సర్కారుపై ఆర్టీసీ ఉద్యోగుల సమరనాదం | RTC employees union JAC announces second phase of agitation activities | Sakshi
Sakshi News home page

సర్కారుపై ఆర్టీసీ ఉద్యోగుల సమరనాదం

Jun 29 2026 5:06 AM | Updated on Jun 29 2026 5:06 AM

RTC employees union JAC announces second phase of agitation activities

విద్యుత్‌ బస్సుల పేరుతో బడా పారిశ్రామికవేత్తలకు  డిపోలు కట్టబెట్టడం దుర్మార్గం 

ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి 

రెండో దశ ఉద్యమ  కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ  

నేడు సీఎం, ఆర్టీసీ వీసీ–ఎండీ, చీఫ్‌ సెక్రటరీలకు షెడ్యూల్‌ అందజేత

సాక్షి, అమరావతి/గాందీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ఏపీఎస్‌ ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల పేరుతో ప్రైవేట్‌ ఆపరేటర్లకు అవకాశం కల్పించడమే కాకుండా విలువైన ఆర్టీసీ స్థలాలను కూడా వారికి లీజు పేరుతో కట్టబెట్టి, దశల వారీగా ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలపై ఏపీఎస్‌ ఆర్టీసీ జేఏసీ సమరనాదం మోగించింది. ఆదివారం విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. సంస్థ పరిరక్షణ, ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం, పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టనున్న రెండో దశ ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్‌ను జేఏసీ కన్వినర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు ప్రకటించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం వస్తున్న 1,050 విద్యుత్‌ బస్సుల కోసం నాలుగు డిపోలను పూర్తిగా ప్రైవేటు ఆపరేటర్లకు అప్పజెప్పారన్నారు. ఎనిమిది డిపోల్లో 50 శాతం స్థలాలను ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తున్నారని, భవిష్యత్‌లో రాబోయే 1,450 విద్యుత్‌ బస్సుల కోసం మరో 29 డిపోలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. 2029 నాటికి పూర్తిగా ఆర్టీసీ డిపోలన్నింటినీ బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టి ప్రైవేటీకరించే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 

విద్యుత్‌ బస్సులను ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలన్న తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించక పోవడంతో రెండో దశ ఉద్యమ కార్యాచరణను రూపొందించినట్లు స్పష్టం చేశారు. 29న సీఎం, ఆర్టీసీ వీసీ–ఎండీ, చీఫ్‌ సెక్రటరీలను కలిసి రెండో దశ కార్యాచరణ షెడ్యూల్‌ లేఖలు అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ కో–కన్వినర్లు పీవీ రమణారెడ్డి, జీవీ నరసయ్య, సీహెచ్‌ సుందరయ్య, ఎస్‌వీ శేషగిరిరావు, కె.సూర్యప్రకాష్ రావు, డి.మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.  

ఉద్యమ కార్యాచరణ ఇలా..
» జూలై 7, 8 తేదీల్లో ఏపీఎస్‌ ఆర్టీసీ పరిరక్షణ దినంగా పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ (పీటీడీ) ఉద్యోగులందరూ డిమాండ్లతో కూడిన ప్రింటెడ్‌ బ్యాడ్జీలు ధరించి విధుల నిర్వహణ. 
» జూలై 9 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేసి.. వారి మద్దతు, సహకారం కోరే కార్యక్రమం. 
» జూలై 19 నుంచి 26 వరకు ముఖ్యమంత్రికి ఉద్యోగుల ఆవేదనను తెలియజేసేలా వినతి పత్రాలపై సంతకాల సేకరణ. 
» జూలై 27న గ్రీవెన్స్‌ డే కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ల ద్వారా ఉద్యోగుల సంతకాల  సేకరణతో కూడిన వినతిపత్రాలు అందజేత. 
» జూలై 30న విజయవాడలో జేఏసీ రాష్ట్ర స్థాయి  సమావేశం.. తదుపరి కార్యాచరణ ప్రకటన. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement