఓ వైపు యాసంగి పంటలు కోతకు వస్తున్నాయి. మరో నెల గడిస్తే ఖరీఫ్ సీజన్‌కు రైతులు సమాయత్తం అవుతారు. ఈ పరిస్థితుల్లో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా విడుదలపై స్పష్టత వచ్చింది. మొదటి విడతలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు ఈనెల 22 న పెట్టుబడి సాయం అందించనున్నారు. సకాలంలో అందకపోయినా పంటల సాగులో చేసిన అప్పులు, ఇతర అవసరాలకు ఆసరాగా ఉండనుండడంతో రైతులు కాస్త ఊరట చెందుతున్నారు.
జిల్లాలో 3,32,611 మంది రైతులు..
జిల్లాలో గత యాసంగి లెక్కల ప్రకారం మొత్తం 3,32,611 మంది రైతులున్నారు. ఇందులో ఎకరంలోపు భూమి కలిగిన రైతులు 1,30,671 మంది, 1 నుంచి 2 ఎకరాల మధ్య ఉన్నవారు 81,796 మంది, 2నుంచి 3 ఎకరాలు కలిగిన రైతులు 48,945 మంది, 3 నుంచి 4 ఎకరాలున్నవారు 26,734 మంది, 4 నుంచి 5 ఎకరాలు కలిగిన రైతులు 15,800 మంది ఉన్నారు. 5 నుంచి 10 ఎకరాల మధ్య భూమి ఉన్నవారు 11,265 మంది, 10 ఎకరాలకుపైగా భూమి కలిగిన వారు 1,493 మంది ఉన్నారు. అందరికీ రైతు భరోసా నిధులు జమ చేయాలంటే రూ.316.53 కోట్లు అవసరం.
ఈనెల 25 వరకు కొత్త దరఖాస్తులకు అవకాశం
జిల్లాలో గతేడాదికంటే ఈసారి రైతుల సంఖ్య 12 వేలు పెరిగింది. వారికి కూడా పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అవకాశం కలి్పంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకల్లా రిజి్రస్టేషన్‌లు, ఆన్‌లైన్ రికార్డుల ప్రక్రియ పూర్తయిన భూములకు దరఖాస్తు చేసకునే అవకాశం ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్ వివరాల్లో మార్పులు, గతంలో సాంకేతిక కారణాల (డీబీటీ ఫెయిల్యూర్)తో రైతు భరోసా అందని వారు కూడా మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అర్హులైన రైతులు ఈనెల 25 వరకు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించి తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.
స్పష్టత కరువు..
యాసంగికి సంబంధించిన రైతు భరోసా కోసం రైతులు మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. కొందరైతే పెట్టుబడి సాయంపై ఆశలు వదులుకున్నారు. ఆలస్యం జరిగినా యాసంగి పెట్టుబడి సాయం నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం మూడు రోజుల క్రితం ప్రకటించింది. ఈనెల 22 న మొదటి విడతలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేస్తామని, 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ చివరలో మూడో విడత నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అయితే రెండు, మూడు విడతలలో ఎన్ని ఎకరాలలోపు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ పరిషత్ ఎన్నికల కోడ్ వస్తే నిధులు జమ చేయడం కొనసాగిస్తారా, ఆపేస్తారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దీంతో అందరికీ పెట్టుబడి సాయం అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు యాసంగి సాయమే ఇంత ఆలస్యంగా ఇస్తుండడంతో వానాకాలంలో రైతుభరోసా ఇస్తారో లేదోనన్న చర్చ రైతుల్లో నడుస్తోంది.


